2234* వ రోజు ....           22-Sep-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

గ్రామ సుందరోద్యమంలో - 2234* వ నాటి ఘట్టం.

 

          బుధవారం వేకువ జరిగిన రహదారి మెరుగుదల ప్రయత్నంలో కలిసి వచ్చిన శ్రమదాతలు 20 మంది: శ్రమానంద ప్రదేశం కాసానగర్ నుండి అమరస్తూపం దిశగా,

 

          “ఏదో-రెండు మూడు రోజులు కాక-2 వారాలకు పైగా-ఇందరు కార్యకర్తలు- ఈ రెండు కిలో మీటర్ల “రహదారినే శుభ్రపరుస్తున్నారా అని చదువరులెవరైనా శంకించకుందురు గాక! నడుమ 2 రోజులు గ్రామ ప్రధాన వీధి పారిశుద్ధ్య –సుందరీకరణల ఎడం వచ్చింది. ఇక ఈ రహదారేమో సువిశాలం; కార్యకర్తలు 25-30 మందైతే బాటను కలుషితం చేయగల జనం వేల మంది. నచ్చ చెప్పుడే తప్ప స్వచ్చోద్యమ స్వభావం అదలించి-బెదరించేది కాకపోవడం వంటి కారణాలెన్నని!

 

          నేటి ఉదయం కూడ కార్యకర్తల ప్రయత్న లోపమే మున్నది గనుక! చెట్ల, పూల మొక్కల కత్తిరింపులు, సుందరీకరణం యథావిధిగానే జరిగింది. ముగ్గురేమో మరికొన్ని పాదుల్ని గడ్డి-మొక్కలు పీకి సరిదిద్దారు. ఇద్దరు మొక్కలను నిటారుగా నిలిపి, త్రాడు కట్టి కర్ర ఊతమిచ్చే పనిలో నిమగ్నులు. రోడ్డుమీదికి వస్తున్న గడ్డి తీగల్ని నరకడమూ,  ఇసుక-దుమ్ముల్ని గోకే పనిలో నలుగురైదుగురు, మిగిలిన వారు ప్లాస్టిక్ సంచుల, ఖాళీ సీసాల, ఎంగిలాకుల వంటి వాటి ఉనికిని సహించక ఏరి, దంతెలతో పోగులు చేసి, రోడ్డు దిగువ కాల్వ అంచున సర్దే విశిష్ట కార్యంలో!

 

6.20 తదుపరి కాఫీలు ముగించినపుడు మూడుమార్లు చల్లపల్లి స్వచ్చ-పరిశుభ్ర –సౌందర్య సంకల్పాన్ని నినదించినది శివబాబు! చిన్న పిట్ట కథ చెప్పి, సహనమెంత కష్టమో, దాని ఫలితమెంత మధురమో గుర్తు చేసినది డాక్టరు దాసరి రామ కృష్ణ మహోదయులు.

 

రేపు- గురువారం నాటి వేకువ మనం ఇంకొక మారు కలుసుకొని, బాధ్యతకు పూనుకోవలసినచోటు- నాగాయలంక బాటలోని కాసానగరం చెరువు గట్టే!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

21.09.2021.