2210* వ రోజు ....           21-Aug-2021

 ఒక్కసారి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!

 

గ్రామ సామాజిక శ్రమదాన ప్రయోగ శాలలో 2210* వ నాడు.

 

            స్థిరవారం (21.08.2021)వేకువ 4.23 కే 25 మందికార్యకర్తలు సన్నద్ధు లైనది గంగులవారిపాలెం దగ్గరి వంతెన ప్రక్కన. ఒక కాలభైరవ మూర్తి కాక, 14 మంది వాట్సాప్ తొలి చిత్రంలో కనిపిస్తారు. నేటి ముఖ్య కర్మ క్షేత్రం వంతెన నుండి బండ్రేవు కోడు కాలువ ఉత్తరపు గట్టు మీద తూర్పు దిశగా. మొన్నటి తరువాయిగా 20 మంది గ్రామ బాధ్యుల 30-40 పని గంటలతో 100 గజాలకు పైగా-ముల్పూరి వారి కోళ్ళ పరిశ్రమ గేటు దాక-ఎంతగా కశ్మల విధ్వంసం జరిగిందో, ఒక్కొక్కరి ధర్మ- ఘర్మజలం  ఏ మాత్రం చిందిందో, లక్ష్య సాధనా సంతృప్తి ఏ పాటిగా దక్కిందో, అందుకు నేను ప్రత్యక్ష సాక్షిని!

 

            మద్యం సీసాల,ప్లాస్టిక్ సంచుల, ఎంగిలాకుల, నరికి పడేస్తున్న పిచ్చి-ముళ్ల మొక్కల, కొమ్మలన్నీ కలిపి ఒక పెద్ద ట్రక్కు ఔతుంది. దీన్నంతా తగల బెట్టక, చెత్త కేంద్రానికి తరలించక, మురుగు కాలువ గట్టు లోతట్టున దన్నుగా అమర్చారు. ఖాళీ సీసాలు మాత్రం డిప్పల కొద్దీ సేకరించారు.

- ఇందులో ఒకాయనైతే ఆ చీకట్లోనే చిక్కులు పడిన తీగల నడుమ కొంతసేపు కనిపించలేదు- అతని కత్తి నరుకుడే తెలిసింది.

- మరొకతనైతే-తాను నరికి నేటి అంచున పేర్చిన తుక్కుపైనే ప్రమాదకరంగా నిలబడి ముళ్ల చెట్టును నరకడం చాలా ఉత్కంఠ భరితంగా కనపడింది.

 

- చీపుళ్లు కాస్త ప్రక్కన పెట్టి ఇద్దరు మహిళలు గొర్రులతో ఇంత తుక్కునూ గుట్టలుగా లాగి, దారి లోతట్టున పేర్చడంలో నిమగ్నమయ్యారు.

 

- ఇక్కడి ఈ స్వచ్చ విన్యాసాలు కాక, ఇదే మార్గంలో దూరంగా నలుగురైదుగురి సుందరీకరణ ప్రయత్నం నేడు కూడ యథావిధిగా జరిగిపోయింది.

  

          ఏమైతేనెం-6.20 సమయానికి తెల్లవారి వెలుగులో చూస్తే గంగులవారిపాలెం బాటకాని, మురుగు కాలువ ఒడ్డు దారికాని ఇంత శుభ్ర- సుందరంగా, విశాలంగా కనిపిస్తున్నవి గదా! వీరి పని సమయాన్ని గంటలతో, స్వచ్చ-సుందరీకృత భాగాన్ని గజాలుగా కొలువగలను గాని, వారి త్యాగాన్ని- పంచుతున్న స్ఫూర్తిని కొలువగలనా? సేద్య వృత్తితో పోల్చాలంటే- ఈ ఒక్కొక్కరు రెండు మూడు ఎకరాల వ్యవసాయం చేస్తున్నట్లు గణించాలి! (అదీ తమ కోసం కాదు).

    

        6.30 కు నేటి పని మదింపుకు ముందు మూడుమార్లు సంతోషంగా ఈ గ్రామ పరిశుభ్ర-స్వచ్చ-సౌందర్యాల సంకల్ప నినాదాలను పలికింది-ఎక్కడో సుదూరంగా- దుబాయిలో ఉన్నతోద్యోగి ఐన వల్లభనేని నాగేంద్ర కుమార్.  అతని ఆనంద వ్యక్తీకరణ తరువాత-స్వచ్చోద్యమ సారథి సూచనల పిదప నేటి కార్యక్రమం ముగింపుకు వచ్చింది.

 

            ఇదే మురుగు కాలువ గట్టును తూర్పు వైపు క్రొత్త వంతెనదాక శుభ్ర పరచడానికి మనం రేపటి వేకువ సైతం ఇక్కడనే కలుద్దాం.

 

            ఇట్టివాళ్లకె నా ప్రణామం.

ఎవరికెవ్వరు తీసిపోవరు- ఈ మహోద్యమ మాప బోవరు

ఊరి భద్రత, జనం స్వస్తత ఒక్క నిముషం ఉపేక్షించరు

ఎవరి పని తీరేది ఐనను ఉన్న ఉమ్మడి లక్ష్యమొక్కటె

స్వచ్చ సంస్కృతి బాట వేసే సాహసికులకు నా ప్రణామం!   

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

21.08.2021.