2178* వ రోజు ....           03-Jul-2021

 గ్రామ స్వచ్ఛతా పునరుద్యమంలో 2178*  వ నాడు.

 

03.07.2021 వ నాటి శుభోదయ పూర్వమే – 4.22 సమయానికే కనీసం 11 మంది గ్రామ మెరుగుదల దీక్షాపరులు (వాట్సాప్ ఛాయా చిత్రం చూడండి), తదుపరి కొద్ది నిముషాలలో వచ్చి కలిసిన 20 మంది దీక్షా దక్షితులు - నేటి స్వచ్ఛ యజ్ఞం ముగింపు వేళకు దానికొక సార్థకత కలిగించిన గోపాలం శివన్నారాయణ- కోమలి దంపతులతో సహా 30 మంది- మొత్తంగా 45 పనిగంటల వీధి పారిశుద్ధ్య కృషితో బందరు రహదారిలో కొంతమేర ఇప్పుడు కనువిందుగా రూపొందింది (ఇందరిలో నలుగురు ట్రస్టు ఉద్యోగులు!)

 

            వరుణుడు తొంగి చూసినా, ఈ సామాజిక బాధ్యతా దీక్షకు అడ్డుపడలేదు. ఈనాటి శుభ్ర-సుందరీకృత ప్రదేశం అక్షరాలా నిన్నటిదే. ఇసుక-కంకర లారీల నుండి రాలిపడ్డ బాట మీది కాలుష్యపు మచ్చలను, నిన్నటి తమ పని చోట కనిపించిన చిరులోపాలను గమనించిన కార్యకర్తలకు - అవి సరిదిద్దే దాక తృప్తి లభించలేదు మరి! ఈ సువిశాల రాదారి మీది దుమ్మును, ప్లాస్టిక్ సీసాలను, సంచుల్ని ఊడ్వడం తోనే సగం మందికి సరిపోయింది. కత్తులకు, పారలకు, గోకుడు పారలకు, దంతెలకు పని చెప్పిన 10 మంది తమ గంటన్నర నిర్విరామ కృషితో బాటకు, తదుభయ పార్శ్వాల దర్శనీయతకు మరిన్ని మెరుగులు దిద్దారు.

 

            ఇద్దరు పార పనిమంతులు దారి వెంట వర్షపు నీరు నిల్వ లేకుండ చూడడంలో నిమగ్నులైపోయారు. ఇంకో పెద్దాయన సామాజిక మాధ్యమ వేదిక కోసం ఈ పని దృశ్యాలన్నిటినీ ఫోను నేత్రంలో బంధిస్తున్నాడు. ఈ స్వచ్చంద సేవా యజ్ఞం తో పుట్టుకొస్తున్న వ్యర్ధాల గుట్టల్ని ఇద్దరు ట్రక్కులో ని కెక్కించి, చెత్త కేంద్రానికి తరలించారు. మరొకామె బాట ప్రక్క టెలిఫోను- కరెంటు స్తంభాల మీద వ్రేలాడే కాగితపు ముక్కల్ని తొలగిస్తూ, కడుగుతూ తన స్వచ్చంద శ్రమజీవనం గడుపుతున్నది....

 

            చల్లపల్లికే ప్రత్యేకమైన – వేలాది దినాల ఈ దృశ్యాలు వచ్చే - పోయే వందలాది గ్రామ - గ్రామాంతర జనులు చూస్తూనే ఉంటారు. ఎందుకో గాని, స్వల్ప సంఖ్యాకులు తప్ప ఈ బాధ్యతలకు మాత్రం సిద్ధపడరు!

 

            నేటి స్వచ్ఛ – శుభ్రతా కార్యక్రమ సమీక్షా సమయానికి విజయవాడ నుండి వేరొక చోటికి పయనిస్తూ, ఆగిన గోపాలం కోమలి చల్లపల్లి స్వచ్చోద్యమానికి అభినందనలు పలికి, 6.30 సమయంలో గ్రామ నిరంతర మెరుగుదల సంకల్ప నినాదాలను ముమ్మారు పలుకగా Dr. శివన్నారాయణుడు తన సహజ శైలిలో నందుల వంశాభివృద్ధిని, పంది వంశ నిర్మూలనలను ప్రస్తావించి, అదే ధ్యాసలో ఉన్న చల్లపల్లి స్వచ్చోద్యమ కారులనభినందించారు.

 

            రేపటి మన గ్రామ సామాజిక బాధ్యతల కోసం భగత్ సింగ్ గారి దంత వైద్యశాల ఎదుట వేకువ 4.30 కు పునర్దర్శనం.

 

కర్మయోగీ! ధర్మ జ్యోతీ! - 1

ప్రథమ గణ్యుడు ఎవ్వరంటే- పరమ పావనుడెక్కడంటే-

ఎవడు కీర్తికి అర్హుడంటే- ఎవని బ్రతుకా దర్శమంటే-

సమాజాని క కారణంగా సహజ ప్రేమను పంచిపోయిన

ఆ మహోన్నతుడెవ్వరంటే  - అతడు అయ్యన్ రావె అంటాం!

  

ఒకానొక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

03.07.2021.