2186* వ రోజు ....           15-Jul-2021

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!

 

స్వచ్చ సుందరోద్యమ చల్లపల్లి లో 2186* వ నాటి విశిష్టత.

 

ఇది గురువారం (15.07.2021) వేకువ 4.32 సమయం. వాట్సాప్ ఛాయా చిత్రంలో స్వచ్ఛ సేవకు ఉద్యుక్తులౌతున్న 13 మంది కాక మరొక 12 మంది ప్రభుత్వ బాలికల వసతి గృహంకు మూడు ప్రక్కల నిర్వహించిన పారిశుధ్యం ప్రశంసనీయం. అది కూడా ఎడతెగని సన్నచినుకుల నడుమ! గ్రామ జనాభాతో పోల్చుకున్నప్పుడు వీరి సంఖ్య ఏపాటిది? ఐతే – వీరి కార్యదీక్ష, ఎడతెగని సుదీర్ఘ సమయ మొండి ప్రయత్నం, ఇన్ని వేల దినాలైనా తరగని ఉత్సాహాలు మాత్రం గుర్తు పెట్టుకోదగినది.

 

వీరు సుమారు 2 గంట పాటు జరిపిన పోరాటంతో వసతి గృహానికి ముందు, పడమర దిక్కున అసలే శుభ్రంగా ఉన్న 150 గజాల బాటలు, డ్రైన్ల గట్టులు ఇప్పుడెంత కనువిందు చేస్తున్నదీ  సామాజిక మాద్యమ చిత్రంలో గాని లేదా స్వయంగా గానీ ఏ గ్రామస్తులైనా ఇట్టే చూసి తెలుసుకోవచ్చు.

 

గంగులపాలెం రోడ్డు తరువాత ఏడేళ్ళ క్రిందట కాలుష్యం గాఢతకు, బాహ్య విసర్జనలకు, నానా రకాల కశ్మల దరిద్రాలకు ఈ చోటే చెప్పుకోదగినది! ఐతే పారిశుధ్య పని రాక్షసులైన ఈ స్వచ్ఛ కార్యకర్తల వేలాది గంటల కృషితో ఇన్ని రహదారి పూల వనాలు, ఇంత పచ్చదనం, ఎవరైనా ఆహ్లాదకరంగా ఈ రోడ్ల మీద సంచరించే అవకాశం దక్కినవి.

 

ఈ దినం కూడా ఈ పాతిక మంది స్త్రీ, పురుష కార్యకర్తలు :

 

కాస్త అందవిహీనమైన చెట్ల కొమ్మలను కత్తిరించారు; బాట మార్జిన్ల గడ్డిని చెక్కారు; క్రమరహితంగా పెరుగుతున్న పిచ్చి, ముళ్ళ మొక్కల్ని తొలగించారు; చీపుళ్లతో మూడు బాటలను ఊడ్చారు; ప్రహరీ గోడల, కరెంటు స్తంభాల కాగితపు ముక్కలను తొలగించి చూపరుల దృష్టినాకర్షించే  రహదారి సౌందర్యాలకు మరిన్ని మెరుగులు దిద్దారు.

 

వీళ్ళ పారుశుధ్య చర్యల ఫలితంగా పుట్టుకొచ్చిన రకరకాల వ్యర్ధాలను గొర్రులతో లాగి, పంజాలతో డిప్పలలో కెత్తి, ట్రస్టు సంబంధిత ట్రక్కులోనికి పేర్చి ఐదారుగురు కార్యకర్తలు చెత్త కేంద్రానికి తరలించారు. ఈ పనులన్నీ చేయడం సరే – ఈ పనుల సమయంలో కార్యకర్తలందరి ముఖాలలో కనిపించే కార్యదీక్ష, అంకితభావం, తమ పనుల పట్ల, తత్ఫలితాల పట్ల వాళ్ళ అచంచల విశ్వాసం – ఇవే నన్ను ఏరోజైనా ఆకర్షించేవి.

 

6.15 నిమిషాల సమయంలో, సంతృప్తికర వీధి పారిశుధ్య చర్యల పిదప కాఫీ – సరదా కబుర్ల వేళ – ఆకుల దుర్గాప్రసాదు మహోదయుడు ముమ్మారు ప్రకటించిన గ్రామ స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య సంకల్ప నినాదాలను మిగిలిన వారు అందిపుచ్చుకొనడంతోను, డాక్టర్ DRK ప్రసాదు గారి నేటి స్వచ్ఛ సంరంభ సమీక్షతోను నేటి మన కార్యక్రమం ముగిసింది.

 

రేపటి మన స్వచ్ఛ స్ఫూర్తిదాయక చర్యల కోసం పాత కస్తూర్భా ఆసుపత్రి దగ్గర కలుసుకొందాం.

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

15.07.2021.