2189* వ రోజు....           21-Jul-2021

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!

 

విశిష్ట గ్రామ స్వచ్చోద్యమంలో మరొక (2189* ) ఘట్టం.

 

            బుధవారం (21.07.2021) నాటి వేకువ సైతం 4.22 సమయం నుండి 6.10 వరకు చల్లపల్లిలో అదే కధ! అదే గంగులవారిపాలెం బాటలో మరొక 100 గజాల మేర తీరిన వీధి కాలుష్యం వ్యధ! స్వచ్ఛ కార్యకర్తలు 17 మందే! ఐతే – వీరి సుమారు 30 పని గంటల పరిశుభ్ర – సౌందర్య కృషిని – అదీ తుంపరగా జాలువారుతున్న వానలోనే – చూసి అభినందించ గల గ్రామ సోదరులదే అదృష్టం!

 

            ఈ చల్లపల్లి ఎక్కడికీ పోదు – వీధుల, డ్రైనుల కశ్మల అవశేషాలు కూడ బహుశా చిరంజీవులేనేమో! కాకుంటే, వేలాది దినాల స్వచ్చంద ఉద్యమకారణంగా తక్కిన గ్రామాలకన్న ఈ ఊరు మెరుగుదల మాత్రం సుస్పష్టమే! మరి, అంతిమంగా ఏది గెలవాలి? ఏవి మిగలాలి? ఎవరి ఆలోచనలు మారాలి?... అనేవే అసలు ప్రశ్నలు! కొంచెం నిశిత పరిశీలనా పరులైతే - ఈ మురుగు కాల్వ గట్టును ఈ ఒక్క కార్యకర్తే - ఇంత అవలీలగా - ఇంత దూరం – ఒంటి (ఎడమ) చేత్తో శుభ్ర పరిచాడా? ఇతడొక్కడే ఇన్ని గుట్టల తుక్కును ట్రాక్టర్ లోకి లాఘవంగా ఎక్కించాడా? ఈ ఆడ పడుచులిద్దరూ 100 గజాల వీధి కసవునెలా ఊడ్చారో!.... అని అవాక్కులైతే కావచ్చు!

 

            నా లాంటి కలం మనుషులు ఈ పరార్ధ జీవనులైన కార్యకర్తల శ్రమ సౌందర్యాన్ని దగ్గరగా పరిశీలిస్తూ ఇలా ఎన్ని వర్ణనలైనా చేయవచ్చు! డాక్టరు DRK. ప్రసాదు వంటి సామాజిక వైద్యుడు ప్రతి ఉదయం ఈ లోకోత్తర సేవా నిరతిని మనసారా ఆరాధనాభావంతో సమీక్షించవచ్చు! (అదే సమయంలో – ఇన్ని వేల దినాల బాధ్యతా నిర్వహణను గ్రామ సహోదరరుల్లో కొందరు పట్టించుకోకపోనూ వచ్చు కూడ!) వీటన్నిటి కతీతంగా దూషణ – భూషణ – మెర మెచ్చుల – తిరస్కారాల పైన కాక, తమ గ్రామ సౌభాగ్య లక్ష్యం మీదనే మనసు నిల్పి ముందుకు సాగుతున్న స్వచ్చోద్యమ కారులది గదా అసలైన ఆదర్శం?

 

            6.10 సమయాన, కాఫీ పానీయ ఆస్వాదన పిదప సమీక్షా సమావేశంలో ముమ్మారు నిష్క్రియాపరులకు కనువిప్పుగా తన ఊరి స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య సంక్షేమ సంకల్ప నినాదాలొనర్చినది ఆకుల దుర్గా ప్రసాదు. నేటి ప్రయత్న సాఫల్యాన్ని ప్రశంసించినది డాక్టర్ రామకృష్ణ ప్రసాదు.

 

            రేపటి వేకువ సుమారు 4.30 ప్రాంతాన మన పునర్దర్శన ప్రాంతం – గంగులవారిపాలెం బాటలోని పద్మాభిరామం పరిసరం!

 

           పాక్షిక విజయమా?

గ్రామ జనులు వేలాదిగ కదలి వచ్చు నంతదాక –

వీధి వీధి – ఇళ్ళు – ఎదల స్వచ్ఛత విలసిల్లు దాక –

చల్లపల్లి ప్రత్యంగుళ సౌందర్యము నిండు దాక –

ఎంత మహోద్యమమైనా – ఇది పాక్షిక విజయమే!

 

ఒక సీనియర్ స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

21.07.2021.