1880 * వ రోజు....           04-Jan-2020

  

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1880* వ నాటి శ్రమదాన వార్తలు.

 

ఈ వేకువ 4.03-6.16 నిముషాల నడుమ 39 మంది(34+5 గురు అతిథులు, పెద్దలు) పాల్గొన్న శ్రమదాన వేడుకతో సామ్యవాద(కమ్యూనిస్ట్) వీధి పరిసర బైపాస్ మార్గం మరింత స్వచ్చ-శుభ్ర-సుందరంగా మారింది. ఒక లెక్కన చూస్తే 60 నికర పని గంటల శ్రమదానం అనుకోవాలి. (ఇతరులెవరైనా 10-15 పని గంటల్లో ఈ పని చేసేయ వచ్చనుకొంటారు. స్వచ్చ కార్యకర్తల పరిపూర్ణతా (పర్ ఫెక్షన్) కృషికి మాత్రం ఇంత సమయం).

 

 బైపాస్ దారికి రెండు ప్రక్కల గడ్డి-పిచ్చి మొక్కల తొలగింపు, దుమ్ము, ఇసుకల ఊడుపు, ప్లాస్టిక్ వ్యర్ధాల సేకరణ వంటి వి యథావిధిగా జరిగిపోయినవి. ఏడెనిమిది మంది శ్రమదాతలు ఇందుకు కృషి చేశారు.

 

ఎక్కువ మందికి పని కల్పించింది మాత్రం విజయనగర్ తొలి వీధి ముమ్మొదటి ఖాళీ స్థలమే.(అదృష్టవంతులైన దాని యజమాని ఎవరో గాని ఈ జాగాని స్వచ్చ కార్యకర్తలు ప్రతి ఏటా రెండు మార్లు శుభ్ర పరుస్తూ ఉన్నారు!)

అడవిని తలపించే ఆ చోటులోని ముళ్ల-పిచ్చి చెట్లను, కంపను, తీగల్ని, విద్యుత్ శాఖ వారు నరికి-ఎండిన కొమ్మల్ని నరికి-లాగి-ఏరి-ట్రాక్టర్ లో నింపి, చెత్త కేంద్రానికి తరలించడమే నేటి స్వచ్చ కార్యకర్తల ముఖ్య వ్యాపకం!

 

దీనికి కొసరుగా ఒక పావుగంట పాటు కొందరు పై స్థలానికి వ్యతిరేక (దక్షిణ)దిశలోని మా ఖాళీ స్తలంలోని కొద్దిపాటి చెట్లను, కంపను కూడ తొలగించారు.

 

గ్రామ సుందరీకరణ దళం వారు కమ్యూనిస్ట్ వీధి మొదటిలోని మా స్తలం మొండి ప్రహరీని, బైపాస్ వీధి ప్రక్క ఇంటి ప్రహరీని నీళ్లతో కడిగి, ఆరబెట్టి , ప్రైమర్ పూశారు.  

 

అమెరికా ప్రవాసులైన ఇద్దరు-వాసిరెడ్డి రాహుల్, రావి అనిల్, ఖమ్మం జిల్లా నుండి విశ్రాంత ఉపాధ్యాయుడు పూర్ణ చంద్ర రావు గారలు నేటి మన స్వచ్చ సుందర కృషికి చుట్టాలుగా వచ్చి, ఆశ్చర్యంగా- ఆసక్తిగా పరిశీలించారు. రాహుల్ విజయా కాన్వెంట్ లో రేపటి తన తండ్రి గారి సంస్మరణ (ఏడూరు) కార్యక్రమానికి రావలసిందిగా కోరారు. స్వచ్చ సుందర చల్లపల్లి హితాభిలాషులు, కొంత వరకూ దానికి కర్తలు ఐన దాసరి రామ మోహన రావు – స్వర్ణలత గార్లు కొంత సమయం ఈ శ్రమదాన విన్యాసాలను ఆనందంగా తిలకించి, ఆశీర్వదించి, స్వర్ణలత గారు శ్రావ్యంగా పాట పాడి అలరించారు.

 

మనకోసం మనం ట్రస్టుకు ప్రాతూరి శాస్త్రి బహూకృత వినూత్న పాన పాత్రలలోనే నేటి కాఫీ ఆస్వాదన జరిగింది. మన స్వచ్చోద్యమ వృద్ధ బాలుడు మాలెంపాటి గోపాల కృష్ణయ్య గారి 2000/- విరాళానికి, కస్తూరి శ్రీనివాసుని 516/-దాతృత్వానికి స్వచ్చోద్యమ చల్లపల్లి ధన్యవాదాలు!

 

వాసిరెడ్డి రాహుల్ ముమ్మారు ప్రకటించిన స్వచ్చ-సుందర-గ్రామ సంకల్ప నినాదాలతో 6.45 నిముషాలకు నేటి మన బాధ్యతలకు స్వస్తి!

 

రేపటి మన “కర్మణ్యేవాధికారం... “ సజ్జా ప్రసాదు గారి వీధి-(బైపాస్ దారిలో) దగ్గర నుండి చెలాయించవచ్చు!

 

         స్వచ్చ సైనికుడు అంటే

తనతొ బాటు తన ఊరూ స్వచ్చ శుభ్రమవ్వాలని-

తన గ్రామం-తన దేశం ధన్యమాన్యమవ్వాలని-

కలవరించి ఆరేళ్లుగ కష్టపడే ధన్యజీవి

అతడు ద్రష్ట- అతడు స్రష్ట-మానవతకు పరాకాష్ట!

 

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

శనివారం – 04/01/2020

చల్లపల్లి.