2179* వ నాడు....           04-Jul-2021

 సొంత ఊరి ఆరోగ్య భద్రతతానిర్వహణలో 2179* వ నాడు

 

ఆదివారం 4.7.2021 నాటి వేకువ 4.27 సమయానికే నిన్నటి నిర్ణీత ప్రదేశానికి చేరుకొన్న 12 మంది గ్రామ సంక్షేమకారులనూ, మొత్తంగా 40 మంది స్వచ్చోద్యమ పరివారాన్నీ ఈ నాటి “జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం” వాట్సాప్ గుంపు ఆద్యంతపు ఛాయా చిత్రాల్లో గమనించవచ్చు. ఇంత పెద్ద సుశిక్షిత పటాలం రెండు గంటల పాటు (6.30 దాక) శ్రమించి సాధించినదేమిటంటే – మునసబు వీధి నుండి – భారత లక్ష్మి వడ్లమర దాక ఉన్న సువిశాల బందరు రహదారి స్వచ్ఛ – పరిశుభ్ర – సౌందర్యాలు! కాస్తంత గ్రామ సామాజిక దృష్టి కల గ్రామస్తుల, వాహనదారుల, పాదచారుల ఉల్లాసాలు!

 

“పరుల కోసం పాటుబడని నరుని జన్మం దేనికని?

మూగ నేలకు నీరందించని వాగు పరుగులు దేనికని?...”

అంటూ చాలా కాలం క్రిందట సి. నారాయణరెడ్డి ఒక ప్రబోధాత్మక గజల్ వ్రాశాడు. బహుశా ఈ 40 మంది స్వచ్చ కార్యకర్తలు దాన్ని చదివీ, వినీ ఉండరు గాని, ఆ కవి ఉద్దేశించిన పరమార్ధాన్ని మాత్రం అనుష్టిస్తూనే ఉన్నారు! మరి, సామాజిక కర్తవ్య పరయణులు కాని మిగతా గ్రామ పౌర సహోదరుల్ని చైతన్యవంతులను, సకాల బాధ్యతాయుతులనో ఎలా భావించాలి?

 

          “సంశయాత్మా వినశ్యతి...” అని భగవద్గీతాచార్యుడు (నిరంతర సందేహ భావుకులు కృశించిపోతారు) అని అన్నది నా వంటి వాళ్ళ పరంగానేమో అని మళ్ళీ నాకొక సందేహం! ఐతే, కర్తవ్యనిష్టులైన స్వచ్చంద సైనికులు మాత్రం సునాయాసంగా వేలకొద్దీ రోజులుగా తమ పని తాము చేసుకొని పోతూనే ఉన్నారు.

 

          ఈ వేకువ వేళ సైతం వాళ్ళు రోడ్ల వార పిచ్చి మొక్కలు తొలగించారు; పెరుగుతున్న గడ్డి కోశారు; చీపుళ్ళతో బాటల్ని ఊడ్చి శుభ్రం చేసారు; రహదారి ప్రక్క తామే పెంచిన ఉద్యానాలలోని, విద్యుత్ ట్రాస్ఫార్మార్ల దగ్గరలలోని కశ్మలాలను, ప్లాస్టిక్ తుక్కును, గడ్డిని, ఎంగిలాకుల్ని ప్రోగులుగా దంతెలతో లాగారు, వ్యర్ధాల గుట్టల్ని ట్రక్కులలోనికి చేర్చి, డంపింగ్ స్ధలానికి తరలించారు.

 

          6.15 తరువాత మాత్రం 10 నిముషాలు కాఫీ సేవిస్తూ, కబుర్లు వినిపిస్తూ – వింటూ విశ్రాంతులయ్యారు. కోడూరు వెంకటేశ్వరరావు గారు (చెక్ పోస్ట్ బాబాయ్) తన పుట్టినరోజు సందర్భంగా – తన గ్రామ బాధ్యతా సూచకంగా ‘మనకోసం మనం’ ట్రస్టుకు సమర్పించిన 1020/- రూపాయల విరాళాన్ని మేనేజింగ్ ట్రస్టీ గారు అందరి సమక్షంలో స్వీకరించారు. 4 రోజుల క్రిందట – సుదీర్ఘ ఉద్యోగ నిర్వహణానంతరం విరమణ చేసిన రాయపాటి విజయ రమ గారు ముమ్మారు ఎలుగెత్తి చాటిన స్వగ్రామ శుభ్ర – సౌందర్య సంకల్ప నినాదాలను, స్వచ్చోద్యమం పట్ల ఆమె ఆలోచనల్ని అందుకొన్నారు, ఆలకించారు, గృహోన్ముఖులయ్యారు!

 

          మన తదుపరి కర్తవ్య నిర్వహణ కోసం బుధవారం (7.7.2021) నాటి వేకువ 4.30 కు భగత్ సింగ్ గారి దంత వైద్యశాల దగ్గర కలుద్దాం!

 

కర్మయోగీ! ధర్మ జ్యోతీ! - 2

మంచి మార్పే అతని సన్నిధి! అతడు గుంటూరుకే పెన్నిధి!

అతని నడవడి మనకు ఒరవడి – అద్భుతావహమైన అలజడి

‘స్వధర్మ సేవా’ సంస్థ కధిపతి – ధర్మజ్యోతి జ్వలన సన్మతి

ఆ వివేకం, మహాదర్శం అయ్యన్ రావుదె ఆ మహోధృతి!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

04.07.2021.