2190* వ రోజు....           22-Jul-2021

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!

 

2190* వ నాటి  గ్రామ బాధ్యతా నిర్వహణ.

 

            ఈ గురువారం (22.07.2021) నాటి వేకువ సైతం 4.30 నిముషాల నుండి 6.10 వరకు సంభవించిన స్వచ్ఛ కార్యకర్తల గ్రామ కర్తవ్య పరిపాలన విజయవంతమయింది. గంగులవారిపాలెం దారిలోని సన్ ఫ్లవర్ మార్గం సమీపాన నేటి పారిశుధ్య పనిపాటులు జరిగినవి.

 

వాస్తవానికి ఇదిఎడతెగని ముమ్మర వాన రోజే. 4.30 సమయనికి ముందే కాచుకున్న – వర్షం పోకడకై వేచి ఉన్న కార్యకర్తలు చిన్న వర్షంలోనే పని మొదలుపెట్టారు.  ఈ మార్గానికి పడమర ప్రక్క భవనం వెలుపలి ఖాళీ స్థలం, తూర్పు దిక్కున ఉన్న మరొక పూర్తి ఖాళీ జాగా ఈనాటి స్వచ్చ కార్యకర్తల ప్రయత్నంతో స్వచ్చ – శుభ్రవంతమైపోయినది. ఆక్కడి గడ్డి నిరర్ధక మొక్కను, పనిలో పనిగా ఏ పుణ్యాత్ముడో తినివేసిన ఎంగిలాకులు, కాగితాలు, ప్లాస్టిక్ సంచులను కూడా పీకి, నరికి, ఏరి డిప్పలలో నింపుకొని ట్రక్కు లోని కెక్కించి డంపింగ్ కేంద్రానికి చేర్చారు. పూల మొక్కల నడుమ కలుపును తొలగించే పని ఇద్దరు పూర్తి చేశారు.

           

వరుణ దేవుడు మాత్రం ఆపకుండా స్వచ్చ కార్యకర్తల కృషికి ఆటంకం కలిగించ జూస్తూనే ఉన్నాడు.

ఈ దోబూచుల పిదప 6.15 నిముషాల తరువాత కాఫీ కాషాయ సేవన సమయం గడచినపుడు మనకోసం మనం ట్రస్టు ఉద్యోగుల పర్యవేక్షకుడు కస్తూరి శ్రీనివాసుడు ముమ్మార్లు తనివితీరా వినిపించిన గ్రామ స్వచ్చ – పరిశుభ్ర- సౌందర్య  సాధనా సంకల్ప నినాదాలను అందరూ పునరుద్ఘాటించగా నేటి ఊరి స్వచ్చ శుభ్రతా ప్రయత్నం ముగిసింది.

 

రేపటి మన గ్రామ మెరుగుదల కృషి కోసం గంగులవారిపాలెం దారిలోని సన్ ఫ్లవర్ కాలనీ మార్గం దగ్గరే వేకువ జామున కలుసుకుందాం!

 

ఒక సీనియర్ స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

22.07.2021.