2131* వ రోజు ....           21-Feb-2021

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

 

 స్వచ్చ – స్వస్త- సుందర చల్లపల్లి నిర్మాణంలో 2131 ­* వ నాడు.

 

32 + (ఒక అతిథి) మంది సామాజిక చైతన్య వంతులు ఈ ఆదివారం (21.02.2021) నాటి వేకువ 4.26 నుండి రెండు గంటల పాటు పాటించిన శ్రమదానం సఫలమై, మూడు ఊళ్ల దారుల కూడలి(నడకుదురు- బెజవాడ-చల్లపల్లి) దగ్గరి NTR పార్కు- పెట్రోలు బంకు వంటి మరికొన్ని ప్రదేశాలు దర్శనీయంగా మారిపోయి, మన ఊరి పేరును సార్థకం చేస్తున్నాయి! ఈ కార్యక్రమమంతా మంచి చలి- మంచు- చీకట్ల వేకువలోనే! ఆ దగ్గర్లోని చేపల- కాఫీ అంగడులకు- పార్కులోకి  వచ్చిపోయే నడకల వారి- హారన్ల రొదలతో పయనిస్తున్న చిన్న- పెద్ద వాహనాల రద్దీల నడుమనే!

 

- మంచి నీటి అమ్మక కేంద్రం ఎదుటి విద్యుత్ స్తంభాల దగ్గర, దానికి దగ్గర్లోని రెవిన్యూ కార్యాలయం ఎదుట కనిపించిన బురద- మట్టి దిబ్బల్నే మహా ప్రసాదంగా భావించిన 20 మంది కార్యకర్తలు రెండు ముఠాలుగా విడిపోయి, రెండు ట్రక్కుల్ని నిలుపుకొని, తెల్లవారే సమయానికి వాటిని నింపి, శ్మశాన సౌకర్యం కోసం అక్కడికి తరలించారు. ఆదేమో మురుగు గుంటలోని సకల కశ్మలాలు నిండి, ఎండిన బురద! ప్లాస్టిక్ సంచులు, సారా ఖాళీ సీసాలు, పెంకులు, టీ కప్పులు, తిని ఖాళీ చేసిన టిఫిన్ పొట్లాలు, పాత గుడ్డ పీలికలు... ఒకటేమిటి- నానా కంగాళీలను విడదీస్తూ ఒకరిద్దరు మహిళా కార్యకర్తలు ఈ  మట్టి వీరులకు సహకరించారు. సన్నగా, పొడుగ్గా ఉన్న ఒక మహిళ మురుగు కాల్వ లోతట్టు గట్టు మీది రకరకాల తుక్కును, గడ్డిని, ఏరి- ఊడ్చి, శుభ్ర పరచడాన్ని వాట్సాప్ చిత్రంలో గమనించగలరు.

 

- సుందరీకర్తలు విద్యుత్ సంస్థ కార్యాలయం ఎదుట, పార్క్ సమీపంలోను బెజవాడ దారి అందాలకు మెరుగులు దిద్దుతూ శ్రమించారు.

- చీపుళ్ల కార్యకర్తలు తమ పనిలో తాము శ్రద్ధ పెట్టారు.

 

          వీరు కాక ఏడెనిమిది మంది గ్రామస్తులు-సొంత పనుల మీద వచ్చిన వారు ఈ స్వచ్చ- సుందరీకరణను  కాస్త చోద్యం చూశారు!

 

ఈ 30 మంది కార్యకర్తలు చలి సమయంలో వెచ్చగా- దుప్పట్లలో శయనించకుండ ఇలా రోడ్ల మీద దుమ్ములో, బురదలో ఎందుకు పని చేస్తారో- కరెంటు స్తంభాల నడుమ దూరి కూడ ఎలా శ్రమిస్తారో – టీ, టిఫిన్ అంగళ్ల వాడకం దారులు విసిరే ప్లాస్టిక్ ప్లేట్లను, గ్లాసుల్ని ఏరడమేమిటో – సగం మంది గ్రామస్తులిప్పటికీ ఆలోచించక, అర్థం చేసుకోకపోవడమే “ చిత్రం- భళారే విచిత్రం!...”

 

6.45 సమయంలో మోర్ల రాంబాబు అనే మన స్వచ్చోద్యమ శ్రేయోభిలాషి  గ్రామ శుభ్ర-సుందర సంకల్ప నినాదాలను విడగొట్టి పలికి, కార్యకర్తలను - ఉద్యమ సారథులనుఅభినందించడం ఈనాటి విశేషం!

 

గతంలో రాముడుపాలెం నివాసి వీరసింహుడు- టాంజానియాలో ఉంటున్న తమ మనుమడు “ కొర్రపాటి అభినవ్” ఆరవ జన్మదినం జ్ఞాపికగా “ మనకోసం మనం” మేనేజింగ్ ట్రస్టీ రామ కృష్ణ ప్రసాదు గారికి 666/- విరాళమందించడం మరొక స్పూర్తిదాయక విశేషం!

 

ఈ విజయవాడ బాటలోనే - NTR పార్కు, పెట్రోలు బంకుల దగ్గరే - మనం కలువదగిన మరొక దినం 23.02.2021 – మంగళవారం. సమయం – వేకువ 4.30.

 

       ఇది మా నవ సమాజం!

వంచనలతొ కపటాలతొ కుంచించుకు పోతున్నది!

“నేను-నాకు-నాది” తప్ప “మన” మన్నదె అనకున్నది!

సమష్టి దృక్పథాన్ని వదలి వ్యష్టి సుఖం కోరుతోంది!

స్వచ్చోద్యమ లక్ష్యాలకు సహకరించలేకున్నది! 

 

నల్లూరి రామారావు, రిటైర్డ్ ప్రిన్సిపల్

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త

21.02.2021.