2183* వ రోజు ....           10-Jul-2021

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!

28 మంది స్వగ్రామాంకిత స్వచ్చ కార్యకర్తల 2183* వ నాటి ఉద్యోగం.

10.07.2021 (శనివారం) వేకువ కనీసం 19 మంది 4.27 కే తమ కర్తవ్య పాలనకు దిగారు. ఇంకొక 9 మంది కాబోలు-నిముషాల వ్యవధిలో సదరు బందరు జాతీయ మార్గానికి చేరుకొన్నారు. ఇక తదాది 6.15 దాక- అంటే ఇంచుమించు 2 గంటల శ్రమదానానికీ, తన్మూలంగా మెరుగైన వీధి పారిశుద్ధ్యానికీ,  హడావిడిగా వస్తూ పోతున్న వందలాది గ్రామస్తులే సాక్షి; వాట్సాప్ ఛాయాచిత్ర సముదాయమే ఋజువు; 6.35 పిదప గమనించగల వారికి స్వచ్చ-శుభ్ర-సుందరంగా రూపొందిన ఈ రహదారే నిదర్శనం!

 

            సుమారు 100 మీటర్ల ప్రధాన వీధిలోను, రాజ్యలక్ష్మి ఆస్పత్రి బాటలోను, ట్రక్కు కు సరిపడా గడ్డి, దుమ్ము, ఎంగిలాకులు, ప్లాస్టిక్ కవర్లు లభించడమే వింత! వాటి సేకరణకు చీపుళ్లతో, దంతెలతో, పారలతో, అప్పుడప్పుడు కత్తులతో, డ్రైన్లలో అయితే రైల్వే పారలతో  వేలాది దినాలుగా శ్రమిస్తున్న, సంచలిస్తున్న స్వచ్చ కార్యకర్త లెంత ధన్యులు!

ఉదాహరణకు- రాజ్యలక్ష్మి ఆస్పత్రి వీధి మొదట్లో 15-20 అడుగుల మురుగు కాలువ వ్యర్ధాలను, అంచులమీది గడ్డిని, పిచ్చి మొక్కల్ని తొలగించడంలో వంచిన నడుం ఎత్తకుండ శ్రమించే ఆరేడుగుర్ని ఛాయా చిత్రంలో తిలకించండి. వ్యర్థాలను, తుక్కును డిప్పలతో మోస్తూ ట్రాక్టరులోకి ఎక్కిస్తున్న మహిళామ తల్లుల్ని గమనించండి. అంతిమంగా 6.30 వేళకు అద్దంలా సౌందర్య నిబద్ధంగా ఉన్న నేటి బందరు మార్గం భాగాన్నీ చూడండి.

            ఈ రోజు శ్రమదాతలు 28 మందే కావచ్చు- వాళ్లు చెక్కిన సుందరీకృత స్వచ్చ శిల్పం నిడివి 100 గజాలే కావచ్చు! గ్రామస్తులకు స్ఫురించవలసింది మాత్రం వాళ్ళ నిబద్ధత, పూనిక మాత్రమే! 300 ఏళ్ల క్రితం కాబోలు- వేమన అన్నాడు:

            గంగిగోవు పాలు  గరిటెడైనను చాలు

            కడివెడైన  ఏల  ఖరము పాలు?

            భక్తి కలుగు కూడు  పట్టెడు చాలదా?

            విశ్వదాభిరామ !  వినుర వేమ!

 

6.15 దాక పోలీసు కార్యాలయ వీధి దాక శుభ్ర పరిచిన తర్వాత, 10 నిముషాల కాఫీ సరదాల పిదప నేటి ఆదర్శ కృషి సమీక్ష వేళ- దుబాయిలో ఉద్యోగి, నాగేంద్ర కుమార్ చల్లపల్లి స్వచ్చంద శుభ్ర సౌందర్య సంకల్పాన్ని నినాద రూపంలో ముమ్మారు చాటి చెప్పి, సకృత్తుగా నైనా తానిందులో పాల్గొన్న అనుభవాలను, నేర్పిన పాఠాలను ప్రస్తావించారు. డాక్టరు రామ కృష్ణ ప్రసాదు గారు కరోన సంబంధిత అప్రమత్తతను హెచ్చరించారు.  తన 66 వ జన్మదిన జ్ఞాపికగా కొర్రపాటి వీరసింహుడు కార్యకర్తలకు మిఠాయిని, ట్రస్టుకు 666/- విరాళాన్ని అందించిన సౌజన్యానికి కృతజ్ఞతలు.

 

            బైపాసు మార్గంలో – కమ్యూనిస్టు వీధి చివర మన గ్రామ శౌచ విధుల కోసం రేపటి వేకువ 4.30 ప్రాంతంలో మరలా కలుసుకొందాం!

 

     కర్మయోగీ! ధర్మ జ్యోతీ! – 4

కాలమును శాసించు ధన్యులు – కర్మ యోగులు – ధర్మ జ్యోతులు

అక్రమాన్యాయాల నడుమనె సక్రమోత్తమ బాటసారులు

అప్పుడప్పుడు సమాజంలో అవతరిస్తారను ప్రవచనం

నిజం చేసిన అయ్యన్ రావు కు నిండు మనసులతో నివాళులు!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

10.07.2021.