2167* వ రోజు ....           08-Apr-2021

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

స్వచ్చోద్యమ చల్లపల్లిలో 2167* వ నాటి సార్ధక శ్రమదానం.  

 

గురువారం (08.04.2021) వేకువలోనైతే 14 మంది సముచిత శ్రమదాతలకు మరీ 4.16 కే తెలవారిపోయింది.

 

         నిన్న – మొన్నటి శ్రమ సత్ఫలితాలనిచ్చిన విజయ నగర్, అశోక్ నగర్ లలోని కష్టార్జిత శుభ్ర – సుందరీకృత ప్రదేశాలకే మరికాస్త పొడిగింపులు! విజయ నగర్ విశిష్టతను చాటి చెప్పుతూ ముగ్గురు స్థానికులతో బాటు స్త్రీ – పురుష కార్యకర్తలు మొత్తం 27 మంది సుమారు గంటన్నర కాలం స్వచ్చందంగా నిర్వహించిన గ్రామ మెరుగుదల కృషితో విజయ్ నగర్ 3 వీధులు, వాటి లోతట్టు భాగాలు మరికొంత అందంగా, విశాలంగా, సౌకర్యంగా మారినవి.

 

పైన వ్రాసిన సార్ధక’, సముచిత అనే పదాలు ఎందుకు వాడవలసి వచ్చిందంటే చరిత్ర కాలం నుండి ఈ గ్రామం మంచివో, చెడ్డవో గాని ఉద్యమాల పురిటిగడ్డ! రాచరిక వ్యవస్థలు, కమ్యూనిస్ట్ ఉద్యమాలు, ఇక ఇప్పుడు ఏడేళ్ల నుండైతే – ఈ ధరిత్రి ఎన్నడూ చూడని ఒక విలక్షణ - స్వార్ధరహిత స్వచ్చ – శుభ్ర – సుందర ఉద్యమం ఇక్కడే విస్తరించాయి! పాతకాలపు ఉద్యమాలేమో కొందరు మెచ్చేవి, మరికొందరు నొచ్చేవి. దేశ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన ఈ చివరిది మాత్రం ఎవరూ నొచ్చుకోనిదీ, ఆమోదయోగ్యమూ, ఆవశ్యకమూ! లేకుంటే – ఇన్ని వేల దినాలుగా – ఇన్ని నేపధ్యాల వ్యక్తులు ఎందుకు కలిసివస్తారు? తక్కిన వేలాది ఊళ్ళ కన్న ఈ గ్రామం మిన్నగా ఎందుకు రూపొందుతుంది?

 

వీధి పారిశుద్ధ్య సేవకు హాజరైన కార్యకర్తలు 3 భాగాలుగా విడిపోయి, మూడు విధాలుగా పాటుబడిన కృషి ఇలా ఉన్నది :

 

- సుందరీకర్తల ప్రయత్నాలు, ప్రణాళికలూ, వీధుల్ని తీర్చి దిద్దే పద్ధతులే వేరు! నిన్న కొందరు కార్యకర్తలు ఊడ్చిన చోటే – రకరకాల కశ్మలాలు ఏరి, శుభ్రంగా ఉన్న ప్రాంతమే – మరి, ఆ బైపాస్ మార్గమే ఈ వేకువ సమయాన రైల్వే పారలతో, గోకుడు పారలతో, చీపుళ్లతో వీళ్ళ చేతులు, బుర్రలు పనిచేశాక – తెల్లవారేపాటికి మరింత సుందరంగా, క్రొత్తగా, ప్రత్యేకంగా కనిపిస్తున్నది!

 

- మిగిలిన కార్యకర్తలు విజయ నగర్ లోని 3 వీధుల్లో శ్రమదానంతో విజృంభించిన తీరు, విచక్షణతో ఆ చిన్న వీధుల్ని శుభ్రపరిచిన వైనం ప్రత్యక్షంగా చూడడం, పాల్గొనడం – అదొక క్షణికమైనా, శాశ్వతమైన అనుభూతి! దంతెలతో తుక్కును లాగే వారు, కత్తులతో దారి అంచుల పనికిరాని మొక్కలు తొలగించే వారు, తామే గతంలో నాటి పెంచిన పుష్పభరిత మొక్కల పాదులు సరిజేసే వారు, పలుగులతో గాతాలు తీసి, కర్రలు పాతి, ఆసరా కల్పించే వాళ్ళు వీరే మరి!

 

- విజయ నగర్ చివర, అడ్డ రోడ్డులో ఐతే – సమయం మించుతున్నది కాబోలు – కార్యకర్తల పనుల్లో ఒడుపు, వేగం పెరిగాయి. మాలెంపాటి డాక్టర్ గారి ఇంటి దగ్గర రోడ్డు కడ్డంగా క్రమ్ముకుపోయిన చెట్ల కొమ్మల్ని ట్రాక్టర్ పైకెక్కి మరీ తొలగించారు. ఇందుకు సమాంతరంగా వ్యర్ధాల గుట్టల్ని ట్రక్కుల్లోకి చేర్చి, డంపింగ్ కేంద్రానికి తరలిచడం కూడా జరిగిపోయింది.

 

ఐతే – ఎప్పుడైనా మన బోటి వాళ్లం ఒక్కటే కోరుకొంటాం – గ్రామ సోదరుల్లో బద్ధకం కాస్త తగ్గాలనీ – పౌర సామాజిక బాధ్యత మరికాస్త పెరగాలనీ – పంచాయితీ వ్యవస్థ మరింతగా చురుకుగా మారాలనే .... అప్పుడిక స్వచ్చంద కార్యకర్తల పని భారం తగ్గుతుందనీ...

 

ఈ ఉదయం ఎన్నికల వేళ కావడంతో అరగంట ముందు గానే శ్రమదానం ముగిసింది. 6.00 సమయంలో మాలెంపాటి అంజయ్య గారి గ్రామ స్వచ్ఛ – శుభ్ర – సుందర ప్రతిజ్ఞలు ముమ్మారు మారుమ్రోగి, నేటి మన బాధ్యతకు స్వస్తి.

 

రేపటితో బహుశా ఈ బైపాస్ మార్గం బాగు చేత ముగియవచ్చు. కనుక మన బాధ్యతా నిర్వహణ కోసం వాసిరెడ్డి వారి అశోక నగర్ వీధిలోనే మన కలయిక!           

 

        ప్రగతి రాచబాట పట్ల....

 

ఎందుకిలా గ్రామానికి ఇన్నివేల దినాలుగా

శ్రమనూ – సమయం – ధనమూ సమర్పించుచున్నామో –

పని సంస్కృతి ప్రబలుటకై పాటుబడుచు వచ్చామో –

ప్రగతి రాచ మార్గంలో ప్రతి యొకరికి స్పష్టతుంది!   

  

ఒకానొక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

08.04.2021.