1883 * వ రోజు....           07-Jan-2020

  

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1883* వ నాటి శ్రమ జీవన సంస్కృతి.  

 

ఈ వేకువ 3.59-6.20 నిముషాల నడుమ బైపాస్ మార్గం నుండి భారత లక్ష్మి వడ్ల మర దారిలోను, సామ్యవాద(కమ్యూనిస్టు) మార్గం దగ్గర ద్వివిధంగా జరిగిన స్వచ్చ-సుందరీకరణ చర్యలలో పాల్గొన్న కార్యకర్తలు 27 మంది.

 

ఒకప్పటి దుర్గంధ దుర్భర మార్గాలలో ఒకటైన- వాసిరెడ్డి కోటేశ్వర రావు గారి ఒంటి చేత్తో సంస్కరింపబడి-పూల తోట పెరిగి దర్శనీయంగా రూపొందిన ధాన్యం మర అడ్డ దారిని 20 మంది కార్యకర్తలు రెండు ప్రక్కల పిచ్చి మొక్కల్ని, గడ్డిని, ఇతర వ్యర్ధాలను తొలగించి, పోగులు చేసి, డిప్పలతో ట్రస్టు ట్రాక్టర్ లో నింపి, చెత్త కేంద్రానికి చేర్చారు. శుభ్రపడిన ఆ ఉద్యానంతో ఈ వీధి ఇప్పుడు వాసిరెడ్డి వారికి మన నివాళి!

 

బైపాస్ మార్గం ప్రక్క నున్న మా స్తలం ప్రహరీకి సౌందర్యారాధకులైన కార్యకర్తలు రంగులద్దీ, చిరు చిత్ర లేఖనం చేయడంతో ఆ వీధికి కొత్త కళ వచ్చింది. అక్కడి నుండి సాగర్ టాకీస్ వైపుగా 30 లాన్టానా పూల మొక్కల్ని నాటడంతో బైపాస్ మార్గానికి మరింత జీవకళ వచ్చింది!

 

కాఫీ, టీ ఆస్వాదనానంతర సమీక్షా సమావేశంలో మనకోసం మనం మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ రామకృష్ణ ప్రసాదు గారు డిసెంబరు మాసానికి గాను స్వచ్చోద్యమ జమా ఖర్చుల వివరాలను సమర్పించారు. షరా మామూలుగా గత నెలకు సుమారు 2 లక్షల లోటే! అందులో సింహ భాగం డాక్టర్ పద్మావతి గారి వంతే!

 

ఉస్మాన్ షరీఫ్ గారు ముమ్మారు ఎలుగెత్తి ప్రకటించిన గ్రామ స్వచ్చ- శుభ్ర-సుందర సంకల్ప నినాదాలను కార్యకర్తలంతా ప్రతిధ్వనించి, 6.40 నిముషాలకు నేటి మన ఊరుమ్మడి బాధ్యత ముగిసింది.

 

తరువాయి కర్తవ్య నిర్వహణ కోసం రేపటి వేకువనే 1 వ వార్డు- బాలికల వసతి గృహం దగ్గర కలుసుకొందాం!

      స్వచ్చోద్యమ చల్లపల్లి కథ....

స్వచ్చోద్యమ చల్లపల్లి కథాక్రమం బెట్టిదనగా –

సామాజిక ఋణం తీర్చు తాత్వికత పునాదిగా

డాక్టర్లై కూడ మురికి దార్లు పదే పదే ఊడ్పు!

కోటీశ్వరులైనా మురుగు గుంటలలో సిల్టు తీత!    

 

   నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు- మనకోసం మనం ట్రస్టు,

మంగళవారం – 07/01/2020

చల్లపల్లి.