2192* వ రోజు....           24-Jul-2021

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!

 

శనివారం నాటి శ్రమదాన సందడి - @2192* వ నాడు.   

 

2192*వ దినం (24.07.2021) కూడ వేకువ 4.21 వేళకే – నిన్నటి స్వచ్ఛ – సుందరీకరణ విభాగానికి తరువాయిగా – గంగులవారిపాలెం బాటలో – కొలిమి మేస్త్రి గారి గేదె పాల ఉత్పత్తి ప్రదేశం, వీరబాబు – తదితరుల ఇళ్ల వద్ద సుమారు 150 గజాల మేర స్వచ్చోద్యమ సందడి ప్రారంభమై – 6.12 దాక కొనసాగింది. సదరు సందడికి కర్తలు 26 మంది. వరుణ దేవుడి బెడద లేకుండ నేటి వీధి పారిశుధ్య కృషి సాఫీగా జరిగిపోయింది.

 

వాల్మీకి – వ్యాసుల రామాయణ – భారత ఇతిహాసాల్లోనూ, హోమర్ – డాంటీల ఇలియడ్ - డివైన్ కామెడీల్లోనూ, కాళిదాసు – షేక్స్పియర్ నాటకాల్లోనూ ఆయాకాలాల ధర్మాధర్మ ప్రతినిధులైన నాయక – ప్రతి నాయకులున్నట్లే ఈ అత్యాధునిక యుగ సమాజంలో కూడ ఎక్కడ జూచినా స్వచ్ఛ – పరిశుభ్రతల, కశ్మల – కాలుష్యాల ప్రతినిధులూ ఉండనే ఉన్నారు. కాని, అతి తక్కువగా – కొన్ని చోట్ల మాత్రమే. మరీ ముఖ్యంగా చల్లపల్లిలో మాత్రమే కాలుష్య రాక్షసుల మీద అలుపెరుగని పోరాటయోధులున్నారు.

 

సదరు పాతిక మంది ధర్మవీరుల పోరు ఫలితంగా ఉదయం అసలే హరిత, వర్ణ పుష్ప సౌందర్య సంభరితమైన ఈ గంగులవారిపాలెం దారి ఇపుడు – 6.20 తదుపరి మరింత స్వచ్ఛ శుభ్రంగా లేదా? ఇందుకు పాతిక మంది స్వచ్చ కార్యకర్తల 40 – 50 పని గంటల కృషే కారణం కాదా? బుద్ధుడు, గాంధీ వంటి ఋషులు, ప్రబోధించిన జీవన వికాస సూత్రాలివే కదా మరి! నెహ్రూ సెలవిచ్చిన “Live and let live” వంటి నినాదాల పరమార్ధమూ ఇదే!

 

అన్ని చోట్లా స్వార్ధమెందుకు ప్రబలిపోతున్నదో, కపటమెందుకు వికటాట్టహాసం చేస్తున్నదో, సమిష్టి జీవనం బదులు వ్యష్టి బ్రతుకు పోకడలెంతదాక తెగిస్తున్నవో – వీటి విరుగుడుగా ఏ ఉద్యమాలు రావాలో ఆలోచించే తరుణమిది.

 

ఈనాటి సంతృప్తిదాయక కృషి సమీక్షా కాలంలో – దుబాయి నుండి వచ్చిన – మనకోసం మనం ట్రస్టు కు చిన్న వయసులో ప్రాతినిధ్యం వహిస్తున్న – దాసరి స్నేహ త్రిగుణాత్మకంగా ప్రవచించిన గ్రామ స్వచ్చ – పరిశుభ్ర – సౌందర్య సాధనా సంకల్ప నినాదాలతోను, DRK డాక్టర్ గారి రేపటి (వైద్య శిబిరం దృష్ట్యా) స్వచ్చ కృషి ప్రదేశ నిర్దేశంతోను 6.30 కి మన గ్రామ బాధ్యత రేపటికి వాయిదా పడింది.

 

ఆదివారమ నాటి వేకువ మన కలయిక విజయా కాన్వెంట్ – ప్రభుత్వ వైద్యశాల ప్రాంతంలోనే!

 

ఉద్యమించు మహనీయులు.

 

అహంకార రహితంగా – పెను బాధ్యత భరితంగా

శ్రమ బంధుర సహితంగా – సుమ సుందర విహితంగా

ఊరి నెల్ల తీర్చిదిద్ద ఉద్యమించు మహనీయులు

అందరికభివందనములు! అద్భుత సుమచందనములు!

 

ఒక సీనియర్ స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త (నల్లూరి రామారావు)

24.07.2021.