2240* వ రోజు ....           30-Sep-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

2240* వ నాటి శ్రమదాన దృశ్యం కూడ పాగోలు బాటలోనే.

 

ఈ సెప్టెంబరు మాసాంతాన – గురువారం వేకువ 4.20 కే మహాబోధి విద్యా సంస్థ కడ ఉద్యుక్తులైన 15 మందీ, నాలుగైదారు నిముషాల్లో వచ్చి కలిసిన 13 మందీ – వెరసి 28 మంది 110 నిముషాల పాటు నిర్వహించిన స్వచ్ఛ – యజ్ఞంతో సదరు రహదారికి మరికొన్ని మెరుగులూ, ప్రయాణికులకు మరికొంత ఆహ్లాదమూ సమకూరినవి!

 

మరి వీరిలో 65 – 70 – 75 ఏళ్ల వయోధికులూ, 8 – 9 గంటలకే తమ కార్యాలయాలకు హాజరు కావలసిన ఉద్యోగులూ, వైద్యులూ, ఎడతెగని ఇంటి పనుల్లో మునిగిపోవలసిన గృహిణులూ, దివ్యాంగులూ ఉన్నారు గాని, అక్కడి పాఠశాల సంబధీకులు, అపార్ట్ మెంట్ల నివాసులు, పరిసర గృహస్తులూ మచ్చుకైనా ఎందుకుండరు? ఇదే సమయంలో – ఇదే స్వచ్ఛ సుందర మార్గంలో చాల మంది వేకువ నడక మిత్రులున్నారు గాని, మోహమాటానికైనా వాళ్ళు స్వచ్చంద శ్రమదానంలో వేలు పెట్టలేదు!

 

“పరిశుభ్రతే పరమాత్మ తత్త్వం” (Cleanliness is Godlyness) అనే ఆంగ్ల సామెతను చదివి, విని వదిలేయక – 28 వేల మంది గ్రామస్తుల్లో కనీసం 28 మందైనా ఆచరిస్తున్నారు గదా – అని ఇప్పటికీ సంతోషించాలి! వీరిలో కనీసం ఇద్దరైనా పాగోలు నుండి వచ్చి పాల్గొన్నందుకభినందించాలి!

 

కారల్ మార్క్సు మహాశయుడు కార్మిక కర్షకులనుద్దేశించి ఏ 150 ఏళ్ల నాడో “దోపిడీ మీద పోరాడండి – పోయేదేమీ లేదు – దాస్య శృంఖాలాలు తప్ప” అని నినదిస్తే – స్వచ్ఛ కార్యకర్తలు “గ్రామ కశ్మల కాలుష్యం మీద రోజూ 2 గంటలు ఉద్యమిస్తాం – మాకు పోయేదేముంది? మా అనారోగ్యం, ఊరి అసౌకర్యాలు తప్ప” అనుకొని 2240* రోజులుగా పురోగమిస్తూనే ఉన్నారు!

 

        ఏదో ఒక శుభోదయాన మిగిలిన సోదర గ్రామస్తులు సైతం పాల్గొనే అవకాశాన్ని సానుకూల దృక్పధంతో చూద్దాం!

 

        మూడు భాగాలుగా విడిపోయిన కార్యకర్తలు నెరవేర్చిన నేటి రహదారి స్వచ్ఛ – శుభ్ర – సుందరీకరణ చర్యల విధంబెట్టిదనగా :

 

- పాఠశాల ముఖద్వారానికి దక్షిణంగా నిన్న శేషించిన కశ్మలాల తొలగింపు.

 

- ఉత్తరాభిముఖంగా డజను మంది నిర్వహించిన అనవసర వృక్షశాఖల ఖండనమూ, గడ్డి – పిచ్చి ముళ్ల మొక్కలు తొలగిస్తూ రహదారి మండనమూ!

 

- ఏడెనిమిది మంది శ్రమించినదేమంటే – 20+44+2 (మహాగని+ మూడు రంగుల గద్ద గోరు పూల మొక్కలు+వేప) చెట్లను NTR పాఠశాల మలుపు దాక – ముఖ్యంగా దారి పడమరగా పాదులు త్రవ్వి, నాటడమే!

 

మూడు నాల్గు మాసాలు గడిస్తే ఈ పాగోలు రోడ్డు ప్రక్కల ఇన్ని పూల మొక్కలు పూస్తే – ఇంకెంత రమణీయ దృశ్యమౌతుందో చూడాలి.

 

        నేటి దైనందిన కృషి సమీక్షా సమయంలో గ్రామ పరిశుభ్ర – స్వచ్ఛ – సౌందర్య సాధన కోసం ముమ్మారు నినదించినది మాలెంపాటి అంజయ్య గారు

 

        రేపటి వేకువ మన పునర్దర్శన ప్రదేశం కూడ NTR పాఠశాల ప్రవేశద్వారమే!

 

          ఇట్టి వాళ్ళకె నా ప్రణామం 15

 

ఎవరు మెచ్చిన – ఎవరు నొచ్చిన – విమర్శలతో విజృంభించిన –

ప్రశంసలతో ఊపి వదిలిన – స్వచ్ఛ – శుభ్ర ప్రయత్నమందే

సుస్థిరంగా ప్రయాణించే – లక్ష్య సాధనలోన మునిగే -

చరితపుటలో నిలిచిపోయే సాహసికులకు మా ప్రణామం!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

30.09.2021.