2185* వ రోజు ....           14-Jul-2021

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!

 

27 మంది స్వచ్చంద శ్రమదాతల 2184* వ నాటి గ్రామసేవ.  

 

నేటి శ్రమదాన సమయం (14.07.2021) – 4.24 – 6.10 AM ఐతే – స్వచ్ఛ కార్యకర్తల కార్యక్షేత్రం బైపాసు మార్గంలోని అశోక్ నగర్ – భారత లక్ష్మి ధాన్యం మర ప్రాంతం. ఉరుముల – మెరుపుల ధనాధన్ వర్షం కాదు గాని, వీధి శుభ్రతా సమయం ఆసాంతం చినుకులే! తలలు, బట్టలు తడుస్తున్నా చెమటలంతగా పట్టని – సుమారు 50 పని గంటల నిస్వార్ధ, నిర్విరామ స్వగ్రామ బాధ్యతా నిర్వహణలో – ఆసక్తి ఉండాలే గాని, పరిశీలకులకు ఈ కార్యకర్తల స్వచ్ఛ – సుందర – శుభ్రతా విన్యాసాలెన్నైనా కనిపిస్తాయి!

 

“బ్యూటీ లైస్ నాట్ ఇన్ హోల్డర్ – బట్ ఇన్ ది వ్యూయర్” అనే సామెత నిజమే ఐ ఉంటుంది. ఇందరి శ్రమ మూలంగా ఇంత పరిశుభ్ర – హరిత – సుందరంగా రూపొందిన రహదారి మీద నడిచే వాళ్ళలో ఏ కొద్ది మందో తప్ప వీధి సొగసును ఆగి – చూచి – మెచ్చే వాళ్లెందరు?  

ఈ‌ శుభోదయాన నేటి స్వచ్ఛ కార్యకర్తలలో –

 

- కొందరు చీపుళ్లతో బాటను, దాని దరులను శుభ్రపరిచారు.

 

- ఇద్దరు గొర్రులతో డ్రైన్లలో ఏపుగా పెరిగిన గడ్డిని, ప్లాస్టిక్ తుక్కుతో సహా లాఘవంగా బైటకు తెచ్చారు.

 

- దుబాయి నుండి వచ్చి కొన్నాళ్లుగా గ్రామ సేవలో పాల్గొంటున్న పొడవాటి యువకుడితో సహా – ముగ్గురు బారు కత్తి, కత్తెర సాయంతో వీధి కడ్డం వస్తున్న కొమ్మల్ని కత్తిరించి, సౌకర్యం లోపించకుండ చూశారు.

 

- బాట ప్రక్కన, మురుగు కాల్వ అంచున ఐదారుగురు గడ్డిని పారలతో చెక్కి, కొడవళ్ళతో కోసి, దారిని విశాలపరిచారు.

 

- సుందరీకర్తలు పూల మొక్కల పాదుల కలుపును తొలగించి, అవసరార్ధం ట్రిమ్ చేసి ప్రయాణికుల ఆహ్లాదాన్ని ద్విగుణీకృతం చేశారు.

 

- ఇంటి పనుల్తో క్షణం తీరిక లేని ఒకామె కనీసం అరగంటైనా గ్రామ బాధ్యతను పంచుకొని వెళ్లింది. (ఆ కాస్త సంతృప్తితో రోజంతా సంతోషం పొందగలదు)

 

6.15 తరువాత – కాఫీ – కబుర్ల వేళ – రోజువారీ కృషి సమీక్షకు ముందు – పల్నాటి అన్నపూర్ణ వినిపించిన గ్రామ స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య సంకల్ప నినాదాలు కొంచెం భిన్నంగానూ, శ్రావ్యంగానూ ఉన్నాయి. స్వచ్చోద్యమ సారధి (డాక్టర్ DRK) గారి ఆశ(యం) ఏమంటే – ఈ కొద్ది మందిమి పాటుబడుతుంటేనే – వీధులింత ఆహ్లాదకరంగా ఉన్నాయే, రెండు మూడు వందల మంది గ్రామస్తులిలా పూనుకొంటే ఇంకెంతగా ఈ చల్లపల్లి అద్భుతంగా ఉంటుందో అని!

 

రేపటి మన వేకువ సమయపు వీధి పారిశుద్ధ్య ప్రయత్నాన్ని కూడ బాలికల వసతి గృహం సమీపం నుండే కొనసాగిద్దాం!

 

             చాటిస్తాం – పాటిస్తాం.

స్వచ్చోద్యమ సంరంభమె సాహసమని – సముచితమని

స్వచ్ఛ సైన్య సారధ్యమె సక్రమమని – సార్ధకమని

అది వినా భవితకు ఆస్కారం లేనేలేదని

ఎక్కడెన్ని మార్లైనా – ఇట్లే ప్రకటిస్తామని!   

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

14.07.2021.