2217* వ రోజు ....           31-Aug-2021

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం!

 

స్వచ్చోద్యమ దీక్షా దక్షుల 2217* వ నాటి బాధ్యతలు.

 

మంగళవార (31.08.2021) మైతేనేమి, మరొక వారమైతే ఏమిటి - 4.23 కే నాగాయలంక బాటలో పాగోలు పంచాయితీ పరిధిలోని స్వచ్ఛ సుందర ప్రజా సౌకర్యదాయక పబ్లిక్ టాయిలెట్ల వద్దనే ఈ రోజు కూడ డజను మంది స్వగ్రామ భవితకు హామీనిస్తూ పట్టు వదలని విక్రమార్కుల్లాగా చేరుకొన్నారు. తరువాత వాళ్లకుతోడైన నాతో సహా ఐదుగురు వెరసి 17 మంది చేసిన వీధి పారిశుధ్య పని తీరు ఏవిధంబనగా సుమారు 2 గంటల తరువాత – 6.20 వేళకు ఆ సన్న చినుకుల్లోనే

 

1) అక్కడి రహదారి ఉద్యానంలో గడ్డి గాదం, కలుపు తొలగిపోయి, కళకళలాడుతున్నది.

 

2) విద్యుత్ తీగలకు తగిలే అవకాశమున్న పెద్ద చెట్ల కొమ్మలు అదుపు చేయబడ్డాయి.

 

3) రంగు రాళ్ళ మీద ఉంచిన వాహనాల బురదతో అసహ్యంగా ఉన్న చోటంతా సదరు ఇసుక, మట్టి గోకుడు పారల గీకుడుకు తొలగి, మరింత సముచితంగా - స్వచ్ఛ చల్లపల్లి పేరును సార్ధకం చేస్తున్నది.

 

4) బండ్రేవు కోడు మురుగు కాలువ గట్టు వంతెనల నడిమి గడ్డి, మెరక, పిచ్చి ముళ్ళ చెట్లు, ఇతర వ్యర్ధాలు నలుగురైదుగురి కృషితో మాయమై, ట్రాక్టర్ లో కెక్కి, డంపింగ్ కేంద్రానికి పయనించాయి.

 

5) 25 వేల జనాభా కల చల్లపల్లి స్వస్తతా మనుగడ కోసం కేవలం 17 మంది ప్రయత్నం ఫలించింది.

 

భగవత్ గీతాకారుడైన కృష్ణుడు సంశయాత్మా వినశ్యతి” (సందేహాలతో బ్రతికే వాడు బాగుపడడు) అని చెప్పాడు గాని, నా లాంటి కొందరి సందేహాలు ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి! :

 

- వేలాది గ్రామ పౌరులకు పట్టని ఊరి స్వచ్ఛ పరిశుభ్ర సౌందర్యాలు 50 – 100 మందికే ప్రతిరోజూ ఎందుకు గుర్తుంటాయి?

 

- కార్ల క్రింద దూరి, ప్రతి అంగుళాన్ని శ్రద్ధగా కార్యకర్తలు శుభ్రపరుస్తుంటే ఏదో తాత్కాలికంగా కాక శాశ్వతంగా అప్పనంగా కారు పార్కింగుకు కొందరెలా ఆక్రమిస్తున్నారు?

 

- సిల్టు లాగి, మురుగు తోడి, రోడ్డు ప్రక్క స్తలాల మెరక తీసి, రహదార్ల భద్రతకు వీళ్ళు పూచీ పడుతుంటే అ స్తలాలను రాత్రికి రాత్రే మళ్ళీ మెరక చేసి, ఆక్రమించి, హఠాత్తుగా కొందరు కొట్లు కట్టగలిగే వైనమేది? పంచాయితీ ఉండగా, రెవెన్యూ శాఖ ఉండగా, ప్రజాప్రతినిధులకు తెలియకుండానే ఈ ఆక్రమణలు జరగడంలో మర్మమేమిటి

 

- ఊరి ప్రధాన వీధులు, 7 గ్రామ ప్రవేశక రహదార్లు ఇంత అందంగా విశాలంగా శుభ్రంగా ఎలా ఉంటున్నవని గ్రామస్తులు ఇక ముందైనా ఆలోచించి, ఆచరణలో కార్యకర్తలకు సహకరిస్తారా?....

 

6.30 వేళ, ఈ గ్రామ శుభ్ర సుందరీకరణ కోసం కార్యకర్తల శ్రమనూ, ‘మనకోసం మనంట్రస్టు ఖర్చునూ డాక్టర్ DRK గారు గుర్తు చేసే ముందు ఉన్న ఊరి స్వచ్ఛ శుభ్ర సౌందర్య సంకల్ప నినాదాలను ముమ్మారు ఆ పరిసర నివాసులంతా ఉలిక్కిపడేంత గట్టిగా పలికింది – BSNL నరసింహారావు కాకమరెవ్వరు?

 

ఆలు పెరగని మన గ్రామ మెరుగుదల కృషి కొనసాగింపు కోసం రేపటి వేకువ కూడ మరింత మందిమి ఈ పాగోలు దారి వంతెన దగ్గరే కలుసుకొందాం!

 

                వికాసాల నిర్మాణం

స్వచ్ఛ సుందర చల్లపల్లి చరితక్రమం బెట్టిదనగ...  

సామాజిక ఋణం తీర్చు తాత్త్వికత పునాదిగా

మనకూ మన గ్రామస్తుల మనో వికాసాల కొరకు

స్వచ్ఛ శుభ్ర సౌందర్య స్వగ్రామం నిర్మాణం!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

31.08.2021.