2168* వ రోజు ....           09-Apr-2021

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

స్వచ్ఛ సుందర చల్లపల్లి సుదీర్ఘ ఉద్యమంలో 2168* వ ఘట్టం.

 

ఈ శుక్రవారం (09.04.2021) 13 మంది కార్యకర్తల ముహూర్తం వేకువ 4.18! కార్యక్షేత్రం విజయ/అశోక నగర్ల ఇరుకు వీధులు! నేటి ఆదర్శ శ్రమదాన విరమణ 6.20 కి! గ్రామ పారిశుద్ధ్య సాధనకు అంకితులైన మొత్తం శ్రమదాతలు 28 మంది! మరి, ఇంత పెద్ద ఊరి కాలుష్యాలన్నిటికీ ఈ కొద్ది మంది కార్యకర్తలు జవాబు చెప్పగలరా?

 

వందల కొద్దీ రోడ్లనలా ఉంచి, ప్రధాన వీధుల, మురుగు గుంటల, ప్రధాన రోడ్ల గుంటల, రద్దీ కేంద్రాల సంగతైనా సాధ్యపడేనా? ప్రజల ఆలోచనల, అలవాట్ల సానుకూల మార్పులు ఇంకా ఎంత కాలానికి? “స్వచ్ఛ – శుభ్ర – సుందర – ఆరోగ్య – ఆనంద చల్లపల్లి అనే రంగుల కల సాకారం కావడానికి ఎంత సమయం పడుతుంది?... ఇలాంటి చాల ప్రశ్నలన్నిటినీ కాలమే పరిష్కరించాలి; స్వచ్ఛ కార్యకర్తల సహనమే జయించాలి; ఇప్పటికైతే ఈ నిష్కామ కర్మిష్టులు తమ సామాజిక విధిని తు. చ. తప్పకుండ నెరవేరుస్తూనే ఉన్నారు!

 

ద్విముఖంగా నెరవేరిన నేటి పరిశుభ్ర – సుందరీకరణ కృషి యొక్క వివరాలివి :

 

- సుందరీకరణ బాధ్యులు మరో ఆలోచన లేకుండ ప్రధాన – బైపాస్ రహదారి సంగతే పట్టించుకొన్నారు. ఇతర కార్యకర్తలు పారిశుద్ధ్య కృషి నిర్వర్తించిన చోటునే మరికొన్ని నగిషీలు చెక్కి – చెట్ల కొమ్మల్ని, పూల మొక్కల పాదుల్నీ, బాట అంచుల ఎండు/ పచ్చి గడ్డినీ కొట్టి, తీర్చి దిద్ది, చెక్కి, వ్యర్ధాలను డిప్పలతో పెద్ద గుట్టగా పేర్చి, సుందరీకర్తలనే బిరుదును సార్ధకం చేశారు.

 

- విజయ నగర్ కాలనీలోని చివరి రెండు వీధుల్లోను, కాలనీ ఉత్తరపు కొసరోడ్డులోను ఈ చల్లని వేళలో 20 మంది కర్తవ్య పరాయణుల స్వేదం చిందింది. అసలు వీళ్ళు చేయలేని పనేమున్నది? తామే నాటి పెంచిన చెట్ల కొమ్మలు పెరిగి, బాటకడ్డం వస్తుంటే; బాట ప్రక్కల ఏవైన పిచ్చి ముళ్ళ మొక్కలు కనిపిస్తే; సంచులుగా, ఖాళీ సారా/ మంచి నీటి సీసాలుగా, కప్పులుగా, గ్లాసులుగా బహురూపాలెత్తిన ప్లాస్టిక్ శత్రువు జాడ దొరికితే ఈ ఆచరణాత్మక గ్రామ కార్యకర్తలు సహించరు! వ్యర్ధాలను ట్రాక్టర్ లో నింపి, చెత్త కేంద్రానికి పంపనిదే విశ్రమించరు!   

 

ప్రతి రోజూ నాకు ఒక సందేహం వస్తూ ఉంటుంది: “ముంబాయి, ఢిల్లీ, హైదరాబాద్ వంటి మహానగర ప్రజలు ఉదయం 10 గంటల దాక మంచాలు దిగరు సరే – చల్లపల్లి వంటి పల్లెటూరు వారు సైతం ఉదయం 6.00 ఐనా, స్వచ్ఛ కార్యకర్తలు తమ ఇంటి ముందే సందడిగా శుభ్రం చేస్తున్నా సరే – నిద్రా దేవత వాళ్ళను వదలదెందుకా” అని! ఇదేం స్పర్ద? నగర వాసుల్తో సమంగా నిద్ర లేవడం, తమ వీధిని, ఇంటి ముందు చోటునైనా బాగుచేసుకోకపోగా – నిర్లక్ష్యంగా వీధుల్ని, మురుగు కాల్వల్ని కాలుష్యాలతో నింపే పోటీనా?

 

పరిమిత సంఖ్యలో స్వచ్ఛకార్యకర్తలు చేసిన నేటి అపరిమిత పారిశుద్ధ్య కృషి ఫలించి, ఇక ఇప్పుడు విజయ నగర్ కాలనీ వీధులు, బైపాస్ మార్గం, అశోక్ నగర్ పరిసరాలు ఎంత బాగుపడ్డాయో – అది మన వాట్సాప్ చిత్రాలలో చూడవచ్చు.

 

6.35 కు డాక్టర్ డి.ఆర్.కె. గారు కరోనా ద్వితీయ తరంగ ప్రమాద హెచ్చరికలు చేసిన సమావేశంలో - 15 రోజులుగా స్వచ్చంద శ్రమదాన దూరుడైన BSNL నరసింహారావు గారు తనకీ 15 రోజులు సరిగా నిద్ర పట్టలేదనీ, ఈ రాత్రికి మాత్రం తృప్తిగా కరువు తీర నిద్రపోతానని చెప్పి ముమ్మారు గ్రామ స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య ప్రతిజ్ఞ చేసి 6.50 కి నేటి కర్తవ్య దీక్ష ముగిసింది.

 

మండుటెండలకీ, చలిపులికీ, ముసురువానలకీ కూడ చెక్కు చెదరని గ్రామ బాధ్యతల దీక్ష కదా మనది! దానిని కొనసాగించేందుకు వీలైతే ఈ బైపాస్ మార్గ స్వచ్ఛ – శుభ్ర విధులను రేపే ముగించేందుకు మనం రేపటి వేకువ సైతం విజయ నగర్ సమీపంలోనే కలుసుకొందాం.

 

ఏక వ్యక్తి సైన్యాలివి!

కృష చంద్ర బిస్వాలులు – దశరధ మాంఝీ యోధులు

ఒంగోలు భూమి తేజస్విని – కొట్టాయం రాజప్పన్ లు

ఏక వ్యక్తి సైన్యాలగు ఇంత మంది స్ఫూర్తి పొంది

వర్ధిల్లిన చల్లపల్లి స్వచ్చోద్యమ మొకటున్నది!   

 

ఒకానొక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

09.04.2021.