1881 * వ రోజు....           05-Jan-2020

 

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1881* వ నాటి శ్రమదాన వార్తలు.

 

ఈ నాటి  చలీ-మంచు వేకువలో 4.03 నుండి 2.10 నిముషాల పాటు 35 మంది నిర్వహించిన స్వగ్రామ శ్రమదాన బాధ్యతలు సామ్యవాద కమ్యూనిస్ట్ వీథి నుండి భారతలక్ష్మి వడ్లమర ప్రాంతందాకా విజయ వంతం గా జరిగినది .

 

అదేదో ఇటీవలే విడుదలైన తెలుగు చలన చిత్రం “ప్రతి రోజు పండగే అన్నట్లుగా చల్లపల్లి స్వచ్చ కార్యకర్తలకు  1881 రోజులుగా ప్రతి రోజు –ప్రతి పూట – మాతృగ్రామ స్వచ్చ –శుభ్ర –సుందరీకరణ వేడుకే !

 

వీరిలో కొందరు తామే నాటి- పెంచిన అందమైన వృక్ష సముదాయాన్ని – విద్యుత్ తీగలకు తాకాకుండా సదరు సిబ్బంది క్రూరంగా నరికివేసే పనిలేకుండ తామే అవసరం మేర తగు మాత్రం కత్తిరించారు. ఇక కత్తుల ముఠా తమ పనిలో తాము లీనమై బైపాస్ మార్గం రెండు ప్రక్కలా కనిపించిన గడ్డిని, పిచ్చి మొక్కలనూ తుడిచి పెటుతూ, వడ్లమర దాక – ½ కిలో మీటరు వరకూ సాగిపోయింది. వాళ్ల పని కనుబంధంగా గొర్రుల వాళ్లు ఆ వ్యర్ధాలను, ఇతరేతర వ్యర్ధాలను లాగి, పోగులు చేస్తూ పోయారు.

 

నలుగురు మహిళా కార్యకర్తలు ఈ దారిని, దాని కిరువైపులా-చీపుళ్లతో ఊడ్చి శుభ్ర పరుస్తూనే ఉన్నారు. మిగిలిన కొందరు ఆ కసవు గుట్టల్ని, ఎండు-పచ్చి కొమ్మల్ని డిప్పలతో ఎత్తి, ట్రాక్టర్ లో నింపి, చెత్త కేంద్రానికి తరలించారు.

 

ఇక సుందరీకరణ బృందం సంగతి చెప్పేదేముంది! మా ఖాళీ స్థలం ప్రహరీకి-నిన్న ప్రైమర్ పూసిన తరువాయిగా రంగులు వేశారు. ప్రహరీ గోడలు సరే-గేటు రేకుల్ని కూడ వదలక- ప్రైమర్లతో- రంగులతో అలంకరించారు!

 

దైనందిన గ్రామ బాధ్యతా సమీక్షా సమావేశంలో-నిజమైన కీర్తి శేషుడు వాసిరెడ్డి కోటేశ్వర రావు ప్రధమ సాంవత్సరీక సందర్భంగా ఆయన వారసులు రాహుల్, అనిల్ మనకోసం మనం ట్రస్టుకు 50 వేల రూపాయలను చెక్కు రూపంలో (ఎవరికీ తెలియని గుప్త దానంగా ) ఇచ్చి వెళ్లారు. నా పాటికి నేను 6000/- చెక్కును సమర్పించుకొన్నాను. (షరా ! పై రెండు సందర్భాలకు ధన్యవాదములక్కరలేదు.) భోగాది వాసు గారు కూడ 1000/- మనకోసం మనం ట్రస్టుకు విరాళంగ సమర్పించారు.

 

భోగాది వాసు కొత్త ఆంగ్ల సంవత్సర – పద్మావతీ ఆస్పత్రి ఉత్సవాన్ని కళ్లకు కట్టేలా వర్ణించి గుర్తు చేయగా “కో-వా“ (కోటేశ్వర వాసిరెడ్డి) తో మన అనుబంధాన్ని, స్మృతులను పద్య రూపంలో నేను ప్రకటించాను.

 

అటుకుల పులిహోర ను విభిన్న అను పానాలతో చేయించి, అందరికీ మళ్లీ మళ్లీ తినిపించి శంకర శాస్త్రి గారు ఎక్కడో సుదూర విశాఖలో ఉండి కూడ పరమానందం పొందగలనని ఋజువు చేశారు.

 

స్వచ్చ కార్యకర్తలందరూ ఈ మధ్యాహ్నం 12.30 కు విజయా కాన్వెంట్ లో జరిగే కోటేశ్వర రావు మాష్టారి సంస్మరణ కోసం వెళ్లవలసి ఉన్నది.

 

రేపటి మన స్వచ్చంద కృషి చల్లపల్లి  ప్రధాన కూడలి దగ్గర నిర్వహిద్దాం.  

 

 “ఏకైక మనుష్య సైన్య” మీ కోటేశ్వర వీరుడు!

ఏమయ్యా! వాసిరెడ్డి కోటేశ్వర మహనీయుడ!

కొంత కొంత నింపాదిగ-ఎంతెంతో హడావిడిగ-

ఖచ్చితముగ-ప్రణాళికబద్ధంగా ప్రతి పనినీ

చక్కబెట్టు నీవేనా-హఠాత్తుగా కనుమరుగైతివి?

 

 నిస్వార్ధత-నిబద్ధతలు  నిన్ను గుర్తు చేస్తున్నవి

చల్లపల్లి జనం నిన్ను స్మరించడం మానలేదు

గ్రామ నామ ఫలకాలను గమనించిన ప్రతి యొక్కరు

“ఏకైక మనుష్య సైన్య” మైన నిన్ను మరువ లేరు!

 

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

ఆదివారం – 05/01/2020

చల్లపల్లి.