2187* వ రోజు ....           17-Jul-2021

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!

 

స్వచ్చ సుందరోద్యమ చల్లపల్లి లో 2187* వ నాటి కృషి.

 

ఈ శనివారం (17.07.2021) వేకువ 4.21 నిముషాల కే ప్రారంభమైన స్వచ్చ ఉద్యమ వికాసం 6.12 నిముషాల దాక పని సమయంలోనూ చిత్తడిగా తయారైన ప్రదేశంలో – 1 వ వార్డు  బైపాసు మార్గంలో నిర్విఘ్నంగా ముగిసింది.

పాల్గొన్న  ధన్యులు 23 మందే. జరిగిన గ్రామ  స్వచ్చ సుందరీకరణ మాత్రం మూడు విధాలు:

 

-  ఈ సన్నని వానలోనే

 

– ఒక కార్యకర్త అడుగో - వంచిన నడుమెత్తకుండా రైల్వే పారతో వాన నీటిని కొన్ని మొక్కలకు మళ్లిస్తున్నాడు. 

 

- మరొక ఔత్సాహికుడు పద్మ దళాల మధ్య ఏపుగా,  దట్టంగా మితిమీరిన పచ్చదనంతో పెరుగుతున్న మోనోకార్పస్ మొక్కను  ట్రిమ్ చేస్తూ మరింత సుందరీకరిస్తూ ఎనలేని ఆనందం పొందుతున్నాడు.

 

- కత్తి వీరులిద్దరు లోతైన మురుగు కాల్వ అంచున నిలబడి విరగబూసిన పూల చెట్టు కొమ్మలను సవరిస్తున్నారు.

 

- గ్రామ సర్పంచ్ తో బాటు ముగ్గురు మహిళా కార్యకర్తలు రోడ్డు మీది  ఆకులలములను, కొమ్మ రెమ్మలను, గొర్రులతో లాగి గుట్టలుగా పేరుస్తున్నారు.

 

- వీరు కాక పారలతో ఇద్దరు, చీపుళ్లతో ముగ్గురు, తమ గ్రామ వీధి స్వచ్చ సౌందర్యాలకు హామీ ఇస్తున్నారు.

- మిగిలిన వారు ప్రధాన మురుగు కాల్వలో దిగి తూములకు అడ్డుపడిన చెత్తను, కొబ్బరి బోండాలను తొలగిస్తూ నిలిచిపోయిన మురుగుకు పరుగులు నేర్పుతున్నారు ; ట్రాక్టరు ట్రక్కు లోనికి రకరకాల చెత్తలను నింపేవారు; క్రొత్తగా రంగు రంగుల అడవి తంగేడు పూల మొక్కల్ని నాటేవారు!

 

            ఏ రెండు వేల రెండు వందల రోజుల నుండో చల్లపల్లి స్వచ్చ సైనికులకు ఇదే నిత్య కార్యక్రమం. అసలు చల్లపల్లి లో కాక ఇంకెక్కడైనా ఒక పంచాయితీ సర్పంచ్ సకుటుంబంగా వానలోనే, బురదలోనే ఇలా రోజూ వీధి శుభ్రతకు పాటుపడతారా? వయసు మీరుతున్న ఒక సుప్రసిద్ధ వైద్యుడు ఈ చిత్తడిలోనే  రెండు గంటల పాటు వీధిలో నిలిచి పనిచేస్తాడా? .......

 

            మరి, ఇదే చల్లపల్లి ప్రత్యేకత – ఇందువలననే ఈ గ్రామానికింత పరిశుభ్రత- ఈ కారణంగానే ఈ చారిత్రాత్మక గ్రామ వీధులకు ఇంత స్వచ్చత!

 

            6.20 నిముషాల సమయంలో పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు  దేసు మాధురి ముమ్మారు అనర్గళంగా ప్రక్క  వార్డులలో ప్రతిధ్వనించేంతగా తన గ్రామ స్వచ్చ –శుభ్ర- సౌందర్య సంకల్ప నినాదాలను ప్రకటించి, డాక్టరు DRK గారి సమీక్ష కూడ ముగించి కార్యకర్తలు గృహోన్ముఖులయ్యారు.

 

రేపటి మన స్వచ్చోద్యమ సంరంభం కోసం గంగులవారిపాలెం మార్గంలోని పద్మాభిరామం దగ్గర వేకువనే మన పరస్పర పునర్దర్శనం.

 

           అరుదగు స్వచ్చోద్యమాన్ని

రెండువేలదినాల పైగా- నిండు మనసుల శ్రమ విరాళం

ధన విరాళం- సమయదానం- గ్రామ దుస్థితి పరిష్కారం

ఇంతకన్నా మేటి ఉద్యమ మిటీవల కాలాన గలదా?

అనుసరించీ- ఆదరించీ-స్వచ్చ సంస్కృతి చాటవలదా!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

17.07.2021.