2130* వ రోజు ....           20-Feb-2021

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

 

2130 ­* వ నాడు స్వచ్చోద్యమ చల్లపల్లి లో శ్రమదాన వినోదం.

 

ఈ శనివారం(20.02.2021) ఉపరితల ఆవర్తన కారణంగా వాతావరణం బాగా మారిపోయి, సన్న తుంపర నేపథ్యంలో గాలి, చలి ఉధృతమైనా సరే- చెక్కు చెదరని సంకల్పంతో- బెజవాడ దారిలోని విజయ పాఠశాల ముందర ఆగి, ఛాయా చిత్రంలో కనిపిస్తున్న 12+1 మందితో బాటు మరొక 19 మంది సైతం తమ తమ స్వచ్చాయుధ సంపత్తి తో  ప్రదర్శించిన శ్రమదానం పుణ్యమా అని సదరు బాటలు, పరిసరాలు, డ్రైనులు సకల కాలుష్య భారాలను దింపుకొని కనువిందు చేస్తున్నవి.

 

ఇందరు గృహిణులు, ఉద్యోగినులు, వయస్సు మళ్లిన వారు, డాక్టరమ్మలు, డాక్టరయ్యలు...  ఉదయం ఏ 3.40 కో మేల్కొని, 4.20 నుండి 6.20 దాక ఊరి దారుల కశ్మలాలు ఊడుస్తూ.. మురుగు గుంటలకు సైతం నడకలు నేర్పుతూ, సాధ్యమైనంత సుందరీకరిస్తూ, చిత్తు కాగితాలు ఏరుతూ - చిన్నప్పుడు మన పెద్దలు ”మట్టి పిసుక్కొని బతుకుతావురా!”, అనే తిట్లను సంతోషంగా నిజం చేస్తూ 2130*రోజులుగా ఎలా – ఎందుకు ఉద్యమిస్తారో ఇప్పటికీ నా గ్రామంలోని కొందరు అదృష్టవంతులకు అర్థం కానే కాదు!  ఏ  97 శాతమో హాజరై పాల్గొని, పరిశీలిస్తాను గనుక ఆ తత్త్వమేదో నాకు మాత్రం బోధపడింది. ఆ కిటుకు మరేమీ కాదు- “తమ విలువైన 2 గంటల వ్యవధిలో పాటుబడుతున్నాము గదా” అనే ఒక ఆత్మ సంతృప్తి మాత్రమే!

 

నేటి 30 మంది కార్యకర్తల శ్రమదాన కృషి సైతం రోజుటి వలెనే జరిగే కథే!  బెజవాడ బాటకు ఉభయ దిశల్లో నాలుగైదు నెలలుగా వెక్కిరిస్తున్న బురద మట్టి సంగతే!  సుందరీకర్తలది గూడ ఈ ప్రధాన రహదారి ని ఊడ్చి, గుంటల్ని పూడ్చి, విశాల పరచి, అడుగడుగునూ అద్దంలా తీర్చిదిద్దే గట్టి ప్రయత్నమే!

అదుగో-చీకట్లో, మురుగు కాల్వ అంచుమీద నిలబడి నీటి మీద తుక్కును ధైర్యంగా బైటకు లాగుతున్న ఆస్పత్రి నర్సుది కూడ ఎప్పటిలాగే  ఒక దైనందిన మెరుగుదల కృషే!  గ్రామస్తులంతా ప్రతిరోజూ ఒకే అన్నాన్ని విసుగు లేకుండ తిన్నట్లే- ఎవరి ప్రయత్నం వాళ్ళదే! ఎవరి తృప్తి వాళ్లదే!

 

 “ ఎవరి పిచ్చి వాళ్లకానందం” అని మన పాత నానుడి. ఈ స్వచ్చంద కార్యకర్తల ” పిచ్చి” మాత్రం  ఊరి మొత్తానికీ ఆనంద దాయకమూ, ఆదర్శ మార్గమూ, అభివృద్ధి పథమూ, అవశ్యమూ అభివందనీయమూ!

 

6.35 కు కాఫీ- కబుర్ల సమయం తరువాత, ప్రేమానందం గారి స్వచ్చ-లేత సొరకాయల వితరణ అనంతరం డాక్టరు గారి సమీక్ష పిదపBSNL  నరసింహా రావు గారు! 5.30 సమయంలోనే వచ్చి, స్వచ్చ కార్యకర్తలతో సహచరించి, సహకరించి, సహాను భూతిని పొందిన సహృదయులు -15 వ వార్డు విజేత నళిని, ఆమె పెనిమిటి శేఖర్ గారలు!  స్వచ్చ సైనికుల ఆశయాలకు ఎప్పటికీ సహకరిస్తామని మన స్పూర్తిగా వారు చెప్పడం మన గ్రామానికి శుభ పరిణామం!

 

రేపటి మన స్వచ్చంద శ్రమదాన బాధ్యతల కోసం ఈ బెజవాడ మార్గంలోనే వేకువ 4.30 కే కలుసుకొందాం!

 

నల్లూరి రామారావు, రిటైర్డ్ ప్రిన్సిపల్

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త

20.02.2021.