2239* వ రోజు ....           29-Sep-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

పాగోలు రహదారి సుందరాకృతి కోసం 2239* వ నాటి ఉత్సాహం.

 

బుధవారం నాటి ఆహ్లాదకర చల్లని వేళ - 4.28 సమయంలోనే - గత వారపు శుభ్ర – సుందర పూనిక ప్రదేశంలోనే – మహాబోధి/NTR పాఠశాల సమీపంలోనే 14 మంది ఊరి మెరుగుదల ఔత్సాహికులు కాక, ఇంకా పది మంది సైతం కష్టించిన రహదారి శుభ్రతల తీరు తెన్నులు పరిశీలించండి! కిలోమీటరు నిడివి కూడ లేని ఈ రహదారిని ఇందరు – ఇన్నాళ్ళు స్వచ్చీకరిస్తున్న వైనాన్ని గ్రామస్తులు పట్టించుకోండి!

 

జీతం – భత్యం లేని, తమది కాని, చాల మంది ఇష్టపడని ఈ మురికి పనుల్ని 2239* దినాలుగా ఈ ఉద్యోగులు, వృత్తి నిపుణులు, మహిళామతల్లులు, వృద్ధ మూర్తులు ఇంత బాధ్యతగా ఎందుకు చేస్తున్నారో ఈ ఉభయ గ్రామాల – పరిసరాల పౌరులు గట్టిగా ఆలోచించవలసిన సమయం ఇది! (కీర్తి – గుర్తింపుల కోసమనో – పదవుల కోసమనో – కబ్జాల కోసమనో – ఎక్కణ్ణుంచో వచ్చి పడే లక్షల్లక్షల డబ్బు కోసమో కార్యకర్తలీ పని చేస్తున్నారని సందేహించే అమాయకులకు ఒక నమస్కారం!) హక్కులతో బాటు బాధ్యతలు కూడ స్వీకరించే మంచితనం ఇంకా మిగిలే ఉందని గ్రహించి, గ్రామస్తుల ఉమ్మడి శ్రేయస్సు కోసం మరింత మంది చైతన్య శీలురు ముందుకు రావలసిన తరుణం ఇది!

 

కార్యకర్తల ఈ నాటి శ్రమదాన పోకడలిలా ఉన్నాయి:

 

1. ముందస్తు పక్కా ప్రణాళికతో కొమ్మలు కోసే యంత్రంతో సంసిద్ధులైన ముగ్గురు కార్యకర్తలు విద్యుత్తీగలకంటుకోబోతున్న కొన్ని వేప చెట్లెక్కి అవసరానుసారం ఎత్తైన కొమ్మల్ని చీకటిలోనే కోసేయడం. (వీళ్ళిందుకు పూనుకోకుంటే – తామే నాటి – పెంచిన కొన్ని చెట్ల మొదటికే మోసం వచ్చేది!)

 

2. మరి కొన్ని తాటి మొక్కల్ని, ఈత మొక్కల్ని సమూలంగా తొలగించడం. పనికిరాని ముళ్ళ – పిచ్చి మొక్కలకి కూడ అదే గతి. పనికొచ్చే తాడి చెట్లనేమో సుందరీకరించడం, పూల మొక్కల్ని ఒరిగి పోకుండ నిలిపి, ఆసరా కల్పించి, రహదారి సుందరీకరణ ఎంతగా చెయ్యాలో అంతగా ప్రయత్నించడం.

 

3. ఇక ఏడెనిమిది మందైతే రోడ్డు ప్రక్కల గడ్డిని చెక్కి, కోసి మిట్ట పల్లాలను సమం చేసి ఆనందించే పని! ఇవన్నీ తెల్లారక ముందటి నిర్వాకాలు.

 

4. 6.00 గంటల కటూ ఇటూ సమయాన ఏడెనిమిది మంది చకచకా పూర్తి చేసే పనేమంటే – నరికిన కొమ్మ రెమ్మల్ని, గడ్డిని, పిచ్చి – ముళ్ళ కంపల్ని దంతెలతో పోగులు చేసి, ట్రాక్టర్లో నింపుకొని, దూరంగా ఉన్న చెత్త కేంద్రానికి బట్వాడా చేయడం!

 

5. చీపుళ్ళ వారి విధి – వాట్సాప్ చిత్రంలో కనిపిస్తున్నట్లు రోడ్డునూ, మార్జిన్లనూ క్షుణ్ణంగా శుభ్రపరచడమే!

 

            యదావిధిగా 6.20 సమయాన నేటి కృషి సమీక్ష, రేపటి స్వచ్చీకరణ ప్రదేశ నిర్దేశమూ,

కొత్త లక్ష్మీనారాయణరావు గారి త్రిగుణాత్మక గ్రామ స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య సాధనా సంకల్ప నినాదాల ప్రకటన, ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు ఫ్లెక్సీ నిరోధక విన్నప ప్రస్తావనా వచ్చాయి.

 

            ఇదే రహదారిలో ఈ మహాబోధి పాఠశాల వద్దనే రేపటి వేకువ మన పునర్దర్శనం.

 

          ఇట్టి వాళ్ళకె నా ప్రణామం 14

 

ఆర్కిటెక్ట్ కృషి ఆదిమంగా చిన్నాజి – వేంకటరమణ పూనిక

అత్యధిక ధన వ్యయంతోడుగ – కార్యకర్తల బలం నీడగ

జనాహ్లాదపు మొదటి మెట్టుగ – చల్లపల్లికి తొట్టతొలిగా

వర్ణరంజిత జల వినోదం వచ్చెనిదుగో - మా ప్రణామం!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

29.09.2021.