2176* వ రోజు ....           25-Apr-2021

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

2176* వ నాటి గ్రామ స్వచ్చోద్యమ సుందర చల్లపల్లి.

         

వేలాది రోజుల తమ శ్రమ దాతృతకు భిన్నంగా ఈ ఆదివారం ఉషోదయాన- 5.30 నుండి 6.20 వరకు గ్రామ ప్రథమ వార్డులో – బాలికల వసతి గృహ సమీపంలో  ప్రవర్తిల్లిన 34 మంది స్వచ్చ కార్యకర్తల ప్రత్యేక కార్యక్రమ వివరాలిలా ఉన్నవి:

 

- ఈ విశేష సమావేశానికి నేపథ్యం – గ్రామంలో, దేశంలో కనీ వినీ యెరుగనంతటి ప్రామాదిక కరోనా ప్రళయ సందర్భమే! తమ చల్లపల్లి గ్రామ సంరక్షణ, సుందరీకరణల బాధ్యత తో బాటు ఎవరి ఉనికిని వారు రక్షించుకోవాలని స్వచ్చ కార్యకర్తలను  పదే పదే హెచ్చరించిన సమావేశమిది.

 

- ఉదాహరణ యోగ్యమైన నిండు జీవితాన్ని ఈ నెల 14 న ముగించిన దాసరి స్వర్ణలత  నిన్నటి ఏ కాదశాహ సంస్మరణ సన్నివేశంగా కూడా అది నడిచింది.

 

- మరి కొన్ని నెలల- సంవత్సరాల పర్యంతం ఆమె గుర్తులు ప్రతి స్వచ్చ కార్యకర్తను ప్రోత్సహించే విధంగా ట్రస్టు ఉద్యోగులకు, స్వచ్చంద శ్రమదాతలకు డాక్టర్ డి.ఆర్.కె, పద్మావతి గారలు సమర్పించిన నార సంచుల పంపకం ఈ సమయంలో జరిగింది.

 

- స్వర్ణలత గారి అక్క కూతురు చాలా కాలంగా గన్నవరం దగ్గర కేసరపల్లిలో అనాధల, వృద్ధుల కోసం నిర్వహిస్తున్న వృద్ధాశ్రమం కోసం ఈ వైద్యులిద్దరు లక్ష రూపాయల విరాళం ప్రకటించడం మరింత సమంజసంగా ఉన్నది.

 

- చల్లపల్లి ప్రథమ పౌరురాలు పైడిపాముల కృష్ణ కుమారి గారు గ్రామం తరపున, స్వచ్చ కార్యకర్తల తరపున “ చల్లపల్లి మామ్మ” కు నివాళులర్పించగా,

- దాసరి రామకృష్ణ ప్రసాదు గారు తమ తల్లి గారికి దిన- వార-మాసిక కర్మకాండ లేవీ జరుపక పోవడాన్ని ప్రస్తావించారు. ఈ స్వచ్చోద్యమ సారధులూ, స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్తలూ, ఇక ముందు మరింత సామాజిక బాధ్యతతో స్వర్ణలత గారి కత్యంత ప్రీతి పాత్రమైన “ సంపూర్ణ స్వచ్చ-స్వస్త-సుందర చల్లపల్లి” ని నిర్మించడమే బహుశా ఆమె కీయదగిన ఘన నివాళి కావచ్చు!

 

          నేటి కార్యకర్తల సమావేశ అంతిమ నిర్ణయమేమంటే – నేడు మొదలు మే నెల 15 వరకు- 20 రోజుల పాటు తమ దైనందిన శ్రమదానమునకు విరామ మివ్వాలని! ఇక ఆ రోజు పరిస్థితి తీవ్రతను మదించి, నిర్ణయం తీసుకోవాలని!

 

కృష్ణ కుమారి గారు ముమ్మారు దృఢంగా ప్రకటించిన గ్రామ స్వచ్చ- పరిశుభ్ర- సౌందర్య సంకల్ప నినాదాలను అందరూ ఏకగ్రీవంగా ఆమోదించి, 6.25 కు గృహోన్ముఖులయ్యారు.

 

          ఋజువు చేసెను- అమలు పరచెను.

పరుల మేలుకు పూనుకొనుటే నరుని జన్మకు మేటి సిరి- అది

ఒకరి సొత్తని- జన్మ జన్మల పుణ్య ఫలమని తలచు టేమిటి?

సులభముగ- స్వచ్చందముగ మన స్వర్ణలతయే ఋజువు చేసెను!

ఆ - సదాశయమునె అనుదినం ఈ స్వచ్చ సైన్యం అమలు పరచెను!    

 

ఒకానొక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

25.04.2021.