2181* వ రోజు ....           08-Jul-2021

 33 మంది స్వగ్రామ స్వచ్చోద్యమ కర్తల 2181* వ నాటి ప్రయత్నం

 

8.07.2021 (గురువారం) నాటి వేకువ 4.20 సమయానికే బందరు జాతీయ రహదారి మార్గంలో వైజయంతం ఎదుట వీధి కాలుష్యం మీద కత్తులు దూయడానికి సన్నద్ధులైన 15 మందిని వాట్సాప్ ఛాయా చిత్ర సాక్ష్యంగా గమనించారా? స్వల్ప వ్యవధిలో మిగిలిన బాధ్యులు సైతం వచ్చి చేరి, 33 మంది ప్రణాళికాబద్ధమైన సమష్టి కృషి రాణించి, కమ్యూనిస్ట్ వీధి దాక ఆహ్లాదమయంగాను, ఆరోగ్యప్రదంగాను, గ్రహించగలవారికీ స్ఫూర్తిమంతంగాను రూపొందిన దృశ్యాన్ని పట్టించుకోండి! ఏడెనిమిదేళ్ళుగా ఈ కార్యకర్తల కిది నిత్య కృత్యం!

 

సుందరీకర్తల విభాగం వైజయంతం ప్రహరీ దగ్గర , నిన్నటివి కాక మరిన్ని బిళ్ళ గన్నేరు పూల మొక్కల్ని నాటింది. సుదీర్ఘ స్వచ్చోద్యమ చల్లపల్లిలో బందరు మార్గంలో సజ్జా వారి వీధిమొదట ఈ వేళ కొంత అపచారం జరిగింది. చెత్త బండి రోజూ తిరుగుతున్నా సరే సదరు వీధిలో ఎవరో గాని, తమ ఇంటి వ్యర్ధాలనక్కడ పడవేయడం ఆ కారణంగా పందుల సంచారం మొదలైంది. స్వచ్ఛ సౌందర్య సౌభాగ్య చల్లపల్లికోసం అత్యంత వ్యయ ప్రయాసలతో జరిగే బృహత్ ప్రయత్నానికిదొక అనుకోని బహుమతేమో!

 

కార్యకర్తల రెండవ విభాగం బత్తుల వారి వీధి మొదలు సామ్యవాద బజారు దాక దుమ్ము, ఇసుక, ప్లాస్టిక్ వస్తువులు తదితర వీధి సౌందర్య విఘాతాలను చీపుళ్ళతో, గొర్రులతో, కొండకచో కొడవళ్ళతో తొలగిస్తూ ప్రస్ధానించింది. ద్విచక్ర వాహన విక్రయశాలల, ఖాళీ స్తలాల, మూడు దేవాలయాల, రక్త పరీక్షా కేంద్రాల, పరిసరాలు కశ్మలాలన్నీ తొలగిస్తున్న ఈ స్వచ్ఛ సైనికుల తెగువలు గమనిస్తుంటే మహాకవి శ్రీ శ్రీ గారి మహాప్రస్థాన గేయం గుర్తు వచ్చింది.

 

మరో ప్రపంచం మరో ప్రపంచం స్వచ్ఛ ప్రపంచం పిలిచింది

పదండి ముందుకు, పదండి దూసుకుపోదాం కాలుష్యం పైకి

మద్యం గ్లాసుల, ప్లాస్టిక్ తుక్కుల వ్యర్దాలా మనకడ్డంకి?

పదండి పోదాం స్వచ్ఛ గ్రామపు నమూనాను నెలకొల్పుటకై....

 

అనే క్రొత్త గేయం మనస్సులో స్ఫురించింది!

 

మూడో బృందం భారత లక్ష్మి వడ్లమర వీధిలో కొంత భాగాన్ని గంట సమయం పాటు తీర్చిదిద్దింది.

 

6.15 కు నేటి స్వచ్ఛతా సమీక్షా సమయంలో దుబాయి నివాసిని, ‘మనకోసం మనంట్రస్టు బాధ్యురాలు దాసరి స్నేహ ఆత్మీయంగా చల్లపల్లి స్వచ్ఛ పరిశుభ్ర సౌందర్య సంకల్ప నినాదాలను ముమ్మారు పలికి, డాక్టరు గారు రక్తదాతలిద్దర్ని ప్రశంసించడంతో నేటి శుభోదయ స్వచ్ఛతా ప్రయత్నానికి స్వస్తి!

 

రేపటి బాధ్యతా నిర్వహణ కోసం కమ్యూనిస్ట్ వీధి దగ్గర కలుసుకోవలసి ఉన్నది.  

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

08.07.2021.