2219* వ రోజు ....           02-Sep-2021

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం!

 

జాతీయ రహదారి శుభ్ర సుందరీకరణ వేడుకలు - @ 2219*.

 

గురువారం (02.09.2021) నాటి బ్రహ్మముహూర్తమైన 4.25 కు అవనిగడ్డ రహదారిలో పెద్ద వడ్లమర దగ్గరి పద్మాల నడుమ వాట్సాప్ తొలి ఛాయాచిత్రంలో ఠంచనుగా హాజరైన 14 మంది కాక, కొద్ది వ్యవధిలో మరొక 10 మంది కూడ కలిసి, చేసిన నిర్వాకం ఏమిటి? రోడ్డు ప్రక్క ఖాళీ స్థలాల కబ్జానా? సొంత పొలాన్ని, వాటి గట్లనీ బాగు చేసుకునేందుకా? పత్రికలలో టీ. వీ. ల్లో సామాజిక మాధ్యమాల్లో విహరించేదుకా? కానే కాదు; ఇలాంటి ప్రశ్నలెవరి మనసుల్లోనైనా ఉంటే గింటే మాట రూపాన కాక, చేత రూపంగా బదులిచ్చేందుకే! తమది వాగ్ధాటి కాదు, ప్రచారార్భటి కాదు ఉన్న ఊరి స్వచ్ఛ శుభ్ర సౌందర్య స్వస్తతా భద్రతలే తమకు ముఖ్యమని ఋజువు చేసుకొనేందుకే!

 

ఆ లక్ష్యం కోసమే ఈ 20 మందికి పైగా స్వచ్చంద శ్రమదాతలు 2219* వ రోజున కూడ పాటుబడ్డారు. నిజానికి ఈ నాగాయలంక మార్గం దాతల చలవతో అధికారుల చొరవతో అదే పనిగా చెప్పనక్కర లేని కార్యకర్తల సాటిలేని మేటి కృషితో పరిశుభ్రంగాను, సుందరంగాను ఉండనే ఉన్నది. ఐనా సరే అందమైన ఈ రహదారి ఆకృతిలో చిరులోపాలెందుకుండాలనీ, వేల దినాలుగా గ్రామ మెరుగుదలకంకితమైన తమ వ్యసనాన్ని బట్టీ కార్యకర్తలీ వేకువ జాములో నిన్న స్వచ్ఛ పరచిన కొంత భాగంతో సహా బండ్ల సుబ్బన్న ఆశ్రమం దాటి తమకు నచ్చినట్లు శుభ్రపరచిన విధంబెట్టిదనగా:

 

- ఒకరిద్దరు మెరికలు మురుగు కాలువ వంతెన కల్వర్టుల్ని ముఖ్యంగా పడమటి వైపున తుక్కు సర్ది, మట్టి రాతి ముక్కల మిశ్రమాన్ని కప్పి రోడ్డు కోత నాపి, కల్వర్టు భద్రతకై పూనుకొన్నారు.

 

- బాట కుభయ దిశలా కనిపించిన ప్రతి గడ్డినీ పిచ్చి, ముళ్ళ మొక్కల్నీ ఒకటీ అరా కనిపిస్తే ప్లాస్టిక్ తుక్కునీ ఖాళీ మద్యం సీసాలనీ కత్తి వీరులు పది మంది కోసి, నరికి, ఏరి, సమీకరిస్తూ పోయారు. ఏ కాస్త అందహీనంగా కనిపించినా ఏ పూల మొక్కనీ, హరిత వృక్షాన్ని చక్కబెట్టక వదల్లేదు.

 

- గ్రామ సుందరీకరణ బాధ్యులైతే ఇక వాళ్ల దీక్షే వేరు మనకు చంద్రునిలో మచ్చగా అనిపించేది వాళ్ల దృష్టిలో పెద్ద లోపం! ఆ చీకటిలోనే కల్వర్టు గోడ మీద నిలిచి మొక్కల్నీ, చెట్లనీ కత్తిరించి, పాదులు చేసి, పట్టి పట్టి సుందరీకరించనిదే వాళ్ళకు నిద్ర పట్టదు కాబోలు!

 

- నలుగురు చీపుళ్ళ వారు, ముగ్గురు దంతెల వారు యధా ప్రకారం తమ బాధ్యతలకు కట్టుబడ్డారు.

 

          ఎవరి పిచ్చి వాళ్ల కానందమనీ, ఎవరి వ్యసనం వాళ్లకు సమ్మగా ఉంటుందనీ చెప్పే మాటలు, నిజమే కావచ్చు! ఊరిలో మురుగులో వల్లకాడులో రహదార్ల వెంట బాగు చేసి, పూల వనాలు పెంచి ఆనందించేదేమో స్వచ్ఛ కార్యకర్తలు ;

తమ వ్యాపారాలకో, సౌకర్యాలకో, స్వార్ధాలకో ప్రతి అంగుళాన్ని ఆక్రమించి, పేడ దిబ్బలు వేసి, గొడ్లను బాటల మీద కట్టి....గాని, సంతృప్తి చెందేదేమో కొందరు తెలివి మీరిన గ్రామ సహోదరులు! (ఓ మహాత్మా! ఓ మహర్షీ! ఎంత కాలం ఇంత వింతలు?)

 

          6.25 వేళ శ్రమదాన ఫలిత సమీక్షకు ముందు పట్టుదలతో ముమ్మారు తన గ్రామ స్వచ్ఛ శుభ్ర సౌందర్య సాధనా సంకల్ప నినాదాలు చేసినది యువ కార్యకర్త రాజు గారు. కనుల పండుగగా కార్యకర్తల శ్రమ వేడుకను చూసి వెళ్లినది నాగాయలంకకు చెందిన విలేకర స్వచ్ఛకార్యకర్తలు.

 

          రేపటి మన గ్రామ అంకిత దీక్ష కూడ ఇదే దారిలో బండ్ల సుబ్బన్న ఆశ్రమ సన్నిధిలోనే ఉండగలదు!

 

          ప్రాణవాయు పరిరక్షణ

స్వచ్చోద్యమ చల్లపల్లి కధాక్రమం బేదనగా...

సామాజిక ఋణం తొలుగు తాత్త్వికత పునాదిగా...

బస్టాండున శ్మశానాన రహదార్లలో చెట్లు నాటి

పచ్చదనం ప్రాణవాయు పరిరక్షణ చేయడం!       

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

02.09.2021.