2180* వ రోజు ....           07-Jul-2021

స్వచ్చోద్యమ చల్లపల్లి లో విజయవంతమైన 2180* వ నాడు.

 

రెండు రోజుల స్వల్ప విరామం పిదప ఈ వేకువ జామున 4.21 నిముషాలకే పునః ప్రారంభమైన స్వచ్చ కార్యకర్తల వీధి పారిశుధ్య కృషి 6.35 వరకు కొనసాగింది. ఈ ఆదర్శ కృషిలో నేటి భాగస్వాములు 29 మంది. స్వచ్ఛ సుందరీకృత భాగం మునసబు గారి వీధి మొదలు తూర్పు రామాలయం నెలకొన్న బందరు రహదారి.

 

ఈ స్వచ్చోద్యమకారుల అదృష్టమేమో గాని రెండు రోజుల విరామానికే ఈ సువిశాల రహదారి భాగం ధూళి దూసరితమయి వాళ్ళను పిలిచింది. అయితే, నేటి కార్యకర్తల అంకిత దీక్ష ప్రధానంగా అమరావతి రాజు గారి వైజయంత బాహ్య ఖాళీ ప్రదేశమే. అక్కడ గత వర్షాలకు మొలిచి, పెరిగి, చిందరవందరగా అల్లుకుపోయిన గడ్డిని, పిచ్చి మొక్కలను ప్లాస్టిక్ తదితర వ్యర్ధాలను పారలతో చెక్కి, గోకుడు పారలతో గోకి సరిచేయడంలోనే కార్యకర్తల స్వేదం కొంత ఖర్చైపోయింది.

 

ఇదే సమయంలో మిగిలిన డజను మంది చీపుళ్లతో, పారలతో బాటకు రెండు ప్రక్కల రామాలయం వరకు మరొకమారు తనివితీరా శుభ్రపరుస్తూనే ఉన్నారు. వాళ్ళ చీపుళ్లతో ఇంత వెడల్పయిన దారి మీది దుమ్ము, ఇసుక ఎక్కడైనా మిగిలిన గడ్డి తొలగిపోయి గంటన్నర తరువాత ఎవరైనా ఈ ప్రాంతాన్ని చూసి మెచ్చదగినట్లుగా మారింది.

 

నేటి అతి ముఖ్యమైన సౌందర్య చర్య ఏమంటే – వైజయంతం ప్రహరీ వెలుపల గొప్పులు త్రవ్వి నీరు పోసి రకరకాల పూల మొక్కలను ప్రతిష్టించడంలో ప్రతి కార్యకర్త భాగస్వామిగా మారిపోయారు. ఇక ఆ తదుపరి ఆ మొక్కల సంరక్షణకై ముళ్ళ కంప పాతుట ట్రస్టు ఉద్యోగుల వంతు. మరి, ఇంత సమన్వయంతో – క్రమశిక్షణతో – సుదీర్ఘకాలంగా ఈ గ్రామంలో స్వచ్ఛ సుందరోద్యమం నడిచింది కనుకనే ఈ చల్లపల్లి రాష్ట్రంలోని ఎందరో సామాజిక బాధ్యులను ఇంతగా ఆకర్షిస్తున్నది.

 

నేటి ప్రత్యేక కృషి సమీక్షా సమావేశంలో 6.25 నిముషాలకు గ్రామ సర్పంచ్ కృష్ణకుమారి గారు ముమ్మార్లు తన ఊరి స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య సంకల్ప నినాదాలను ప్రకటించి గ్రామ పరిశుభ్రతా మెరుగుదలకై మురుగు కాల్వల పూడికను తీసే యంత్రం గత 2 రోజులుగా నారాయణరావు నగర్ ప్రాంతంలో పనిచేస్తున్నట్లు వివరించారు. ఆ మంచి పనికి ప్రతి స్పందనగా మన స్వచ్చోద్యమ సారధి డా. రామకృష్ణ ప్రసాదు గారు  ఇటు కార్యకర్తల, అటు పంచాయితీ వారి ఏకోన్ముఖ కృషితో అనతి కాలంలోనే మన గ్రామం మెరుగుపడబోతున్నదని హర్షించారు.

 

మన నిరంతర గ్రామ మెరుగుదల ప్రయత్నంలో భాగంగా రేపటి వేకువ కూడా భగత్ సింగ్ గారి దంత వైద్యశాల దగ్గరనే కలిసి మసీదు వైపుగా పురోగమిద్దాం.

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

 

07.07.2021.