1878 * వ రోజు....           02-Jan-2020

  

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1878* వ నాటి పోకడలు.

 

ఐదారేళ్ల సుదీర్ఘ స్వచ్చోద్యమ ప్రస్థానంలో ఈ వేకువ 4.45-615 నిముషాల మధ్య సంభవించిన గ్రామ శుభ్ర సుందరీకరణలో పాల్గొన్న కార్యకర్తలు 25 మంది. ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా నిన్న పద్మావతీ ఆసుపత్రి 32 వ వార్షికోత్సవ వేడుకలు ఒంటి గంట దాకా జరిగి, అందులో స్వచ్చ సైనికులు మహోత్సాహంతో పాల్గొనడంతో కీర్తి హాస్పిటల్ దగ్గర మొదలైన గ్రామ బాధ్యతల వేళ మారింది, కార్యకర్తల సంఖ్య కూడా మారింది.

 

బందరు దారి కిరుప్రక్కల ట్రస్టు కార్మికులు, స్వచ్చ కార్యకర్తలు ప్రధానంగా చీపుళ్లకే పని చెప్పి, దుమ్ము, ఇసుక, ఇతర వ్యర్ధాలను ఊడ్చి, పోగులు చేస్తుంటే కొందరు వాటిని డిప్పలతో సేకరించి ట్రస్టు వాహనం లోని కెక్కించి, అవసరమైన చోట్ల వినియోగించారు. SBI, రాజా గారి కళాశాల, రిజిస్ట్రారు కార్యాలయం, దంత వైద్యశాల ల మీదుగా వీరి సుందరీకరణ చర్యల తో భారత లక్ష్మీరైస్ మిల్లు అడ్డ దారి దాకా ఇప్పుడీ మార్గమంతా మరింత సువిశాల-శుభ్ర సుందరంగా కనిపిస్తున్నది.

 

నిన్నటి వైద్యశాల వార్షికోత్సవాలలో ఆడి-పాడి-వినోదించిన కార్యకర్తలు కేవలం నాలుగు గంటల విరామం తో నేటి శుభోదయ స్వచ్చీకరణలో పాల్గొనడమే  పెద్ద విశేషం. “ ఈ స్ఫూర్తి-ఈ నిబద్ధతలే మాకు నిరంతర ప్రేరణ” అని స్వచ్చోద్యమ చల్లపల్లి సారధులైన మన ఆదర్శ వైద్యులు తరచూ చెప్తుంటారు. కార్యకర్తలేమో “వాళ్లిద్దరే మాకు తరగని నిరంతర ప్రేరణ ....” అని భావిస్తుంటారు!  నాబోటి వాళ్లను మాత్రం ఈ రెండు వైపుల స్ఫూర్తి నడిపిస్తుంటుంది.

 

అమెరికా లోని న్యూయార్క్ లో స్థిర పడుతున్న మల్లంపాటి సందీప్ అనే యువకుడు అంతకు ముందు వాట్సాప్ సందేశాలను క్రమం తప్పక అనుసరిస్తూ – ఈ వేకువ ప్రత్యక్షంగా స్వచ్చంద శ్రమదానంలో పాల్గొన్నారు. మన చిరకాల నిబద్ధ కార్యకర్త-శివరామపురం నివాసి ప్రేమానందం గారి పెద్ద కుమారుడీయన. ఆచరణాత్మకమైన స్వచ్చోద్యమ చల్లపల్లి సందేశాన్ని ఈయన అభినందించారు.

 

ప్రేమానందం గారు ముమ్మారు ఎలుగెత్తి చాటిన గ్రామ స్వచ్చ-శుభ్ర-సుందర సంకల్ప నినాదాలతో 6.40 నిముషాలకు నేటి మన కర్తవ్య నిర్వహణ ముగిసింది.

 

రేపటి బాధ్యతల కోసం విజయవాడ దారిలోని గాంధీ స్మృతి వనం దగ్గర కలిసి, నిన్నటి తరువాయి కృషిని కొనసాగిద్దాం.

 

       మదీయ లేఖిని స్వచ్చ గానం

స్వచ్చ సైన్యం ఎంత వరకీ సాహసాలను ప్రదర్శిస్తే-

అలుపెరుంగని సుందరీకరణాంశమిట్లే ముందు కొస్తే-

హరిత వర్ణం-ప్రాణ వాయువులలమి గ్రామం స్వస్తమైతే-

అంతదాక మదీయ లేఖిని ఆలపించును స్వచ్చ గీతం!

 

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

గురువారం – 02/01/2020

చల్లపల్లి.