1877 * వ రోజు....           01-Jan-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1877* వ నాటి నూతన సంవత్సర శ్రమదాన విశేషాలు.

 

ఈ కొత్త సంవత్సరంలో చల్లపల్లి స్వచ్చ సైనికులు, సోదర గ్రామస్తులు నిండు సుఖ, శాంతులతో వర్ధిల్లాలని, స్వచ్చ సుందర స్పృహ మరింత పెరగాలనే అభినందనలతో ......

 

ఈ రోజు వేకువ 4.05 – 6.15 నిముషాల నడుమ సంభవించిన స్వచ్చ సేవలు 85 శాతం గాంధీజీ స్మృతి వనం లోపల, బయట జరిగినవి. పాల్గొన్న ధన్యులు 35 మంది. మొదటిగా చెప్పవలసింది స్మృతి వనం ఆవరణలోని ఇరువైపుల పచ్చిక బయళ్ల (లాన్)లో గుబురులుగా పెరిగిన సగం ఎండుతున్న గడ్డిని నేలపై కూర్చొని కొడవళ్లతో తరిగి  ప్రదేశమంతటినీ సమ స్థాయికి తేవడం ఒక్కొక్క దానిలో డజను మంది చొప్పున కార్యకర్తలు ఇవి తమ పెరళ్ళేమో అన్నట్లు దీక్షగా గుబుళ్లన్నిటినీ కోసి ఆ తుక్కునంతటినీ పోగులు చేసి ట్రాక్టర్ లో నింపి గ్రామంలోని దారుల ప్రక్క గుంటలలో సర్ది వచ్చారు. కొందరు కొన్నాళ్ల నుండి నీరు లేక ఎండుతున్న ఈ పచ్చిక బయళ్లకు, అందలి పూల , అందమైన ఇతరమైన మొక్కలకు నీరందించారు.

 

యథావిధిగా ఆరేడుగురు గ్రామ పరిరక్షక దళం, విద్యుత్తు భవనం ముందు డ్రైను ప్రక్కన ఉన్న మట్టిని ట్రాక్టర్ లో నింపి తెచ్చి 6 వ నంబరు పంట కాలువ వంతెనకు పడమరగా పోవు రోడ్డు గుంటలన్నీ సరిచేసి యడ్ల బళ్ళ, ద్విచక్ర వాహనాల రాకపోకలకు భద్రత కల్పించారు.  నిన్నటి, నేటి వీరి కృషి ఫలితంగా ఆ దారి ఇప్పుడు సుగమమయింది.

 

గాంధీ స్మృతి వనం వెలుపల డ్రైను నూ, రెండు ప్రక్కల ఉన్న ఇతర ఖాళీ స్థలాలను కొందరు పిచ్చి మొక్కలను తొలగించి, డిప్పలతో సేకరించి ట్రాక్టర్ లో నింపారు.

 

ఈ రకరకాల శ్రమదానమంతా – గత రాత్రి కొత్త సంవత్సర వేడుకలలో మునిగి మిగిలిన గ్రామస్తులలో చాలా మంది నిద్రిస్తున్న సమయంలోనే జరగడం విశేషం.

 

కొత్త సంవత్సర వేడుకలు కార్యకర్తల శ్రమదాన స్థలం వద్ద కూడా జరిగినది. ఎక్కడో విశాఖపట్నంలో ఉన్న సీనియర్ కార్యకర్త శంకర శాస్త్రి గారు కార్యకర్తలకు మిఠాయిల పంపిణీ జరిపించారు. ఉడత్తు రామారావు గారు బిస్కెట్ పొట్లాలను, చాక్లెట్లను పంచారు. సూర్యదేవర నాగేశ్వర రావు గారు కేకు ముక్కలను కార్యకర్తలకందచేశారు.

 

నూతన సంవత్సర – నూతన మాస సందర్భంగా కస్తూరి వరప్రసాద్ గారు మనకోసం మనం ట్రస్టుకు 3000/- లను, నారంశెట్టి వేంకటేశ్వర రావు గారు 2000/- లను, ఘంటా లీలా కృష్ణ గారు 505/-లను విరాళంగా ఇచ్చినందుకు స్వచ్చ సైన్యం తరపున ధన్యవాదాలు.

 

నూతన సంవత్సర అదనపు ఖుషీలో ఉన్న BSNL బాబూరావు గారు ముమ్మారు తడబడకుండా చెప్పిన స్వచ్చ సుందర సంకల్ప నినాదాలతో, కొసరుగా బాబూరావు చేసిన ఆనంద స్వచ్చ నృత్యంతో 6.55 నిముషాలకు నేటి మన బాధ్యతలు ముగిసినవి.

 

ఈ రాత్రి పద్మావతి ఆసుపత్రి 32 వ వార్షికోత్సవ వేడుకలకు కార్యకర్తలందరూ హాజరై  పొద్దుపోయే వరకు ఉండవలసినందున రేపటి మన గ్రామ బాధ్యతలను కీర్తి ఆసుపత్రి దగ్గర నుండి మొదలుపెడుదాం.

 

            ప్రశ్నించాలని ఉన్నది.

ఏ జిగీష- ఏ చింతన వీరిని నడిపిస్తుందోనని...

ఏ పావన లక్ష్యంతో వీళ్లు ముందు కెళ్లారని...

సమకాలిక సగటు మనిషి స్వస్తత సమకూరిందని...

స్వచ్చోద్యమ చల్లపల్లి సాధించని దేముందని ....

 

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

బుధవారం – 01/01/2020

చల్లపల్లి.