2198* వ రోజు....           01-Aug-2021

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!

 

2198* వ నాటి చల్లపల్లి గ్రామ స్వచ్చోత్సవం .

 

 

ఈ ఆదివారం (01.08.2021) కూడ చల్లపల్లి స్వచ్చోద్యమానికి వేకువ 4.28 వేళకే తెల్లవారిందనేందుకు 16-17 మందితో నిండిన మన వాట్సాప్ ఛాయా చిత్రమే సాక్షి. 4.35 తర్వాత మరి పాతిక మంది కూడ కలిసి, వంద నిముషాల పాటు జరిగిన వీధి పారిశుద్ధ్య యజ్ఞాన్ని చూసేందుకు నాకైతే రెండు కన్నులు చాలలేదు! ఇప్పుడు బండ్రేవు కోడు మురుగు కాల్వ ఉత్తరపు గట్టు, రహదారి సొగసును గ్రామస్తులెవరైనా చూడాలనుకొంటే-“ జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం” వాట్సాప్ లో గాని, స్వయంగా గాని చూడవచ్చు; క్రియాశీలకంగా ఎవరైనా స్పందిస్తే – తదుపరి గ్రామ శుభ్ర-సుందరీకరణకు కూడా ఆహ్వానం!

 

 

44 మంది భిన్న వర్గాల, వయసుల గ్రామస్తులెందుకిలా వేలాది దినాలుగా శ్రమిస్తున్నారో అని ఆరా తీసినా చాలు-కార్యకారణ హేతు జ్ఞానం కాస్తంత మేలుకొన్నా చాలు- నూటికైదారుగురు ఉద్యమానికంకితులైనా చాలు- ఈ చల్లపల్లి స్వచ్చ-స్వస్త-సుందరోద్యమం సఫలమౌతుంది! మనది అప్పుడొక ఆదర్శ ప్రఖ్యాత గ్రామమౌతుంది.!   

 

స్వచ్చోద్యమ కారుల నేటి బాధ్యతా నిర్వహణను నేను సొంతంగా వర్ణించడం కాక-DRK గారి, శాస్త్రి గారి దృశ్య శ్రవణ చిత్రాల సాక్షిగా చూపడం మంచిది.

 

- వంద గజాల బారున, మురుగు కాల్వ గట్టు రహదారి కిరుప్రక్కలా- అదేదో పంట పొలంలో కర్షకులు మునుంలో కూర్చొని, దీక్షగా పనిచేస్తున్నట్లో, ఏ కర్మాగారంలోనో సుశిక్షితులైన కార్మికులు విలువైన వస్తువుల్ని ఉత్పాదిస్తున్నట్లో, కనపడే ఒక చిత్ర దృశ్యాన్ని చూడండి.

 

- వీళ్ళకు దూరంగా దారి మలుపు దగ్గర సౌందర్య పిపాసులైన ఏడెనిమిది మంది అడివి తంగేడు పూల మొక్కల్ని నాటుతున్న ఛాయా చిత్రాన్ని కూడ చిత్తగించండి.

 

- చెట్ల కొమ్మల్ని ట్రిమ్ చేస్తున్న, చీపుళ్లతో బాటను శుభ్రపరుస్తున్న, కత్తులతో పిచ్చి-ముళ్ళ మొక్కల అంతు చూస్తున్న , గోకుడు పారలతో బాట మీది ఇసుక – దుమ్ముల్ని చెక్కుతున్న, గొర్రులతో వ్యర్ధాలను గుట్టలుగా లాగుతున్న,   డిప్పల కెత్తి, సునాయాసంగా ట్రాక్టర్ లో నింపుతున్న, ఇంకా పూల మొక్కల కుదుళ్లను సరి జేసి , కలుపు పీకి ఆనందిస్తున్న కార్యకర్తల ఉషోదయ గ్రామ మెరుగుదల కృషి వైభవాన్ని సాలోచనగా వీక్షించండి!

 

6.15 కు జరిగిన సమావేశంలో మరొక పర్యాయం దాసరి ఆరవ్- ఆర్య సోదరులు ముమ్మారు ప్రకటించిన గ్రామ సామూహిక స్వచ్చ- శుభ్ర –సౌందర్య సాధనా సంకల్పాన్ని పునరుద్ఘాటించి, డాక్టరు రామకృష్ణ ప్రసాదు గారి సమీక్షా సంతోషాన్ని పంచుకొని, తాతినేని రమణ గారి ఆహ్వానాన్ని మన్నించి, అల్పాహారం పేరిట వారిచ్చిన విందుకు న్యాయం చేసి, కార్యకర్తలు ఇళ్ల ముఖం పట్టారు.

 

 

04.08.2021- బుధవారం వేకువ మనం కలిసి శ్రమించదగిన చోటు గంగులవారిపాలెం బాటలోని మురుగు కాల్వ గట్టే!  

 

 

           ప్రశ్నలెన్నో – బదులొక్కటే

ఈ స్వచ్చోద్యమ చరిత్ర కెవరు సృష్టి కర్తలు అని-

అవధిలేని త్యాగాలకు ఎవరు మూలకారకులని-

ఊరంతా పచ్చదనం పరచుకొన్న దెవరివలన-

అన్ని ప్రశ్నలకు బదులీ స్వచ్ఛ కార్యకర్తలె అని... !

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

 

01.08.2021.