2174* వ రోజు ....           17-Apr-2021

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

2174* వ నాటి హరిత సుందర చల్లపల్లి విశేషాలు.

 

         స్థిరవార బ్రహ్మముహూర్తం (4.15) సమయంలో సైతం ఈ కశ్మల భరిత బైపాస్ మార్గంలో షాబుల్ వీధి చివరలో గ్రామ స్వచ్ఛ శుభ్రతా కంకణధారులైన 13 మంది హాజరయ్యారు. ఇంకా పదునాల్గురు కాబోలు అనతి సమయంలో వాళ్లకు తోడయ్యారు. ఇక అక్కడ నుండి 2 గంటల పాటు – 50 పని గంటల పైగా, పోటాపోటీగా – (అంటే ఇది కార్యకర్తలు v కార్యకర్తలని కాదు వీధి కాలుష్యం v పాతిక మంది శ్రమదాతలు!) క్రమ పద్దతిలో జరిగిన గ్రామసేవ! చూసితీరవలసినంతగా బాగుపడింది బైపాస్ త్రోవ!

 

అసలీ నాటి శ్రమదాన ముగింపు సినిమాహాలు దాటి పోయిన చోట జరగాలి! ఐతే – 12 రోజుల క్రితం శ్మశాన మార్గం చివర కొద్దిగా మిగిలిపొయిన పని, విజయ నగర్ సమీపంలో దిగబడిన ఇంకో పని గుర్తు వచ్చిన కొందరటు వైపు వెళ్లడం, ఆరేడుగురు షాబుల్ వీధి మలుపుదాక దారిని, మురుగు కాల్వను సంస్కరించబూనుకోవడం వల్ల ఇంచు మించు నిన్నటి పని ముగింపుచోటనే నేటి ప్రయత్నం కూడ కొనసాగింది. ఏ ఊళ్లో ఏ వీధిలోనైనా స్వచ్చంద శ్రమదాతలకు లోటు గాని, ముందుకు నడవని మురుగు కాలవలు గాని, అన్ని రకాల కశ్మలాలతో వీధుల్ని చెడగొట్టే వాళ్ళకు కొదవేముంటుంది?

 

గట్టిగా 30 మంది కూడ లేని స్వచ్ఛ కార్యకర్తల శ్రమ వినోదం ఇలా సాగింది :

 

- సినిమాహాలు మార్గం నుండి దక్షిణ దిశగా సాగే షాబుల్ వీధిలో చెత్త, దుమ్ము, కొద్దిపాటి గడ్డి, కొన్ని పిచ్చి మొక్కల పనిబట్టి, మలుపు దాక దర్శన యోగ్యంగాను, ప్రయాణ సౌకర్యంగాను మార్చింది ఐదారుగురు. వీధి మలుపుల నిలవ మురుగును ముందుకు కదలించిన ప్రయత్నం కూడ వీళ్ళదే!

 

- సినిమా హాలు వెనుక తటవర్తి భవనం ఎదుట మొన్న సుందరీకరించిన ఉద్యానవనాన్ని మరొక మారు ఎండుటాకులు ఊడ్చి, కరెంటు తీగల కడ్డు వచ్చే కొమ్మలని కత్తిరించే పని సుందరీకరణ బృందానిది. (ఈ బృంద ప్రముఖుడు, చేసే ప్రతి పనిలో పరిపూర్ణతా సాధకుడు (పర్ఫెక్షనిస్టు) రహదారి వనం కంచె మీదుగా చెట్ల మీదకి ప్రాకి, కొమ్మపై నిలిచి, సమతూకంతో కొమ్మ రెమ్మల్ని కత్తిరించే ఒడుపును వాట్సాప్ చిత్రంలో గమనించండి!)

 

- ఐదారుగురు కత్తి వీరులు సాగర్ సినిమా హాలు ఉత్తర రహదారి ఉద్యానవనం (ఇందులో ఒకాయన సదరు వన నిర్మాత కూడ) లోకి ప్రవేశించి, పూల మొక్కల్ని, వాటి కుదుళ్ళనీ, గడ్డినీ, పిచ్చి ముళ్ళ మొక్కల్నీ తొలగించి, 6.15 తరువాత గాని బైటకు రాలేదు. వారాల నెలల తరబడీ ఈ వనం ప్రక్కనే నిలిపిన ఒక పెద్ద వాహనం రోడ్డెక్కే సరికి, అక్కడి తుక్కు, చెత్త తొలగించే అదృష్టం ఒక కార్యకర్తకు చిక్కింది.

 

కార్యకర్తల కృషి ముగిసీ ముగియక ముందే పల్నాటి అన్నపూర్ణ తన పేరును సార్ధకం చేస్తూ చిక్కని రాగి జావను కొందర్ని బ్రతిమాలి కూడ త్రాగించింది. ఆమే 6.25 కు సావధానంగా పలికిన గ్రామ స్వచ్ఛ సుందర సంకల్ప నినాదాలతో నేటి శ్రమదానం ముగిసింది.

 

రేపటి మన నిత్య నూతన గ్రామ ప్రయోజనకర శ్రమదాన వేదిక కూడ కబేళా సాగర్ టాకీస్ నడుమ భాగమే!

 

ఈ దిగువ వ్రాసిన తాత్త్విక సంపన్నమైన బుర్ర కధ భాగం బుర్రకధ పితా మహబిరుదాంకితుడు షేక్ నాజర్గారి కధ రచన సంగీత దర్శకత్వ - స్వీయ గాన అభినయ చకచ్ఛకితం! నేనైతే 14 – 15 ఏళ్ల వయసులో విన్న చూచిన ఆతని ప్రతిభనిప్పటికీ గుర్తుంచుకొన్నాను. మొన్న దివంగతురాలైన మన చల్లపల్లి మామ్మ -  దాసరి స్వర్ణలత గారు అది విన్నారో లేదో గాని, ఆ బుర్రకధ భాగాన్ని ఆచరించి చూపారు!

 

          సదరు నాజర్ గారి బుర్రకధ

 

పంచ భక్ష్య పరమాన్నములెన్నో బంగరు కంచంలో భుజించినా

పట్టె మంచమున పట్టు పరుపుపై పవ్వళించి సుఖ నిద్ర చెందినా

తనువునెంత పోషించి పెంచినా చావు తప్పదన్నా!

మనలను మించిన మహానుభావులెమరణించారన్నా!

మనం మాత్రమిక శాశ్వతంబుగా మనగల మంటన్నా!

మనిషి చేసిన మంచి చెడ్డలకు మరణం లేదన్నా!

 

ఒకానొక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

17.04.2021.