2220* వ రోజు ....           03-Sep-2021

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం!

 

గ్రామ కాలుష్యాల మీద తిరుగుబాటులో @ 2220* వ నాడు.

 

శుక్రవారం (03.09.2021) నాటి వేకువ సమయంలో 4.20 కి 14+11 మందిని నాగాయలంక రహదారి స్వాగతిస్తున్నప్పుడు కొన్ని ఉరుములు మెరుపులు ఉన్నప్పటికీ వాతావరణం హాయిగొలుపుతూనే ఉన్నది. మబ్బులూ చలిగాలి తప్ప కార్యకర్తలు పని ముగించి ఇళ్లకు చేరుకొనే దాక వాన పడలేదు. అనుకూల వాతావరణంలో మైకు నుండి స్వచ్చోద్యమ ప్రేరకాలైన పాటల శ్రవణానందంలో వందల, వేల రోజులుగా తమకిష్టమైన గ్రామ శుభ్ర సుందరీకరణ ఎంత సముచితంగా జరుగుతుందో ఊహించండి.

 

ఈ రహదారిలో వీళ్ళ ఆదర్శ కృషి ఈ వారంలో ఐదవ నాటిది. ఒక కిలోమీటరు వరకు పెదప్రోలు పంచాయితిపరిధి దాక నెరవేరింది. బండ్రేవు కోడు కాలువ వంతెన దగ్గరి కల్వర్టు నేడు కూడ సుందరీకర్తల కృషికి గురై మరింత రోడ్డు భద్రత, కాల్వగట్టు శుభ్రత సమకూరినవి.  అందుకవసరమైన మరింత మట్టిని దూరం నుండి మోసి సర్దారు. గార్డు నుండి బైట పడి, అదుపు తప్పి పెరిగిన పెద్ద పూల చెట్టుకు కూడ సుందరీకరణ సేవలు లభించాయి.

 

ఇది కాక వడ్లమర దక్షిణ కొస కల్వర్టు నుండి తూర్పు లోతట్టున గడ్డి, చిందర వందర పిచ్చి ముళ్ళ కంపలు, తీగలు కూడ నలుగురు కార్యకర్తల కత్తుల కెరగా దొరికినవి! అక్కడి వంతెన ఉత్తర భాగాన చచ్చి ఎండి, వికారంగా ఉన్న తాడి చెట్ల మీద కొందరు కర్యకర్తల కళ్ళు పడ్డాయి గాని, ఈ రోజు సమయం చాల లేదు.

 

మిగిలిన కార్యకర్తల సంగతేమంటే వాళ్ల కోసం ఎదురు చూస్తున్న రహదారి తూర్పు భాగం ఉండనే ఉంది. అక్కడక్కడ గడ్డి, ఎవరో ఎందుకో ప్లాస్టిక్ సంచుల్లో నింపి విసిరేసిన అన్నం ఎంగిలి పొట్లాలు, ఖాళీ మద్యం సీసాల వంటి దరిద్రాలు తిష్ట వేస్తే - కత్తో, గొర్రో, పారో ఉపయోగించి మరొక 5060 గజాల ఆ ఖాళీ చోటును బాగు చేసి, మొక్కల్ని ట్రిమ్ చేసి, మరింత ఆహ్లాదకరంగా మార్చిన కృషి వాళ్లది!

 

ఇవి కాక రోడ్డుకు పడమర దిక్కున అడవి తంగేడు, తురాయి మొక్కలను ఇద్దరు కార్యకర్తలు ఈ వేళ నాటారు. 

 

6.20 తరువాత కాఫీ కబుర్లు ముగిసి జరిగిన సమీక్షా సమావేశంలో డాక్టరు DRK గారు ఈ నాగాయలంక మార్గంలోని శుభ్ర హరిత శోభను ప్రస్తావించి, తమ ఆలోచనలు కొన్నిటిని కార్యకర్తల ముందు ఉంచారు. యార్లగడ్డ గ్రామ స్వచ్చోద్యమ బాధ్యుడైన తూము వేంకటేశ్వరరావు గారు తమ 703 దినాల నిరంతర ప్రయత్నాన్ని వివరించి, ముమ్మారు తనివి తీర గ్రామ స్వచ్ఛ శుభ్ర సౌందర్య సాధక నినాదాలను ఎలుగెత్తి నేటి బాధ్యతలను ముగించారు.

 

          2021* వ నాటి మన విధిత కర్తవ్యాల కోసం రేపటి వేకువ మనం కలుసుకో దగ్గ ప్రదేశం - బండ్ల సుబ్బ నాగన్న ఆశ్రమమే!

 

          ప్రజారోగ్య పరిరక్షణ

 

స్వచ్చోద్యమ చల్లపల్లి చరిత్ర మేదనగా...

సామాజిక ఋణం తొలుగు తాత్త్వికత ఆయుధముగ...

వందలాది గ్రామాలకు ప్రజారోగ్య పరిరక్షణ

పట్ల గొప్ప స్ఫూర్తినింపు ఒక సాహస ప్రయత్నం!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

03.09.2021.