2182* వ రోజు ....           09-Jul-2021

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!

 

గ్రామ స్వచ్ఛ శుభ్రతా వైభవం కోసం 2182* వ నాటి ప్రయత్నం

 

ఈ శుక్రవారపు బ్రహ్మ ముహూర్తం లో సైతం 4.24 – 6.16 సమయాల నడుమ 28 మంది స్వగ్రామాంకిత స్వచ్చోద్యమ కారుల సౌజన్యం వల్ల బందరు జాతీయ మార్గంలో కమ్యూనిస్ట్ వీధి ఉభయదిశలా కన్నుల పండుగగా మారిపోయింది. పెద్ద మసీదు, దాని ఎదుట అన్ని రకాల దుకాణాల ముందరి కశ్మలాలు తొలగి, మరింత ప్రయాణయోగ్యంగా కనిపిస్తున్నది. ఇందుకోసం కార్యకర్తలు 3 జట్లుగా విడిపోయి, సమన్వయంతో సాగించిన కృషి ఇలా ఉన్నది :

 

బందరు దారి ఉత్తర భవన ప్రాంగణంలోని పెద్ద వేప చెట్టు కొమ్మలు, రెమ్మలు బాట ప్రక్కన పడి ఉంటే, ఒక బృందం దాని చాటున, అడుగున పెరిగిన గడ్డిని సైతం నరికి, చెక్కి, పోగులు చేసి, ట్రస్టు ట్రక్కులోనికెక్కించి, డంపింగ్ కేంద్రానికి చేర్చారు.

 

రెండవ బృందం డజను మంది దారి మీది వ్యర్ధాలను, దుమ్ము ఇసుకలనే కాక బాట అంచుల మీద పేరుకొన్న ధూళి దుమ్ము ఇసుకలను గోకుడు పారలతో చెక్కి, చీపుళ్ళతో ఊడ్చి, డిప్పలతో ట్రక్కులోకి చేర్చారు. ఈ పురుష మహిళా కార్యకర్తల పని దీక్ష, చతురోక్తులు, చాతుర్యాలు, సందడి చూస్తుంటే చల్లపల్లి స్వచ్చోద్యమ పండుగ ప్రత్యేకత ఏమిటో ఎవరికైనా ఇట్టే బోధ పడుతుంది.

 

మూడవ ముఠా కూడా పారలతోనో, రైల్వే పారలతోనో, కత్తులు దంతెలతోనో అవసరాన్ని బట్టి పని చేసుకుంటూ రాజ్యలక్ష్మి ఆస్పత్రి వీధి వరకు శుభ్రపరచుకొంటూ పోయారు. ఎవరి సృజన శీలత వారిదే; ఎవరి శ్రమజీవన సంతోషం వారిదే!

 

కాకపోతే ఇన్ని వేల దినాల స్వచ్ఛ ప్రయత్నాలు గమనించి కూడ గ్రామస్తుల్లో అధికులు అలనాటి భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి

 

“....దిగినాను దిగినాను దివి నుండి భువికి...

అని కవితా లోకంలో విహరించినట్లే – ‘మా ఇళ్ళ నుండి, మా పనుల్నుండి మేము మాత్రం గ్రామ బాధ్యతల్లో దిగం కాక దిగం... అని భీష్మించుకోవడమే కాస్త ఆశ్చర్యార్ధకంగా ఉంటున్నది.

 

కాఫీ కబుర్ల విరామ సమయంలో – 6.25 కు చిరకాల స్వచ్ఛ కార్యకర్త - హోటల్ యజమానురాలు - శ్రీమతి ముత్యాల లక్ష్మి ముమ్మారు నినదించిన గ్రామ స్వచ్ఛ పరిశుభ్ర సౌందర్య సంకల్పంతో నేటి వీధి పారిశుధ్య కృషికి స్వస్తి! మన స్వచ్చోద్యమ వైద్యుల వారు (డి. ఆర్.కె) మాత్రం ఎన్ని వేల దినాలైనా ఈ కార్యకర్తల బ్రహ్మముహూర్త గ్రామ సేవలకు ఆశ్చర్యానందాలు పొందుతూనే ఉంటారు!

 

రేపటి మన వీధి పారిశుధ్య శ్రమదానం కోసం ముత్యాల లక్ష్మి గారి హోటల్ దగ్గర వేకువ 4.30 కో ముందో కలుసుకుందాం!

 

కర్మయోగీ! ధర్మ జ్యోతీ! - 3

ఊరి జనముల చివరి మజిలీ ఉత్తమోత్తమ ఘన శ్మశానం

సంఘ సేవకు లెక్కడున్నా సత్కరించే సంప్రదాయం

కర్మయోగం ధర్మమార్గం గర్తపురి కొక మణి కిరీటం

అతడె నన్నపనేని అయ్యన్ రావు అతనికి మా ప్రణామం!   

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

09.07.2021.