2191* వ రోజు....           23-Jul-2021

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!

 

నిస్వార్ధ శ్రమ జీవన ఉదహరణగా గ్రామ వీధి పారిశుధ్య కృషిలో @2191*.  

 

2191*వ (శుక్రవారం - 23.07.2021) నాటి వేకువ 4.21 సమయానికే మొదలై, 6.10 దాక నడచిన చల్లపల్లి స్వచ్చోద్యమ సందడి కారులు 18 మంది. స్వచ్ఛ కార్యకర్తల్ని ఈ బ్రహ్మ ముహూర్తం ఆరంభంలో తప్ప, వాన దేవుడు వదిలేశాడు. నిన్నటి నిర్ణయానుసారంగా గంగులవారిపాలెం మార్గంలోని సన్ ఫ్లవర్ గృహ సముదాయ వీధి మొదట ఆగిన కృత నిశ్చయులైన స్వచ్ఛ వీరులు అక్కడి నుండి దక్షిణాభిముఖంగా మరొక 120 గజాల మేర సదరు వీధి కశ్మల దరిద్రాల మీద 100 నిముషాలకు పైగా పొరాడి, విజేతలయ్యారు. దురదృష్టవశాత్తు సమీప నివాసితులు మాత్రం పాల్గొనలేదు!

 

ఈ తక్కువ మంది కార్యకర్తలే ఈ శుభోదయాన :

 

- చీపుళ్లతో వీధిని ఊడ్చారు.

- రోడ్డు ఉభయ దిశలా ఏపుగా పెరుగుతున్న గడ్డిని, పిచ్చి మొక్కల్ని ఎండుటాకుల్ని, కత్తులు, పారలు, దంతెలతో కోసి, నరికి, ఊడ్చారు.

- తామే నాటి పెంచిన ఉభయ పార్స్వాల చెట్ల కొమ్మలు రోడ్డు మీదికి దురాక్రమిస్తుంటే కత్తిరించారు.

- ఒకరు ట్రాక్టరు ట్రక్కులో ఎక్కి (ఇది ఈయన పర్మినెంట్ ఉద్యోగంలాగా కనిపిస్తున్నది) సర్దుతుంటే – ఇద్దరు డిప్పలతోను, చేతులతోను సకల వ్యర్ధాలను అందించారు.

 

ఈ వీధి (– గ్రామ) ప్రముఖ వైద్యుడొకాయన - అదే ఒక అదృష్టంగా భావిస్తూ వేరొకరి గులాబి రంగు భవన ప్రాంగణాన్ని ఊడుస్తూ పొందుతున్న సంతోషాన్ని (ఆ గృహస్తుడు కొంచెం సిగ్గుపడుతుండడాన్ని) - వాట్సాప్ ఛాయా చిత్రంలో గమనించారా?

 

            ఇద్దరో ముగ్గురో అదే భవనం ప్రహరీ వెలుపల తదేక దీక్షగా - వారి చేతుల్తోనే నాటి – పెంచిన పూల తోటలో బురదలోనే కలుపు తీస్తూ – ట్రిమ్ చేస్తూ – వంచిన నడుములెత్తని భంగిమల్నీ సదరు ఫొటోల్లో గమనించండి!

 

            పాఠక మహాశయులారా! చల్లపల్లి లో ఏడెనిమిదేళ్లుగా ఈ స్వచ్ఛ యజ్ఞమొక నిరంతర ధారావాహిక! ఎంతగా – ఎన్నాళ్లు తదేకంగా పరిశీలిస్తున్నా – నా బోటి కలం మనుషులకు తరగని స్ఫూర్తిదాయక స్వచ్చోద్యమ ప్రణాళిక!

 

BSNL అనే పౌరుష నామం గల గౌరిసెట్టి నరసింహారావు నామధేయుడు తన గ్రామ పరిశుభ్ర – స్వచ్ఛ – సౌందర్య సాధనా సంకల్ప విశిష్ట నినాదాలను ముమ్మారు ఓపికగా పలికిన - 6.15 వేళ – దైనందిన కృషి సమీక్ష కాలంలో ఈ కార్యకర్తల సరదా కబుర్లేవి? ఫలానా వీధిలో మనం నాటి, సాకిన మొక్కలు విరగబూసి, ఎంత అందంగా ఉన్నవో చూసారా?”

 

            “పడమటి వీధిలో వాన – మురుగు నీళ్ళు రోడ్డు మీదికి పొరలుతున్నవి కనిపెట్టరా?’

 

            “బండ్రేవు కోడు మురుగు కాల్వ గట్ల మీద ఏ రకాల – కొన్ని వందల పూల, పచ్చని చెట్లను ఈ వర్షాల్లోనే నాటి పూర్తి చేయాలి గదా?...”

 

            ఇలాంటి ముచ్చట్లే ఈ స్వచ్చ కార్యకర్తల దినదిన సంతోష కారణాలు!

           

            మన రేపటి పునర్నవ ఆనందదాయక స్వచ్ఛ – సుందర కృషి కోసం వేకువ ఝామున గంగులవారిపాలెం బాటలోనే కలుసుకొందాం!

 

ఇది విజ్ఞత – ఇదె ఆర్ద్రత – ఇది సామాజిక బాధ్యత

ఇది దాతృత – ఇది స్పష్టత – వీరికి గల సమయజ్ఞత

స్వంత ఊరి ఋణ విముక్తి సాధనలో కొంత తెగువ

మాట కాక – చేసి చూపు మార్గంలో మరొక చొరవ!      

 

ఒక సీనియర్ స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త (నల్లూరి రామారావు)

23.07.2021.