2193* వ రోజు....           25-Jul-2021

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!

 

స్వచ్చోద్యమ గ్రామంలో 2193* వ నాటి విధి నిర్వహణలు.   

 

ఆదివారం - 25.07.2021 నాటి వేకువ 4.20 నుండి 6.13 వరకు జరిగిన ద్విముఖ కర్తవ్య నిర్వహణలో కనీసం 18 మంది పాల్గొన్నారు. ఎక్కువ వ్యవధి పిదప విజయా విద్యా సంస్థలో నేటి (గోపాళం శివన్నారాయణ – కోమలి అండ్ కో వారి) ఫిట్స్ పక్షవాత – రక్తపోటు – మధుమేహ వ్యాధి గ్రస్తుల వైద్య శిబిరం దృష్ట్యా ఈరోజు వీధి పారిశుధ్య కృషి ప్రభుత్వ వైద్యశాల దగ్గరికి మారింది.

 

చల్లపల్లి స్వచ్ఛ సైనికులు తమ గ్రామ స్వస్తతా వికాసం కోసం చేయని పనులే మున్నవి గనుక? 2193* దినాలుగా వీరు ఊరి శ్మశానాలు, డంపింగ్ కేంద్రాలు, మురుగు గుంటల నవీకరణలు కాక, ఊరి వ్యాప్తంగా హరిత – సుమ సుందర వనాలు నిర్వహించడం లేదా? మరి అలాంటి సేవా నిష్టులు వేలాది అస్వస్తుల వైద్య శిబిర సేవల్లో వేలు పెట్టకుంటారా?

 

విజయ అకాడమీ – కస్తూర్బా వైద్యశాల వీధి శుభ్రతలతో బాటు, డ్రైన్ల మరమత్తులతో బాటు – స్వయం నిర్మిత ఉద్యాన సౌందర్య నిర్వహణతో బాటు – దారి ప్రక్కన పడవేసిన ఎండు కొమ్మల తొలగింపు వంటి వన్నీ యధావిధిగా జరిగిపోయినవి. ఈ కార్యకర్తల్లో కొందరు 5.00 – 6.30AM నడుమ వైద్య శిబిరంలో ఊడ్పు, కుర్చీల సర్దు బాటు, ఐదారుగురైతే శిబిరం పూర్తి సమయం కూడ శ్రమించారు. కరోనా కష్ట కాలంలో ఇన్ని ప్రజోపయుక్త బాధ్యతలు మోసినందుకు అభినందించకపోతేపోయిరి – ఆ స్ఫూర్తిని గ్రామస్తులు – అందులోనూ యువకులు, విద్యార్ధులు మరింత మంది అందిపుచ్చుకోవద్దా? ప్రభుత్వాలు మోయవలసిన గ్రామ పారిశుధ్య – వైద్య బాధ్యతల్ని మోస్తున్న ఈ వైద్యుల – కార్యకర్తల స్వచ్చంద సేవా మార్గాలను తరువాతి తరం వారవరైనా కొనసాగించాలి గదా!

 

నేటి ఉభయ గ్రామ సామాజిక విధుల పిదప కార్యకర్తలంతా స్వచ్చోద్యమ ఆస్తాన గాయకు (నందేటి శ్రీనివాసు) ని గ్రామ పునః పునః స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య సంకల్ప నినాదాలను పునరుద్ఘాటించి, 6.35 పిదప నేటి బాధ్యతలకు స్వస్తి పలికారు.

 

బుధవారం నాటి మన శేష బాధ్యతలకై గంగులవారిపాలెం మార్గంలో కలుసుకొందాం.

 

ఒక సీనియర్ స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త (నల్లూరి రామారావు)

25.07.2021.