2195* వ రోజు....           29-Jul-2021

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!

 

ఆవశ్యక – ఆనందదాయక – సామాజిక చైతన్యవంత – స్వచ్చోద్యమ చల్లపల్లి - @2195*.  

 

29.07.2021 (గురువారం) నాటి శుభోదయంలో 4.29 వేళ గంగులవారిపాలెం బాటలోనే – బండ్రేవు కోడు మురుగు కాల్వ గట్టు దగ్గరే – సొంత ఊరి ఆహ్లాదాన్ని మెరుగుపరిచే ఆదర్శ కృషిలో కలిసి వచ్చిన విజ్ఞులు 27 మంది. అందుమూలంగా ఉదాహరణ ప్రాయంగా రూపొందిన చోటు సదరు దారికి చెందిన 100 – 150 గజాల నిడివి! తమవి కాని, తమకు సంబంధం లేని రహదారి, కాల్వ గట్టుల కశ్మలాల మీద పగబూని, కష్టించి, చెమట చిందించి, తొలగించిన కార్యకర్తలకు దొరికిన పెన్నిధి (సగం మంది గ్రామస్తులకర్ధం కాని) ఆత్మ సంతృప్తి!

 

దారి మూల మలుపు దగ్గరి కరెంటు స్తంభాల వలయాన్ని గాని, దానికి తూర్పు – పడమర భాగాల రహదారిని గాని, పొలంలోకి దిగి కొందరు కత్తులతో, గొర్రులతో, పంజాలతో – వివిధ పద్ధతుల్లో శుభ్రపరచడాన్ని గమనించిన గ్రామస్తుల్లో ఎందరి హృదయాలు సానుకూలంగా స్పందిస్తున్నాయో తెలియదు. గడ్డి తొలగి, ఎండు పుల్లలు, చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ సంచులు, ఖాళీ సారా - నీళ్ళ సీసాలు, పిచ్చి మొక్కలు, ఇంకా దుమ్ము – ధూళి అన్నీ ఈ మనుషుల ధాటికి తొలగిపోయి, చకచకా ట్రాక్టర్ లో కొలువు తీరి, డంపింగ్ యార్డుకు చేరగా 6.00 తరువాత ఈ ప్రదేశమెంత శుభ్ర – సుందరంగా కనిపిస్తున్నదో ఈ బాటపై వచ్చే – పోయే గ్రామస్తులు పట్టించుకొన్నారో లేదో మరి!

 

తమ ఊరి శుభ్రతకు, తద్ద్వారా ఇనుమండించే స్వస్తతకు ఏడెనిమిదేళ్ళ నాడే అంకితులైపోయిన స్వచ్చోద్యమ కారులు మాత్రం ఎండనక – వాననక – చలీ, మంచు, గాలి – ధూళి లెక్క చేయక ఇలా కష్టిస్తూనే ఉన్నారు. ఇది తమ విధ్యుక్త ధర్మం గానూ – అదృష్టం గానూ భావించి, ముందడుగేస్తూనే ఉన్నారు!

 

సుమారు వంద నిమిషాలకు పైగా శ్రమదానం తరువాత - 6.15 సమయంలో 10 నిముషాల పాటు కాఫీ – కబుర్లు ముగిశాక దైనందిన సమీక్షా సమావేశంలో డాక్టర్. డి.ఆర్.కె గారి ముక్తాయింపు పిదప తాతినేని (మొక్కల) రమణ సాలోచనగా ముమ్మారు పలికిన గ్రామ స్వచ్చ పరిశుభ్ర – సౌందర్య సంకల్పాన్ని అందరూ నినాద రూపంలో సమర్ధించాక 6.35 కు నేటి గ్రామ బాధ్యతా చర్య ముగిసింది.

 

  స్వచ్చ కార్యకర్తలు పల్నాటి బాల భాస్కర రావు , పల్నాటి రాజబాబు గార్ల తండ్రి గారైన పల్నాటి మల్లిఖార్జున రావు గారు మనకోసం మనం ట్రస్టుకు 2000/- లను విరాళం గా అందించారు. వారికి స్వచ్చ కార్యకర్తలందరి తరపున ధన్యవాదములు.

 

 

రేపటి మన స్వచ్చంద శ్రమదాన వేదిక సైతం గంగులవారిపాలెం దారిలోని బండ్రేవు కోడు కాలువ ఉత్తరపు గట్టే!

 

ముందుగా గుర్తొచ్చు వైద్యులు.

 

గ్రామమందెచటెప్పుడైనా కశ్మలం మితిమీరుతుంటే –

మురుగు పారక రోడ్లు మునుగుచు ముక్కు మూసుకు నడుస్తుంటే

అసౌకర్యం – అనారోగ్యం ఆవహిస్తే – చుట్టుముడితే

స్వచ్చ సుందర కార్యకర్తలె ప్రజలకిక గుర్తొస్తురంతే!  

 

ఒక సీనియర్ స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

29.07.2021.