2184* వ రోజు ....           11-Jul-2021

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!

36 మంది స్వచ్చ సంస్కృతీ పరుల 2184* వ నాటి కృషి.

 

వేకువ సమయంలో 4.31 – 6.10 నడుమ ఈ ఆదివారం (11.07.2021) నాటి చల్లపల్లి స్వచ్చోద్యమ సంరంభం సినిమా హాలు ఉప మార్గంలో కమ్యూనిస్టు వీధి కలయిక ప్రాంతంలో.

 

విజయ నగర్ రెండు వీధుల నుండి పడమరగా సూరి డాక్టరు వీధి వరకు బైపాసు మార్గం ఇప్పుడెంత దర్శనీయంగా కనిపిస్తున్నదో చూడండి. 50-60 పని గంటల ఫలితం గదా! చిత్త శుద్ధితోను, నిరపేక్షంగాను చేసే ఏ ఉమ్మడి ప్రయోజనసాధనైనా ఇలాగే ఉంటుంది మరి!

 

            ఇదొక సంరంభం-సందడి అని వర్ణించవలసిన అవసరమేమంటే – ఈ గ్రామ సుదీర్ఘ చరిత్రలో, సామాజిక పరివర్తన అంశంలో 7 ఏళ్ల స్వచ్చ-సుందర ప్రయత్నం ఒక మేలు మలుపని, మేటి అధ్యాయమనీ! ట్రాక్టరు ట్రక్కు, కారు ద్విచక్ర వాహనాలు, 2183 * దినాలుగా-మైకులో పాటలు వింటూ-ఇందరు గ్రామ మెరుగుదల దీక్షా పరులు హుషారుగా చేతనైనంత మేరకు ప్రణాళికా బద్ధంగా వీధులను, డ్రైన్లను, శ్మశానాలను, కార్యాలయ ప్రాంగణాలను, పంట కాల్వలను.... శుభ్ర- సుందర-హరిత మయం చేస్తున్న ఘట్టం నేటి, భవిష్యత్తరాలకు ఉదాహరణ యోగ్యం కాక తప్పదనీ!

 

            నేటి స్వచ్చ యజ్ఞంలో 30 మందికి పైగా సమిధలు చిరు చినుకుల్లో తడుస్తూనే:-

150 గజాల ప్రధాన వీధి కశ్మలాలను ఊడ్చారు; ప్లాస్టిక్ సంచుల- ఎంగిలాకుల- పిచ్చి, ముళ్ల మొక్కల, గడ్డి దుబ్బుల, ఎండుటాకుల,  ఇతర చెత్తలను కత్తులు, పారలు, దంతెలతో నరికి, లాగి, ట్రక్కుల్లోనికెత్తి చెత్త కేంద్రానికి చేర్చారు.  

తామే నాటి- సాకి-పెంచిన మొక్కల్ని సుందరీకరించి, రహదారి ఉద్యానాలను సంస్కరించారు. మానవ సమాజం మంచి వైపుకు మరొక అడుగు పడేందుకు కావలసినవి ఇలాంటి త్యాగమయ సన్నివేశాలే.

 

కోడూరి వేంకటేశ్వర రావు గారు 66 వ జన్మదిన సందర్భంలో ట్రస్టు ఖర్చులకు 500/- విరాళం కాక, సహ కార్యకర్తల కెన్ని రకాల ఉపాహారాలు సమకూర్చారంటే- శ్రీ శ్రీ “ సంధ్యా సమస్యలు” గేయం గుర్తుకు వచ్చింది.

            “ అటు చూస్తే బాదం హల్వా

            ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ

            ఎంచుకొనే సమస్య కలిగిందొక వ్యక్తికి...”

            మరొక 83 ఏళ్ల వృద్ధ బాలుడు- మాలెంపాటి గోపాల కృష్ణయ్య గారి నెలవారీ స్వచ్చోద్యమ చందా 2000/-,

            చల్లపల్లి స్వచ్చోద్యమ కురు వృద్ధుడు దాసరి రామ మోహన రావు (90 వ ఏడు మాత్రమే!) గారి 2,00,000/-విరాళం కాక, మనకోసం ట్రస్టు, పద్మావతి ఆసుపత్రి ఉద్యోగులకు 1,50,000/- వెరసి 3 ½ లక్షలు (గతంలో ట్రస్టుకు ఇచ్చిన 14 లక్షలతో కలిపి మొత్తం ఇప్పటి వరకు16 లక్షల రూపాయలు గ్రామాభివృద్ధి కోసం విరాళం ఇచ్చారు) స్వచ్చోద్యమకారులందరికీ స్వీట్లు పెట్టెలు.... అన్నీ అందాయి. కార్యకర్తలకు, చల్లపల్లి స్వచ్చోద్యమానికీ- దీవనలతో సహా!

 

            బుధవారం(14.07.2021)నాటి వేకువ మన గ్రామ కర్తవ్య నిర్వహణా ప్రదేశం- వర్షం లేకుంటే పోలీస్ కార్యాలయ వీధి, ఉంటే నేటి బైపాస్ మార్గం.

 

       వారసత్వం అందుకొనుటకు.

     జనాందోళనలకెపుడో స్థావరమీ చల్లపల్లి

సదాచారణ-సద్భావుక-స్వచ్చోద్యమ పాలవెల్లి

ఆ వారసత్వ మందుకొనగ ప్రతి యొక్కరు కదలి రండు!

అనుసరించి ఆచరింపు డా ఉద్యమ స్ఫూర్తి నెపుడు!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

11.07.2021.