2173* వ రోజు ....           16-Apr-2021

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

స్వచ్ఛ సుందర – సౌభాగ్య చల్లపల్లిలో 2173* వ నాడు.

 

          శుక్రవారం నాటి వేకువ జాములో సైతం 4.15 కే స్వచ్ఛ కార్యకర్తల వీధి పారిశుద్ధ్య సంసిద్ధత! కబేళా బజారు దగ్గర అప్పటికే 11 మంది చేరుకొని, అంతే మంది కాస్త వ్యవధిలో వచ్చి, 2 గంటల పాటు కృత నిశ్చయంతో కష్టించిన ఫలితంగా బైపాసు మార్గంలో మరికొంత మేర స్వచ్ఛ – సౌందర్య ప్రపూర్ణమయింది. కార్యకర్తల ప్రయత్నం బాగా నెమ్మదిస్తున్న మాట వాస్తవమే! ఈ బాట స్వచ్ఛ – పరిశుభ్రతలకొక చరిత్ర ఉన్నది – ఇప్పటికే 10 మార్లైనా స్వచ్చోద్యమకారుల నాలుగైదు నెలల – ఏడెనిమిది వేల పనిగంటల తీవ్ర కృషికి ఇది వేదిక!

 

స్వచ్ఛ వ్యసన పరుల, వీధి కాలుష్యకారుల నిష్పత్తి 1: 700 – 800 గా ఉండడమూ, ఏ వందరోజులపాటో ఈ స్వచ్ఛ పారిశుద్ధ్య కారులీ బాటను కాక, ప్రధాన రహదారుల మీద దృష్టి పెట్టడమూ, అందుమూలంగా ఆకులలములు, ప్లాస్టిక్ వస్తువులు, ఖాళీ సీసాలు, పనికిమాలిన పిచ్చి మొక్కలు, గడ్డిదే పై చేయి కావడమూ. కార్యకర్తల పని వేగం తగ్గడానికి కారణాలు కావచ్చు. అంతే గాని, గ్రామ మెరుగుదల ప్రయత్నంలో స్థిత ప్రజ్ఞత సాధిస్తున్న – సుదీర్ఘకాల పరీక్షకు నిలబడిన – స్వచ్చోద్యమ సారధి రాకున్నా యధావిధిగా సోదర గ్రామస్తుల స్వస్తతకు అంకితులైపోతున్న స్వచ్ఛ కార్యకర్తల నిస్సత్తువో, ప్రయత్నలోపమో కాదు! ఆమాట కొస్తే – ఈ బైపాస్ వీధి నివాసుల ప్రయత్నలోపం మాత్రం ఉన్నదా? శక్తి వంచన లేకుండా తమ ఇంటి వ్యర్ధాలను బాట అంచుల మీద, కార్యకర్తలు ప్రాణప్రదంగా చూసుకొంటున్న ఉద్యానాలలో విసిరే వాళ్ళు విసురుతూనే ఉన్నారు గదా! ఐతే – మరొక రెండు వేల దినాల తరువాతైనా మారి తీరవలసింది బాధ్యత లేని కొందరు గ్రామ సహోదరులే గాని, కార్యకర్తలు కాదు!

నేటి కార్యకర్తల అయాచిత వీధి శౌచ విన్యాసాలిలా ఉన్నాయి :

 

1) మొన్న శేషించిన వీధి ఉద్యానాల ఆహ్లాదకర శుభ్ర సౌందర్యాల కల్పన కోసం 10 మంది కత్తులతో, దంతెలతో చేసిన ప్రయత్నం.

 

2) వీధి పిచ్చి మొక్కల తొలగింపుతో, కొన్ని కొమ్మల కత్తిరింపులతో, ఎండు – పచ్చి గడ్డి చెక్కుళ్లతో పొగుబడుతున్న వ్యర్దాలను ఇద్దరు నిర్విరామంగా చీపుళ్లతో ఊడ్చి, పోగులు చేసి, డిప్పలు నింపి, కంచె మీదుగా బైట వారికందిస్తే – వాళ్ళు ట్రాక్టర్ లో నింపి, చెత్త కేంద్రానికి పంపడం.

 

3) ఇసుక బళ్ళ తాకిడితోను, పెద్ద వృక్షాల ఆకుల వల్లను కళాహీనమౌతున్న బైపాస్ వీధిని ఇద్దరు మహిళలు ఊడ్చడం.

 

4) ఎత్తైన గోడమీదకెక్కి, రోడ్డు మీదకొస్తున్న చెట్ల కొమ్మల్ని ఒకరు కత్తితో నరకడాన్ని, మరొక బక్క కార్యకర్త చెట్టు మీదకే లంఘించి, కొమ్మల్ని ట్రిమ్ చేసి, మరికాస్త సౌందర్యవంతం చేయడాన్ని కూడ వాట్సాప్ చిత్రాల్లో కనుగొనవచ్చు. (సదరు ఛాయాచిత్రానికి చిక్కని ఇంకొక విచిత్ర సన్నివేశమేమనగా – అప్పుడే నిద్ర లేచిన గృహస్తుడొకాయన కొంచెం తీరుబడిగా, కార్యకర్తలకు సూచనలిస్తూ తన ఇంటి ముందు పని చేయించుకోవడం!)

 

మనం దృష్టి పెట్టాలే గాని – ఇలా వాలంటీర్ల దైనందిన పని విశేషాలన్నైనా దొరుకుతాయి!

 

మనందరికీ ఆప్తురాలు, ఊరి శుచి – శుభ్రతల పట్ల ఇష్టురాలు, మంచి సాంప్రదాయ ప్రవర్తకురాలై కూడ తన పార్ధివ దేహాన్ని ప్రజోపయోగ నిమిత్తం వైద్య కళాశాలకు సమర్పింప జేసిన అభ్యుదయ భావుకురాలు – దాసరి స్వర్ణలత గారి ఆదర్శాన్ని ఈ వేళ పలు దినపత్రికలు ఉదహరించడం గమనించారా!

 

నేటి కాఫీ  సమయం - 6.35 వేళ మన గ్రామ స్వచ్ఛ – పరిశుభ్ర – సౌందర్యకాంక్షను ముమ్మారు దంచి నినదించి, వీధి కంతటికీ వినిపించినది – మాలెంపాటి అంజయ్య కాక మరెవ్వరు?

 

రేపటి మన ముమ్మర గ్రామ శౌచ ప్రయత్నం కోసం వేకువనే కలువదగిన ప్రదేశం – సాగర్ టాకీసు పరిసరమే!

 

         దాసరి స్వర్ణలత వలె....

 

విచ్చల విడిగా – వికటముగనో- వెర్రి మొర్రిగ బ్రతుక వచ్చున?

అందరికి తలనొప్పిగానూ – వ్యర్ధముగనూ మిగల వచ్చున?

హ్లాదముగనే – తోటి జనులకు హాయి పంచుచు మెలగలేమా!

స్వర్ణలత వలె సక్రముగ త్యాగ నిరతిని చూపలేమా!

   

ఒకానొక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

16.04.2021.