2197* వ రోజు....           31-Jul-2021

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!

 

స్వచ్ఛ బంధుర స్వగ్రామం కోసం కార్యకర్తల 2197* వ నాటి ప్రయత్నం.

 

ఈ వారంతపు (సు స్థిరవారపు) వేకువ 4.27 వేళ జై స్వచ్చ చల్లపల్లి సైన్యంసామజిక మాధ్యమ ఛాయా చిత్రంలో కనిపిస్తున్న స్వచ్చోద్యమకారులు 15 మందైతే అనతి కాలంలోనే 19 (మొత్తం 34) మంది కూడ వచ్చి చేరి, గంగులవారిపాలెం రహదారిలో మురుగు కాల్వ వంతెన కల్లంత దూరాన 105 నిముషాల పాటు వీరి నిర్వాకం బెట్టిదనిన :

 

1) బాటకు ఉత్తర దిశగా, ఈ నెల మధ్యలో కురిసిన వానలకు గుబుర్లుగా పెరిగిన దోమల కంప, దురదగొండి, పరమేశుని కంప తదితరేతర పిచ్చి ముళ్ళ మొక్కల నిర్మూలన! ఈ పనిలో డజను మందికి పైగా.

 

2) బండ్రేవు కోడు మురుగు కాల్వ గట్టున పూల మొక్కల నడుమ పెరిగి, అల్లుకొంటున్న దిక్కుమాలిన మొక్కలు, గడ్డి తొలగింపు! పనిలో పనిగా ఈ 15 మంది రోడ్డు మీదికి వచ్చిన కొమ్మల్ని కత్తిరించారు కూడ!

 

3) సుందరీకర్తలకు పని దొరకని చోటేముంటుంది? గత 3 రోజుల శుభ్ర సుందరీకృత ప్రదేశాన్ని మురుగు కాల్వ గట్టును పారలతో, రైల్వే పారలతో గడ్డి తిరగేసి, చదును చేసే ఉద్యోగం వాళ్ళది! (బహుశా త్వరలో ఇక్కడ బోగన్ విలియా, గద్దగోరు వంటి పూల మొక్కల చిన్న పాటి ఉద్యానాన్ని సృష్టించే ప్రణాళికేదో ఉండే ఉంటుంది)!       

 

4) ఇక మిగిలిన వాళ్ళది చీపుళ్లతో ఊడ్పులు, ఈ గంటన్నర పాటు తెగి పడుతున్న గడ్డి నిరర్ధక మొక్కలు కొమ్మ రెమ్మల్ని ట్రాక్టర్ లోకి తరలింపు వంటి అంతిమ సంస్కరణ!

 

            ఈ వేకువ ఇంకా రెండు విశేషాలేవంటే పడమటి వీధికి చెందిన మారుతీ ప్రసాద్ అనే యువకుడు – (ఉద్యోగం హైదరాబాదు లో, ప్రస్తుతం ఇంటి నుండే పని) 2 ½ కి.మీ  దూరం వేకువ జామునే వచ్చి, వీధి శుభ్రతలో పాల్గొని, ఈ రెండు మూడు నెలల పాటు గ్రామ బాధ్యత పంచుకొంటానని ప్రకటించడం,

 

            నేటి స్వచ్చోద్యమ సందడిలో ముఖ్య భాగం నలుగురైదుగురు బాలకార్మికులదే. దాసరి రామమోహనరావు స్వర్ణలత గార్ల కుటుంబంలోని నాలుగోతరం వారసులు వీళ్ళు!

            ఇన్ని సామాజిక వర్గాల ఇన్ని వయసుల వాళ్ళ వృత్తుల వ్యక్తుల పరస్పర దైనందిన ఆత్మీయ కలయికకు, తమ గ్రామ పునీత కృషిలో వేలాది దినాలుగా పొందుతున్న సంతోషానికి స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలు ఎలా దూరం కాగలరు? ఈ ఉద్యమ ప్రధాన సృష్టి కర్త డాక్టర్  - డి.ఆర్. కె. ఈ దైనందిన స్వచ్చోద్యమాన్ని  పర్యవేక్షించక, పరవశింపకపోతే తన కెలా నిద్రపడుతుంది?

 

 

            6.15 పిదప తాతినేని పూల మొక్కల రమణ గారి రేపటి ఆత్మీయ విందు ప్రకటన తోను, ఆర్య-ఆరవ్ ల సంయుక్త గ్రామ మెరుగుదల సంకల్ప నినాదాలతోను నేటి 2 గంటల స్మరణీయ కృషికి స్వస్తి.!

 

            రేపటి మన వీధి స్వచ్చతా విధులు కూడ బండ్రేవు కోడు మురుగు కాల్వ(గంగులవారిపాలెం దారిలో) గట్టు పైనే!

 

            స్వచ్చోద్యమమెందు కొరకు?

 

అసాధ్యమే సుసాధ్యమైన ఆనందాన మునుగుటకో

విస్తుబోయి చూచుటకో - ప్రశస్త మనుచు మెచ్చుటకో

చల్లపల్లి స్వచ్చోద్యమ సరంభము లేదు సుమా!

ఆచరించు- అనుభవించు  అత్యుత్తమ పథము సుమా!   

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

31.07.2021.