2132* వ రోజు ....           23-Feb-2021

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

 

 స్వచ్ఛ సంబర చల్లపల్లిలో 2132* వ నాటి శ్రమదాన వినోదం.

 

ఈ వినోదం నేటి (23.02.2021 మంగళవారం వేకువ) 4.30 కి అటు – ఇటుగా మొదలై 6.30 దాక – సుమారు 2 గంటల పాటు విస్తరించింది. ఆ వినోదకారులు 33 మందికి పైగానే! అంతకు ముందే నిర్ణయించుకొన్న బెజవాడ దారిలో – NTR పార్కు – మూడు రోడ్ల కూడలి దగ్గరే ఈ శ్రమదానం! పార్కులో ఉదయం నడకకో, దూర ప్రయాణాలకో, ఇంధనం నింపుకొందుకో వచ్చి పోయే వందల మంది సమక్షంలోనే – ఇంకా రహదారి మీద వేగంగా పయనించే వందలాది చిన్న – పెద్ద వాహనాల రద్దీ నడుమనే ఈ చిరకాల చోద్యం చోటు చేసుకొన్నది!

 

“బ్యూటీ లైస్ నాట్ ఇన్ ద  హోల్డర్; బట్ ఇన్ దివ్యూయర్...” (అందమనేది వస్తువులో ఉండదు; చూసే చూపులోనే ఉంటుంది...) అని షేక్స్పియర్ చెప్పినట్లు – శ్రమ జీవన సౌందర్యం కూడ స్వచ్చంద శ్రమదాతల్లో కాక, చూసి – అవగాహన చేసుకొనే – అభినందించగల వ్యక్తుల్లోనే ఉంటుంది. ఇది నిజం కాకపోతే – ఈ చల్లపల్లి స్వచ్చోద్యమ సౌందర్యాన్ని, నిబద్ధతని, ఆశయాన్ని ప్రత్యక్షంగా చూసి, పాల్గొని, అభినందించి, సహకరించే సహృదయులెందరో – అంత ర్రాష్ట్ర – అంతర్జాతీయులు పదే పదే ఎందుకిక్కడికి రావాలి? ఇప్పటికీ కొందరు ఇదే గ్రామస్తులు ఈ స్వచ్చోద్యమానికి అంటీ – ముట్టక ఎందుకుండాలి?

 

నేటి గ్రామ - స్వచ్ఛ – శుభ్ర – సుందరీకరణ కర్మాచరణలో పాల్గొన్న 32 మందిలో సాక్షాత్తు గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ లు కూడ ఉండడమే విశేషం! నిన్నటి తమ గెలుపును సవినయంగా, సబాధ్యతగా స్వీకరించడమే కాదు – తమ గ్రామ స్వచ్ఛ – సుందర ప్రయత్నంలో నిర్నిబంధంగా ఇకముందు కూడా పాల్గొంటామనీ, తమతో బాటు మిగిలిన పాలక వర్గాన్ని కూడ – 80 – 90 మంది గ్రామ వాలంటీర్లతో సహా - ఈ స్వచ్ఛ- శుభ్ర – యజ్ఞంలో భాగస్వాములుగా చేస్తామనీ, రాబోయే ఐదేళ్లూ తమది అధికారలాలస కాక, త్యాగధనులైన స్వచ్చంద కార్యకర్తలతో భుజం కలిపి, గ్రామాభ్యుదయ కృషి మాత్రమేననీ ఉభయులూ ప్రకటించడం మన చల్లపల్లికి నిజంగా శుభసూచకం!

 

కార్యకర్తల నేటి కృషి త్రిముఖంగా సాగింది :

 

 - బెజవాడ బాట వైశ్యాల్యాన్ని, సౌకర్య – సౌందర్యాలనీ, నాలుగైదు నెలలుగా దెబ్బ తీస్తున్న - ఎండి బిగిసిన బురద మట్టి తరలింపు. ఈ పనిలో ఇంధన నిలయం ప్రక్కన, రెవెన్యూ కార్యాలయం ఎదుట రెండు ట్రాక్టర్లు నింపుకొని శ్మశానానికి తరలించిన సుమారు 18 మంది. వీళ్ళంతా రెండు నెలలుగా ఈ విభాగంలో బాగా రాటు తేలిపోయారు!

 

- NTR పార్కు, విద్యుత్ కార్యాలయం, ఇండియన్ ఆయిల్ బంకు, మూడు రోడ్ల కూడలి – తదితర చోటుల్ని ప్లాస్టిక్ – చెత్త – దుమ్ము – ధూళి రహితంగా ఏరి, లాగి, ఊడ్చి, డిప్పలతో ఎత్తి ట్రాక్టర్ లో నింపిన పదిమంది కృషి. వాహన రాకపోకల నడుమ చాకచక్యంగా, లాఘవంగా వీళ్ళు ఆ పని చేయడం చూడడమే ప్రతి రోజూ నాకొక మజా!

 

- దారి ప్రక్క వీర బ్రహ్మం మఠం దగ్గర మన డాక్టరు గారికి ప్లాస్టిక్ కప్పుల, ప్లేటుల, సంచుల – పాత గుడ్డల, తిను బండారాల “నిధి దొరికింది – ఆయనతో బాటు మరొక గృహిణి కూడ (ఈమె నేటి పులిహోర పంపిణీ దారు! – ఇలాంటివి ఆమెకొక ఎడతెగని మంచి వ్యసనాలు!) కలిసి పెద్ద గుట్టడు కశ్మలాలు సేకరించారు!

 

6.45 వేళ తన గ్రామ స్వచ్ఛ – శుభ్ర – సౌకర్య – సౌందర్య సంకల్ప నినాదాలను ముమ్మారు చాటి చెప్పినదీ, తన గెలుపు పట్ల కృతజ్ఞతలు తెలిపినదీ పైడిపాముల కృష్ణకుమారి గారు. నేటి కార్యకర్తల శ్రమను సమీక్షించినదీ, మెచ్చినదీ డాక్టరు దాసరి రామకృష్ణుల వారు!

 

రేపటి మన ఊరి మెరుగుదల ప్రయత్నం కోసం ఈ విజయవాడ దారిలోని పెట్రోలు బంకు వద్దనే 4.30 కి కలుసుకొందాం!

 

(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర మన చరిత్ర - 1

 

శుచీ శుభ్ర సౌందర్యం మా దారిదె అదృష్టం 

అట్టడుగున బయలుదేరి అందుకొన్న శిఖరాగ్రం

వివిధ వర్ణ సుమనోజ్ఞం సువిశాల జనాకర్షకం

ప్రత్యంగుళ శోభతోడ ప్రజానంద దాయకం!

 

నల్లూరి రామారావు, రిటైర్డ్ ప్రిన్సిపల్

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త

23.02.2021.