1879 * వ రోజు....           03-Jan-2020

  

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1879* వ నాటి ప్రాధాన్యతలు.

 

ఈ దినం 4.05-6.15 నడుమ వేళలో- విజయవాడ దారికి తూర్పు దిక్కున- ప్రభుత్వ పాఠశాల ప్రక్కన గాంధీ స్మృతి వనంలో చోటు చేసుకున్న స్వచ్చంద శ్రమదానంలో భాగస్వామ్యం 35 మందిది. ఇందులో నలుగురు, ముగ్గురు వేర్వేరు చోట్ల భిన్న కర్తవ్యాలు నిర్వర్తించారు.

 

స్మృతి వనంలోని రెండు భాగాలలో మిగిలిన కార్యకర్తలు విడిపోయి, అక్రమంగా పెరిగిన-సగం ఎండిపోతున్న లాన్ ను శుభ్ర-సుందరీకరించే ప్రయత్నం చేశారు. ఒక ప్రక్క శీతల ప్రకృతి, చీకటి-ప్రక్కనే  మైకు నుండి వినిపిస్తున్న అర్ధవంతమైన- సమాజ కర్తవ్యాన్ని మాటిమాటికీ గుర్తు చేస్తున్న  హెచ్చరిస్తున్న శ్రావ్యమైన ప్రబోధ గీతాలు! 1879 రోజులుగా- నిస్వార్ధంగా, తమ సామాజిక కర్తవ్య నిర్వహణ దీక్షలో సాగిపోతున్న పాతిక మందికి పైగా  ఈ స్వచ్చ సైనికులు! ఏ కవికైనా రాజుల యుద్ధ విన్యాసాలకన్న- రాణుల ప్రేమపు రాణాల కన్న ఇవే తక్షణ ప్రేరణలు కావాలి!

 

గ్రామ రక్షక దళం వారు విజయా కాన్వెంట్ సమీపంలోని రోడ్ల పార్శ్వాల ఎత్తు పల్లాలు కొన్నిటిని డ్రైన్ల మట్టితో సరిజేశారు. హైదరబాద్ , అమెరికా లోని దాతలు, శ్రేయోభిలాషులకు, సామాజిక (వాట్సాప్) మాధ్యమ వీక్షకులు కొందరికి అప్పుడే దిగులు, సందేహం మొదలైయిందట- మరో పదేళ్ల తర్వాత ఈ స్వచ్చ రథసారధులు, సైనికులు లేకపోతేనో, విరమిస్తేనో ఈ చల్లపల్లి స్వచ్చ-శుభ్ర-సౌందర్య బాధ్యతలు ఏమైపోతాయి...... ? అని దశాబ్దం తర్వాత అలాంటి పరిస్తితి వస్తే గిస్తే-ఇప్పుడు నాటిన చెట్లు వృక్షాలై, శ్మశానం, డంపింగ్, వానపాముల సహజ సిద్ధ ఎరువుల కేంద్రం వంటివి కొన్ని తరాలు మన గ్రామస్తులకు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూనే ఉంటాయి! ఈ స్వచ్చ శ్రమ జీవన స్రవంతి అనంతంగా తరం నుండి తరాల దాకా ప్రవహిస్తూనే ఉండాలి!  

 

ముగ్గురు కార్యకర్తలు స్మృతి వనం వెలుపల డ్రైనును, గట్లను అద్దంలా శుభ్రపరచడంలో తమ ఆనందాన్ని సాధించుకొంటున్నారు.

 

ఈనాటి శుభ పరిణామం మరొకటి-కొంత కాలం నుండి సందిగ్దంలో ఉన్న 1) 6 వ నంబరు కాలువ ఉత్తరపు గట్టు మీద 4 (3.75 ) మీటర్ల తారు రోడ్డును,

 

2) డంపింగ్ యార్డులోని సిమెంటు దారి పొడిగింపు ను ఈ రోజు ప్రారంభించనుండడం! ఇందుకు మన శాసన సభ్యుడు రమేష్ గారికి ధన్యవాదాలు.

 

రేపటి మన శ్రమదాన బాధ్యతను బైపాస్ మార్గంలోని 1 వ నంబరు వార్డు నుండి సామ్యవాద (కమ్మ్యూనిస్టు) మార్గందాక నిర్వహిద్దాం.  బైపాస్ రోడ్డు లో కమ్మ్యూనిస్టు బజారు వద్ద కలుద్దాం.

 

6.45 నిముషాలకు నేటి మన గ్రామ సంక్షేమ బాధ్యతకు ముమ్మారు స్వచ్చ-శుభ్ర-సుందర సంకల్ప నినాదాలతో శుభం పలికినది పల్నాటి రాజబాబు, తానికముందు స్వచ్చంద శ్రమదానానికి మానకుండా వస్తానని ఆయన సంకల్పించారు.

 

        వివరించగ జూస్తున్నా.

ఏది కష్టమనుకొంటిమొ-అది మరింత సులభమనీ

చెప్పేవన్ని చేసి చూపు చేవలు తమకున్నవనీ

గ్రామహితమ్ కన్న తమకు కాదేదీ మిన్నయనీ

అర దశాబ్ది పర్యంతం స్వచ్చ భటులు చాటిరనీ...

 

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

శుక్రవారం – 03/01/2020

చల్లపల్లి.