2231* వ రోజు ....           18-Sep-2021

 కేవలం ఒక్కసారికే వాడదిగిన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

సుమ సుందర – హరిత వైభవ రహదారిలో 2231* వ నాటి శ్రమానందం.

 

శనివారమైన 18-09-2021 వ తేదీ వేకువ 4.24 సమయానికే ఉద్యుక్తులైన 17 మంది కాక, నిముషాల క్రమంలో జత కలిసిన స్వచ్చంద శ్రమదాతలు – మొత్తం 33 మంది తమతో బాటు ఈ పరిసర గ్రామాల వారందరికీ శ్రేయస్కరంగా నిర్వహించిన శుభ్ర – సుందరాకృతులకు సాక్ష్యమైన కాసానగర పరిసర ప్రాంతాన్ని ప్రతి ఒక్కరూ పరిశీలించాలి.

 

“ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము  

నరుడు నరుడౌటె ఎంతొ దుష్కరము సుమ్ము!...”

 

అని ఒక మధ్యయుగం అరబిక్ కవి చెప్పినట్లు ఈ స్వచ్ఛ – సుందరోద్యమం మానవత్వానికి జ్ఞాపిక గాను, గ్రామ సామాజిక బాధ్యతల ప్రతీక గాను, కష్టమే ఐనా ఇష్టం గాను, ఏడెనిమిదేళ్లుగా నిర్వహిస్తున్న ఒక అద్భుతం! ఇందుకు గాను వాళ్లెంచుకొన్నది బ్రహ్మ ముహూర్త సమయం! కనుకనే – ఈ వేకువ :

 

-  4.50 వేళప్పుడు ఒక సుందరీకర్త ఎత్తైన నిద్ర గన్నేరు చెట్టు పైకెక్కి సదరు హరిత వృక్షాన్ని కొన్ని కొమ్మలు కత్తిరించి, మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాడు.

 

- మరొక రైతు మహాశయుడు ఈత చెట్టును ట్రిమ్ చేస్తున్నప్పుడు తన మోకాలికి ఈతముల్లు లోతుగా గుచ్చుకొన్నా, తన వంతు కృషిని మాత్రం ఆపలేదు!

 

- వారం రోజుల జలుబూ, జ్వరాలు తెచ్చిపెట్టిన నీరసంతో కూడ ఆ సీనియర్ వైద్యుడు రహదారి శుభ్రతకు ప్రయత్నించి, తూలి పోయే పరిస్ధితి రాగా – కారులో కూర్చొని పర్యవేక్షిస్తున్నాడు!

 

- చల్లపల్లి సుందరోద్యమ బాధ్యతల్ని మోసే వైద్యురాలేమో (ఈమెకు గత నాల్గు రోజుల్లో రెండు – మూడు దఫాలుగా సెలైన్ ఎక్కించారు!) రకరకాల పూల మొక్కల సుందరాకృతుల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నది!

 

- రాత్రి కురిసిన వర్షం తడిలోనే చతికిల బడి రోడ్డు ప్రక్కల గడ్డినీ, దుష్ట మొక్కల్ని చెక్కుతూ, నరుకుతూ, బాధ్యతా రహితులు విసిరిన ప్లాస్టిక్ పొట్లాలను, ఖాళీ సారా సీసాలను, ఎంగిలాకుల్ని, సిగిరెట్ల ముక్కల్ని ఏరి ఇందరు విశ్రాంత ఉద్యోగులు, గృహిణులు తమ నివాసాలకు రెండు మూడు కిలోమీటర్ల దూర రహదారి నెందుకు శుభ్రపరచాలని ఏ గ్రామస్తులైనా ఆలోచిస్తే వాళ్ళకి ధన్యవాదాలు!

 

6.25 కు కాఫీలు ముగించి, తూములూరి లక్ష్మణరావు గుర్తుచేసిన గ్రామ స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య బాధ్యతాయుత నినాదాలకు ముమ్మారు ప్రతిస్పందించి, డాక్టరు గారి సముచిత అభినందన పూర్వక సమీక్షావచనాలు విని కార్యకర్తలు గృహోన్ముఖులయ్యారు.

 

ఆదివారం నాటి సామాజిక కర్తవ్యం కోసం మనం వేకువనే కలిసి సాగదగిన చోటు కాసానగర్ కాసారమే!

 

          ఇట్టి వాళ్ళకె నా ప్రణామం – 8

 

గ్రామ మంతటి మేలు కోరక – కలిసి సాగే సౌఖ్య మెరుగక

పౌరులుగను – మానవులుగా – బాధ్యతలు గుర్తించి నడవక

ప్రమత్తంగా బ్రతుకు వాళ్ళకు పాఠ్యగ్రంధం వ్రాయు పూనిక

కదం త్రొక్కే స్వచ్ఛ – సుందర కార్యకర్తకు నా ప్రణామం!     

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

18.09.2021.