2218* వ రోజు ....           01-Sep-2021

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం!

 

అలుపెరుగని స్వచ్ఛ -సుందర విన్యాసాలు @ 2218*.

 

క్రొత్త నెల - సెప్టెంబర్ 1 వ తేదీన - బుధవారం వేకువన కూడ 4.22 సమయం నుండి - 6.20 దాక చారిత్రాత్మక స్వచ్చోద్యమంలో అదే కథ - స్థిరంగా కాస్త కాస్త తొలగుతున్న ఒక్కో వీధి కశ్మలాల వ్యథ! సూక్ష్మంగా గమనించగల సోదర గ్రామస్తులు గ్రహించ దగిన - క్రమ క్రమంగా తగ్గి పోతున్న ఈగల-దోమల బెడద! పాగోలు దారి మొదలు-ఆదర్శ మరుగు దొడ్ల మీదుగా - మురుగు కాల్వ వంతెన దాటి పెద్ద వడ్ల మర సగం దాక విస్తరించిన నేటి స్వచ్ఛ సుందరీకరణ పరిమితులీ క్రింది విధంగా ఉన్నాయి!

 

            నేటి 18 మంది శ్రమదాతల్లో పది మందికి బండ్రేవు కోడు మురుగు వంతెన నుండి నాగాయలంక దారికి ఉభయ దిశల శుభ్ర ప్రక్రియతోనే సరిపోయింది. వానలకు త్వర త్వరగా పెరిగిన గడ్డి, ఎందుకూ కొరగాని ఏపుగా పెరుగుతున్న ముళ్ళ మొక్కలు, పిచ్చిమేడి, పిచ్చి బెండ వంటివి, వాటన్నిటిని కలుపుతూ అల్లుకొంటున్న తీగలు, జానెడెత్తుకు పెరిగిన గడ్డి-అన్నిటినీ పీకి, లాగి, నరికి, దంతెలతో గుట్టలు చేశారు. తాముఎప్పుడో నాటి, సాకి, పెంచినవే గాక సహజంగా మొలిచి, పెరిగిన చెట్ల కొమ్మల్ని ట్రిమ్ చేశారు.

 

            నేటి సుందరీకృత - శుభ్ర-విశాలమార్గాన్నే గాక, ఇక మీద ఏ 10 - 12 రోజులదాకానో  సర్వాంగ సుందరం కానున్న ఈ అవనిగడ్డ రోడ్డు ను గమనిస్తుండాలని సోదర గ్రామస్తుల కొక వినతి! ఎందరు శ్రమ దాతల కఠిన నిర్ణయంతో స్వేదంతో సమయ దానంతో ఈ గ్రామం, వీధులు, డ్రైన్లు,అందరికీ చెందే బస్టాండు, శ్మశానాలు,కార్యాలయ ప్రాంగణాలు ఇంత చూడ చక్కగా ఉంటున్నవో ఆలోచించ-చర్చించ-ప్రార్థన! ఇప్పటికే - ఏడెనిమిదేళ్ళ సుదీర్ఘ సమయం నడిచిన - దేశమంతటికీ ఆదర్శప్రాయమైన-స్వచ్చోద్యమం కొందరు గ్రామస్తులకిప్పటికీ అంటరాని దేల ఐపోయిందో వివరించాలనే మా అభ్యర్ధన!!!

 

            ఒక మహాకవి - ఒక సినిమా కోసం వ్రాసిన

 “ఒక్కరి కోసం అందరూ నిలిచి - అందరి కోసం ఒక్కరు నడచి

ఉపకారమే మన ఊపిరి ఐతే సహకారమే మన వైఖరి ఐతే ....

                                           (రాముడు...భీముడు...శ్రీ శ్రీ)              

స్వచ్ఛ కార్యకర్తల్ని ప్రోత్సహిస్తే అనుసరిస్తే ఈ సుందర గ్రామం మరెంతగా

స్వస్తతా - స్వచ్ఛతా నిలయమై,ఆదర్సప్రాయమైపోతుందో రోజు కొక్క మారు ఆలోచించు

కొదగిన సమయమిది.

 

            నేటి కృషి అభినందనకు ముందు కార్యకర్తలకు 13 వ జన్మదిన బాలిక దేసు జాహ్నవి అల్పాహార విందు, మనకోసం మనం ట్రస్టు కు 1000/- విరాళం అందగా- స్వచ్చోద్యమ వ్యసన పరుడు-ప్రాతూరి ఉదయ శంకర శాస్త్రి గారి 6 వ స్వచ్చోద్యమ జన్మదిన వేడుక గుర్తుగా మిఠాయిలు, 5000/- విరాళము కూడ అందినవి.

 

            పన్నెండేళ్ళ జాహ్నవి (ఐదేళ్ళ నుండీ ఈమె స్వచ్ఛ బాల కార్యకర్తే ) తన గ్రామ స్వచ్ఛ – శుభ్ర -సౌందర్య సంకల్ప బాధ్యతను ముమ్మారు నినదించగా ఆ నినాదాలనంది పుచ్చుకొన్నవారు మిగిలిన కార్యకర్తలు.

 

            రేపటి గ్రామ బాధ్యతల కోసం నాగాయలంక రోడ్డు లోని పెద్ద వడ్ల మర దగ్గరి - పద్మాల దగ్గరే వేకువ కాలంలో కలుసుకొందాం!

 

        స్వచ్చోద్యమ ఉద్యోగం

స్వచ్చోద్యమ చల్లపల్లి కథా క్రమం బెట్టిదనగ-

సామాజిక ఋణ విముక్తి సాహసమే పునాదిగా

పచ్చదనం, విరి సౌరభ- స్వచ్ఛ - శుభ్ర వీధులతో

పరమాద్భుత స్వ గ్రామం పరిఢవిల్లు ఉద్యోగం ! 

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

01.09.2021.