2194* వ రోజు....           28-Jul-2021

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!

 

అరుదైన సామాజిక దృశ్యం - స్వచ్చోద్యమ చల్లపల్లి @2194*.  

 

బుధవారం (28.07.2021) వేకువ - 4.28 & 6.10 వేళల నడుమ గంగులవారిపాలెం బాట తొలి మలుపు వద్ద ప్రారంభమైన గ్రామ స్వస్తతా చర్యలో కర్మిష్టులు 22 మంది. శుభ్ర – సుందరీకృత ప్రదేశాలు – 1) బందరు రహదారి వైపుగా 120 గజాలు, 2) గంగులవారిపాలెం దారికి తూర్పున ఖాళీ నివాసం.

 

ఇక్కడ చెమటలు చిందించింది మాత్రం సమీప నివాసితులు కాదు; కనీసం 3 గ్రామాల నుండి – 3 to 4 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన దృఢ సంకల్పులే! ఇంచుమించు వారం రోజులుగా ప్రబలుతున్న ఈ దారి శుభ్ర – సౌందర్య నవీకరణలు ఈ నెలాఖరుకు పూర్తి కావచ్చు!

 

గ్రామంలోని వేలాది మందిలాగా ఈ స్వచ్చోద్యమ కారులు ఇక్కడి అంతర్గత, జాతీయ రహదారుల వెంట పెరుగుతున్న  గడ్డిని, పిచ్చి – ముళ్ళ మొక్కల్నీ, ఆక్కడక్కడ తగ్గుతున్న స్వచ్ఛ – శుభ్ర – సౌందర్యాలనీ ఉపేక్షించలేరాయె! డ్రైన్లలో అడ్డుపడుతున్న ప్లాస్టిక్ తుక్కునూ, కొమ్మ - రెమ్మల్నీ, రోడ్ల మీద ప్లాస్టిక్ సంచుల్నీ, దుమ్ము – ధూళినీ చూడడంతోనే వాళ్ళలో ఏహ్యత పెరిగి, కార్యదీక్ష రగిలి, తక్షణ కార్యాచరణకు దిగే స్వభావం వీళ్ళదైపోయె!

 

అందుకే – 2193 దినాల నుండి చేస్తున్నట్లే ఈ వేళ కూడ :

 

- రోడ్డు మీది ఇసుకను, దుమ్మును, తదితర కశ్మలాలను ఊడ్చారు.

 

- మురుగు కాల్వల అంచుల మీది ఎండు – పచ్చి గడ్డినీ, మొక్కల్నీ తొలగించారు.

 

- ముగ్గురు కార్యకర్తలు గోకుడు పారలు, దంతెలు ఉపయోగించి, దారి వార మట్టిని, గడ్డిని చెక్కి బాటను మరింత విశాలం చేశారు.

 

- అందాన్ని అపహాస్యం చేస్తున్న ఎంగిలాకుల్ని, అదుపు తప్పి హద్దు మీరి పెరుగుతున్న కొన్ని చెట్ల కొమ్మల సంగతి నలుగురు చూసుకొన్నారు.  

 

- వచ్చిన వ్యర్ధాలను డిప్పలతోనో, చేతులతోనో ట్రస్టు సంబంధిత ట్రక్కులోనికెత్తి, చెత్త కేంద్రానికి రవాణా చేశారు.

 

చల్లపల్లి స్వచ్చంద సేవకులకిది వేల దినాల నిత్యకృత్యమైనప్పుడు – ఇందులో ఎవరి కృషిని ప్రత్యేకంగా వర్ణించగలం? పొగడ్తలక్కర లేని ఈ నిష్కామ కర్ముల్ని ఎందుకు కీర్తించాలి? భగవద్గీతాచార్యుడు అర్జునుడ్ని ఉద్దేశించి కర్మణ్యేవాధికారస్తే – మాఫలేషు కదాచన...” (శక్తి కొద్దీ పని చేసుకుపో – ఫలితాన్ని ఆశించకు....) అని చెప్పలేదూ?

 

6.15 సమయాన – కాఫీ కాలక్షేప వేళ – లౌవ్లీ (కొత్తపల్లి వేంకటేశ్వరరావు) గారి తాటి బెల్లం ఇడ్లీ, గోంగూరల పంపిణీ, DRK గారి కార్యక్రమ విహంగ వీక్షణంతోను, జాస్తి జ్ఞాన ప్రసాదుని స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య సాధనా సంకల్ప ప్రతిజ్ఞలతోను నేటి స్వచ్ఛ ప్రయత్నం ముగిసింది.

 

రేపటి వేకువ కూడ మన పునర్దర్శన ప్రదేశం ఈ గంగులవారిపాలెం మార్గమే!

 

కశ్మలాలను – అశుద్ధాలను...

 

ఎక్కడెక్కడి కశ్మలాలను – మారుమూలల అశుద్ధాలను

కరడుగట్టిన స్వార్ధ చర్యను – జనం మనసుల సంశయాలను

తుడిచి పెడుతూ – రెండు వేల దినాల నుండీ ఉద్యమించిన

అందరికి శిరసాభివందనల లౌకిక సుమ చందనాదులు!

 

ఒక సీనియర్ స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త (నల్లూరి రామారావు)

28.07.2021.