2172* వ రోజు ....           15-Apr-2021

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

2172* వ నాటి స్వచ్ఛ – మాన్య చల్లపల్లి.

 

          15.4.21 వ నాటి వేకువ సమయంలో కూడ స్వచ్ఛ  కార్యకర్తలు 4.15 కే బైపాస్ మార్గంలో శ్రమదాన సంసిద్ధులయ్యారు. ఐతే నేటి వారి ప్రయత్నం ఏమంతగా కొనసాగలేదు. అనుకోని అతిధిగా, పిలవని పేరంటంగా వచ్చిన అకాల వర్షంతోను, అంతకు మించి, తమకెంతో ఇష్టురాలైన “స్వచ్ఛ చల్లపల్లి మామ్మ” అనబడే దాసరి స్వర్ణలత గారి మృతితో వికలమైన మనస్సులతోను నేటి శ్రమదానం అసంపూర్ణంగా ముగిసింది. సమయం పరంగానైతే ఈ కార్యకర్తలు డాక్టర్ డి.ఆర్.కె. గారి వృద్ధ మాతృమూర్తి అంతిమ యాత్ర ముగిసే – 11.00 వరకు తమ ఇళ్లకు చేరలేదు.

 

పునర్ జన్మల పట్ల, కర్మల పట్ల, అవి చుట్టుకొని తిరిగే దైవం పట్ల నాకెన్నడూ గురి లేదు. 84 ఏళ్ల దాసరి స్వర్ణలత గారు ఇందుకు పూర్తి విరుద్ధం. జన్మతః, తన బ్రతుకు బాట పొడవునా ఆమె నిక్కమైన నిండు భక్తురాలు. తన భక్తి, నిష్ట సర్వజనహితాభిలాషమే తప్ప, వ్యాపారాత్మకం కాదు. ఎవరినైనా చిరునవ్వుతో, ఆత్మీయతతో సుమంగళీభవ”, “ఆయుష్మాన్ భవ”.... అని సానుకూల దృక్పధంతో పలకడమే తన నైజం. సాహిత్య, సంగీతాల వైపు మొగ్గు చూపిన ఆ హృదయం మృదు మధుర సుమపేశలం! ఆరేడేళ్ళ నుండి అది కాస్తా చల్లపల్లి స్వచ్చోద్యమంతో మమేకమై, స్వర్ణలత – రామమోహనుల జంట – ఇది తమ పుట్టిన – మెట్టిన ఊరు కాకున్నా – ఎంతగా చల్లపల్లి స్వచ్ఛ- శుభ్ర – సౌందర్యాల కోసం ధనం, సమయం, శక్తి యుక్తులు ధారపోసిందో తెలియని వారెవ్వరు?

 

పెద్ద వయస్సులో కూడ తాను వంగి కార్యకర్తలతో బాటు పని చేయలేకున్నా, ఆ వేకువ జాముల్లో వచ్చి, ఆ శ్రమదాన సందడి చూసి, సంతసించి, ప్రోత్సహించే వారు; సాంస్కృతిక కార్యక్రమాల్లో పాటలు వ్రాసి,  పాడేవారు! క్రమంగా సామాజిక బాధ్యతల్ని స్వీకరించిన ఆమె భక్త హృదయం ఎంత అభ్యుదయకరంగా పరిణమించిందంటే – తన పార్ధివ దేహాన్ని, అవయవాల్ని పిన్నమనేని వైద్య కళాశాలకు అంకితం చేసే దాక! తన కళేబరం పైన అంతిమయాత్రలో స్వచ్ఛ – సుందర – చల్లపల్లి జయ పతాకం రెపరెపలాడేదాక! స్వచ్ఛ కార్యకర్తలు ఆ పార్ధివ దేహ వాహనం వెంట 10 కిలోమీటర్ల దూరం – కొడాలి వరకు – విషణ్ణ హృదయాలతో కాక, సగర్వ – సగౌరవ భావంతో వీడ్కోలు పలికేంతదాక!

 

పెద్దావిడ బంధు – మిత్ర – వారసులు, స్వచ్చోద్యమ కారులు ఆమె సాత్త్విక భావ సంపదనీ, సామాజిక బాధ్యతనీ, మరణానంతర ప్రజోపయుక్త నిర్ణయాన్ని పుణికిపుచ్చుకొంటే – ముఖ్యంగా స్వచ్ఛ – స్వస్త – సుందర – చల్లపల్లి సాధనకు అంకి తులైతే – ఆమె కదే గొప్పనివాళి!

 

మన రేపటి వేకువ గ్రామ బాధ్యతల నిమిత్తం బైపాస్ మార్గంలో – సాగర్ సినిమా హాలు దగ్గర కలుసుకొందాం!

 

         స్వర్ణలత కాదు – స్వచ్ఛశీల!

 

సు సంస్కారపు – సౌమనస్యపు – స్వచ్ఛ సుందర హృదయ మామెది

సుసాహిత్యపు – సుసంగీతపు – సొంపులొలుకు వివేక మామెది

మంచి బిడ్డల – బంధుమిత్రుల – మంచి కోడలి బలం ఆమెది

స్వచ్ఛ – సుందర కార్యకర్తల స్వప్న దృశ్య విశేష మామెది!

 

కావడానికి భక్తురాలే – కడువిశాలపు తలపు లామెవి

స్వచ్ఛ – సుందర చల్లపల్లిని స్వాగతించిన హృదయ మామెది

తన శరీరం వైద్యశాలకు దానమిచ్చిన తర్క మామెది

ఎవరి కేకాలములకైనా ఎంత ఆదర్శమొ గదా ఇది!  

 

ఒకానొక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

15.04.2021.