2196* వ రోజు....           30-Jul-2021

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!

 

సుందర చల్లపల్లి కోసం 2196* వ నాటి బాధ్యతా/ సేవా విన్యాసాలు.   

 

శుక్రవారం (30.07.2021) నాటి వేకువ 4.24 సమయంలోనే – వాట్సాప్ ఛాయాచిత్రం సాక్షిగా 13 మంది స్వచ్చంద శ్రమదాతలతో ప్రారంభమైన ఉమ్మడి చర్యలు మరి కొద్ది నిముషాల వ్యవధిలో – అంతే మంది చేరికతో 6.00 దాటే వేళకు పరాకాష్టకు చేరాయి. ఇందుకు కార్యక్షేత్రమేమో గంగులవారిపాలెం మార్గపు బండ్రేవుకోడు ఉత్తరపు గట్టుతో బాటు, బాటకు ఉత్తరపుటంచు.

 

తమ గ్రామ ఔన్నత్య బాధ్యతలు 7 ఏళ్ల క్రిందట భుజం మీదకెత్తుకున్న కార్యకర్తలేమో 26 మంది! ఊరేమో సుమారు 5000 ఇళ్లతో, 25 వేలకు పైబడిన జనాభాతో, వందలాది వీధులతో, పిల్ల కాల్వలతో, రెండు ప్రధాన మురుగు ప్రవాహాలతో సువిశాలం! క్రొత్తగా చెప్పుకోదగ్గ సంఖ్యలో కార్యకర్తలు వచ్చి చేరారు! ఐనా సరే – ఈ కార్యకర్తల ధృఢ నిర్ణయం ముందు – ఎడ తెగని ప్రయత్నం ముందు – ప్రధాన వీధుల కాలుష్యాలు, అస్తవ్యస్తతలు, అంద విహీనతలు, అసౌకర్యాలు తోకముడచక తప్పడం లేదు! మరి – అన్ని గ్రామ వార్డుల ప్రజలు స్వయం చైతన్య వంతులై – కనీసం 5% మంది ఈ స్వచ్చోద్యమ భాగస్తులైతే మన చల్లపల్లిలో ఎన్నెన్ని అద్భుతాలు జరుగుతాయో కదా!

 

నేటి స్వచ్చోద్యమ స్థితి గతులు ఎప్పటిలాగానే ప్రవర్తిల్లాయి; కాని, ఒకరిద్దరి సేవా విన్యాసాలు మాత్రం ప్రేక్షకుల దృష్టిని నిలువరిస్తాయి!

 

- బాట మలుపు దగ్గర – ఏ మగ కార్యకర్తలకు తీసిపోని విధంగా పలుగుతో త్రవ్వి, తాడి చెట్టు మొదలును చేతులతో లాగుతున్న ఒక సీనియర్ వైద్యురాలు!

 

- దారికి ఉత్తరంగా పిచ్చి కంపను చాలీచాలని వెలుతురులో నరుకుతూ, కత్తి పిడి తన మోకాలికి తగిలి, విలవిలలాడి కొద్ది నిముషాల విశ్రాంతి పిదప మళ్ళీ పని కుపక్రమిస్తున్న మరొక కార్యకర్త!

 

- నిన్న స్వల్ప అనారోగ్యగ్రస్తుడై కూడ ఈ వేకువనే వీధి కశ్మలాల మీద పోరాడుతున్న ఒక రైతు!....

 

            ఆలోచించగల – ఆచరించగల వారికి ఇవన్నీ చక్కని ఉదాహరణలే!

 

గంటన్నరకు పైగా తమకు ఏ ప్రయోజనమూ కలగని ఉమ్మడి శ్రమ జీవనం గడిపిన స్వచ్చంద కార్యకర్తలు – 6.15 తరువాత తమ నేటి బాధ్యతల పూర్వాపరాలను సమీక్షించుకుని, ఊరి ఏ ప్రాంతంలో ఇంకా తమ కర్తవ్యాలేవో సంకల్పించుకొని, రామానగర నివాసి ఐన రాజు ప్రకటించిన స్వగ్రామ స్వచ్చ – శుభ్ర – సౌందర్య సంకల్పాన్ని ముమ్మారు నినదించి, ఇంటి బాట పట్టారు.

 

రేపటి మన శేష కర్తవ్య నిర్వహణ కూడ ఈ గంగులవారిపాలెం బాటలోని బండ్రేవుకోడు మురుగు కాల్వ దగ్గరే!

 

కారణాల వరుస.  

 

స్వచ్చోద్యమ చల్లపల్లి సంగతేమి – చరిత ఏమి?

కొంత మందె పాల్గొన్నా ఇంతటి ప్రఖ్యాతి ఏల?

దేశ విదేశాలంతట దీనికి గుర్తింపు లేల?

క్రమ శిక్షణ – చిత్త శుద్ధి – కఠోర దీక్ష కారణముల?

 

ఒక సీనియర్ స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

30.07.2021.