2177* వ రోజు ....           02-Jul-2021

 2177*  వ నాటి గ్రామ స్వచ్చతా పునరుద్యమ సంగతులు.

 

ఈ శుక్రవారం (02.07.2021) వేకువ 4.27 కే బందరు రహదారిలో పునః ప్రారంభమైన వీధి పారిశుధ్య చర్యలతో 6 వ నంబరు పంట కాలువ మొదలు కళా నర్శింగ్ హోమ్ దాక శుభ్రతకు నోచుకున్నది. రెండు ఆసుపత్రుల బ్యాంకు కళాశాల రిజిస్ట్రారు కార్యాలయాల పండ్ల దుకాణాల పరిసరాలు చాల వరకు మెరుగుపడినవి.

 

ఈ స్వచ్చ శుభ్ర సౌందర్య కృషీవలురు 29 మంది స్వచ్చోద్యమకారులే. వాళ్ళ 40 కి పైగా పని గంటల దీక్షే వందలాది ప్రయాణికుల ఆహ్లాదం! కరోనా ద్వితీయ తరంగ ఉధృతితో విరమించిన చల్లపల్లి గ్రామ సుదీర్ఘ స్వచ్చోద్యమ పునః ప్రారంభ వేళ కార్యకర్తల ఉత్సాహ ఉద్వేగాలు చూసి తీరాలి. 83 వ ఏట కూడ పట్టుదలగా చీపురు పట్టి శుభ్రపరుస్తున్న ఒక వృద్ధ బాలుని ఉత్సాహం, దుకాణాల ఎదుట తుక్కును, దాని మధ్య మొలిచి, పెరిగిన పిచ్చి మొక్కలను లాగి, పీకుతున్న కార్యకర్తల పట్టుదల ఎవరికి మాత్రం స్మరణీయ దృశ్యాలు కావు? అనుసరణీయ ఆదర్శాలు కావు?

 

6.00 కు పని నిలుపుదల వేళకు తమ కృషి ఫలితంగా మెరుగుపడిన సువిశాలమైన రహదారిని, దుమ్ము ధూళి వదలించుకొని కళకళలాడుతున్న రంగు రాళ్లను, విద్యాలయ, కార్యాలయ ముఖ ద్వారాలను తనివి తీర చూసుకొంటున్న స్వచ్చ సైనికుల ఆత్మ సంతృప్తిని నేను గ్రహించగలను. 28 వేల మంది గ్రామ జనాభాలో 29 మంది మాత్రమే సొంత ఊరి మేలుకై సాహసిస్తున్న వైనం కూడ మరువ లేను!

 

కాఫీఆస్వాదన పిదప 6.12 కు జరిగిన దైనందిన స్వచ్చ కృషి సమీక్షా సమావేశంలో వేమూరి అర్జునరావు మాస్టారు ముమ్మారు ఎలుగెత్తి నినదించిన గ్రామ స్వచ్చ శుభ్ర సౌందర్య సంకల్పంతో అందరూ శ్రుతి కలిపారు. ఈ ఉద్యమ సమన్వయ కర్త డాక్టరు దాసరి రామకృష్ణ ప్రసాదు గారు జూన్ మాసపు ట్రస్టు జమా ఖర్చుల వివరాలను వెల్లడించారు. ప్రాతూరి శాస్త్రి గారి 5,000/-, రాయపాటి రమా రాధాకృష్ణుల 10,000/- నిన్నటి అర్జునరావు గారి 2,000/- కృతజ్ఞతాపూర్వకంగా స్వీకరించారు.

 

రేపటి మన గ్రామ స్వచ్చంద స్వచ్చతా బాధ్యత కోసం వేకువ 4.30 కే కళాశాల ఎదుటనే కలుసుకొందాం!

 

మరల ఎగసిపడె నిదిగొ స్వచ్చోద్యమ తరంగం

బందరు రహదారి, బ్యాంకు, కళాశాల పరిసరం

ఆ కెరటం విజృంభించి ఊరంతటి కాలుష్యం

నాశనమై చల్లపల్లి గ్రామ స్వస్త వికాసం!

          

ఒకానొక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

02.07.2021.