2221* వ రోజు ....           04-Sep-2021

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం!

 

2221* వ నాటి జాతీయ రహదారి బాధ్యతలు.

 

శనివారం (04.09.2021) వేకువ కూడ 4.21 కే స్వచ్ఛ కార్యకర్తల సంసిద్ధత! నాగాయలంక రహదారి శుభ్ర – సుందరీకరణమే వాళ్ళ లక్ష్యం. అన్ని పని ముట్లతో ఆగింది మాత్రం బండ్ల సుబ్రహ్మణ్యాశ్రమం ఎదుట. ఈ వేళ జరిపిన కృషి మూడు విధాలుగా! శ్రమదాతలైతే 19 మంది. అంటే 6.10 సమయానికి పని గంటల లెక్క సుమారు 35 కావచ్చు!

 

ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణ మెంత ఉన్నదో గాని, పరిశుభ్రత మాత్రం తక్కువనే చెప్పాలి. కొద్దిపాటి నిర్మాణం జరుగుతున్న  వెనుక భాగం సరే – ప్రహరీ వెలుపల రహదారి దాక ఖాళీ స్థలం సుందరీకర్తలకు నచ్చలేదు. ఆ నలుగురూ అరగంట పాటు కష్టించి అపరిశుభ్రత – అసౌకర్య పరిస్థితిని చక్కదిద్దారు.

నిన్న నాటిన గద్దగోరు, ఎర్ర తురాయి మొక్కలకు కంప కట్టడమొకటీ, క్రొత్తగా మరి కొన్ని పాదులు త్రవ్వి, ఇంకొన్ని బిళ్ళ గన్నేరు పూల మొక్కలు నాటడ మొకటీ నలుగురైదుగురి ఈ నాటి కార్యక్రమం!

 

మిగిలిన కార్యకర్తల మూడో విభాగం రహదారికి తూర్పున గడ్డి చెక్కుడు, పిచ్చి – ముళ్ళ మొక్కల, తీగల చెలుగుడు, క్రింద పెరగ వలసిన పూల మొక్కల కడ్డుపడుతున్న దట్టమైన కొన్ని పెద్ద కొమ్మల నరుకుడు వంటి పనులు చేస్తూ పోయింది. అసలక్కడ చెట్ల పచ్చదనం ఎంత చిక్కగా ఉన్నదంటే – పైన మబ్బుల దాక, ప్రక్కల రహదారి దాక చెట్లు రెక్కలు చాస్తూ – వెలుతురు తగ్గిపోయేంతగా; మళ్ళీ కొన్ని ప్లాస్టిక్ సంచుల తుక్కు, ఖాళీ మద్యం సీసాల రొస్టు కూడ పనిలో పనిగా తొలగిపోయినవి.

 

 

ఇక – చీపుళ్ళ వారి శ్రమదానంతో అందంగా కనిపిస్తున్న విశాల రహదారిని ప్రత్యక్షంగానో, వాట్సాప్ చిత్రాలలో పరోక్షంగానో వీక్షించండి! పనిలో పనిగా 2 గంటల పాటు పని సమయంలో ఈ కార్యకర్తల నేర్పరితనాన్ని, సూక్ష్మ దృష్టినీ, అంకిత భావాన్ని కూడ పరిశీలించండి. ఆపై నచ్చనదనుకొంటే -  రేపటి నుండి వచ్చి కార్యకర్తలతో చేతులు కలపండి! వచ్చినా రాకున్నా దయచేసి, వీధుల్ని అపరిశుభ్రం చేయకండి!

 

నేటి తుది ఛాయా చిత్ర సమయాన – 6.30 కు డాక్టరు గారి సమీక్షా చర్యకు ముందు మరొకమారు తన గ్రామ స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య సాధనా సంకల్ప నినాదాలను వినిపించిన అవకాశం రామానగర నివాసి – రాజుదే.

 

ఆదివారం నాటి వేకువ మనం కలుసుకోదగిన చోటు కూడ – నేటి వలెనే – బండ్ల సుబ్రహ్మమణ్యం గారి ఆశ్రమం దగ్గరే!

 

          గాంధీజీ బాటలోనే...      

 

స్వచ్చోద్యమ చల్లపల్లి చరిత క్రమంబెట్టిదనగ...

సామాజిక ఋణం తీర్చు తాత్త్వికతే ఆయుధముగ

గాంధీజీ కలలు గన్న గ్రామ వికాసం కోసం

కలవరించు స్వచ్చోద్యమ కారుల ఒక పెను పయనం!  

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

04.09.2021.