2188* వ రోజు ....           18-Jul-2021

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!

 

స్వచ్ఛ సంచిత చల్లపల్లిలో అప్రతిహతమైన 2188* వ నాడు.

 

18.07.2021 (ఆదివారం) నాటి వేకువ – 4.25/6.15 సమయాల నడుమ గంగులవారిపాలెం బాటలో, పద్మాభిరామం పరిసరంలో ప్రవర్ధిల్లిన జనహిత సత్కార్యంలో ఇంత పెద్ద గ్రామం నుండి పాల్గొన్నది కేవలం 25 మంది! శుభ్ర సుందర హితంగా రూపొందినది కూడ ప్రధానంగా ఒక్క ఉపమార్గమే సాయి నగర్ మొదటి అడ్డబాటే! ఐతే సుమారు 2 గంటల వ్యవధిలో ఈ వీధి 150 గజాల పైగా ఇప్పుడు చూపరులకు నయనానందదాయకమే!

 

ఊరిలో ఉద్యోగులకు, విద్యార్ధులకు, చాల మందికి ఆదివారం ఆటవిడుపే గాని స్వచ్చోద్యమ కర్తలకు మాత్రం కాదు. బాటకు రెండు దరుల డ్రైన్ల మురుగులోను, వీరభద్రరావు గారింటి ఆవరణలోను, తాతినేని రమణ నివాస గృహం వెనుక దడదడపడుతున్న వానలోనే వీధి పారిశుధ్య కృషి కొనసాగింది. మధ్యలో కరెంటు లేక చీకటే గానీ వానకు ముందర ఉక్కపోతే గానీ, ఇందులో ఎవరు ప్రక్క ఇళ్ళ వసారాలనాశ్రయించారు? ట్రక్కులోనికి లోడింగ్, ముళ్ళ పిచ్చి మొక్కల తొలగింపు, బాట ప్రక్కల గడ్డి చెక్కుడు ఏవి ఆగినవి కనుక!

 

1100 ఏళ్ల నాడు మహనీయుడు రాజకవి భర్తృహరి ఎంతగా సమాజ పరిశీలన చేసి చెప్పాడో గాని ఈ కర్మిష్టులను చూస్తున్న ప్రతి మారు నాకు

 

....... “ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్దార్ధమునుజ్ఞగింపరు సుమీ ప్రజ్ఞా నిధుల్ గావునన్అనే మానవ వర్గీకరణ పద్యమే గుర్తుకొస్తుంది.

 (ఆ... మనకెందుకొచ్చిన గొడవ? అని ఒక రకం వారు (నీచ మానవులు) ఉత్తమ కార్యాలు మొదలే పెట్టరు;

 మధ్యములు అత్త్యుత్సాహంతో మొదలుపెడతారు గాని ఆటంకాలు వస్తే ఆపేస్తారు;

అత్యుత్తములే విఘ్నాలకు ఎదురొడ్డి, రెట్టించిన ఉత్సాహంతో ఉత్తమకార్యాలు సాధిస్తారు)

 

నిద్ర భయ క్షుత్ మైధునాలు అన్ని జీవులకూ వర్తిస్తాయి;

అత్యున్నతమానవులే వాటికతీతంగా సకల జనహితం సాధిస్తారు...అని కూడ ఏ పెద్దలో సెలవిచ్చారు!

 

6.15 సమయంలో కాఫీ వేళ నేటి తమ గ్రామ మెరుగుదల కృషి సింహవలోకనం చేసుకొని, జూన్ మాసపు జమాఖర్చు తెలుసుకుని భోగాది వాసుదేవుని త్రిగుణాత్మక గ్రామ స్వచ్ఛ పరిశుభ్ర సౌందర్య సంకల్ప నినాదాలను ప్రతి ధ్వనించి, అందరూ గృహోన్ముఖులయ్యారు.

 

బుధవారం (21.07.2021) నాటి మన స్వచ్ఛ సంకల్ప పరిపూర్తి కోసం ఈ గంగులవారిపాలెం బాటలోనే పద్మాభిరామం ఎదుటనే వేకువనే కలుసుకొందాం.

 

సంకుచిత్వం జిందాబాద్.

 

వేల నాళ్ళుగ కార్యకర్తల కృషికి ఫలితం అందునప్పుడు

స్వచ్ఛ సుందర కలల గ్రామం స్వస్తతలు కనిపించినప్పుడు

నిజం తెలిసీ భుజం కలిపీ నిలువ వలసిన గ్రామ వాసులు

అంటి ముట్టక తప్పుకొనుటలు అహో ఎంతటి విచిత్రములు!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

18.07.2021.