2241* వ రోజు ....           01-Oct-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

ఊరికి దూరంగా – పాగోలు బాటలో - 2241* వ నాటి శ్రమ వినోదం.

 

స్వచ్ఛ – సుందరీకరణ ప్రదేశం మారవచ్చు గాని, కార్యకర్తల అభినివేశం, పని విధానం మారవు. అది 2000 రోజులు కానీ – 3000 దినాలు కానీ, ఊరంతటి మేలు కోసం నిస్వార్ధ – నిష్కామ శ్రమయజ్ఞం చేసే పరిణత మనస్కులకు విసుగు, నిరాశ వంటి వెందుకు కలుగుతాయి?

 

        అక్టోబరు మాసపు ప్రధమ దివసాన వేకువ 4.24 సమయానికే గుమికూడిన 18 మందీ, 4.30 కు చేరుకొన్న పదిమందీ 6.10 వరకూ పాగోలు గ్రామ పరిధిలోని విభాగ భవన సముదాయం (అపార్ట్మెంట్స్) దగ్గరి రహదారినీ, తదుభయ పార్శ్వాలనూ, దక్షిణపు మురుగు కాల్వనూ శక్తి వంచన లేకుండ శుభ్రపరిచారు. అలవాటుగా – అలవోకగా పని చేసుకుపోయే ఈ 28 మంది కార్యకర్తలకిదొక అద్భుత కార్యక్రమం కాకపోవచ్చు గాని, చూస్తున్న సున్నిత మనస్కులకు, పరిశీలకులకు మాత్రం ఏ రోజుకారోజు ఇదొక వింతే!

 

        అసలీ గ్రామ సమాజమే వింతగా అనిపించదా? ఏళ్ల తరబడీ వీధుల్ని, బైట రహదారుల్నీ మెరుగుపరుస్తున్న – అందగిస్తున్న – హరిత సుమ సుందరాహ్లాదమయం చేస్తున్న స్వచ్ఛ కార్యకర్తల కృషీ, దీక్ష ఒక ప్రక్క! దీనికి సమాంతరంగా వీధుల్లో గొడ్లను కట్టేసి, పేడ దిబ్బల్ని కూడ రోడ్డు మీదే ఉంచి, మురుగు కాల్వల్ని చెత్తతో నింపి, గుడ్డ బ్యానర్లైతే పోనీ అనుకోవచ్చు – అడుగడుక్కీ ఫ్లెక్సీలతో పర్యావరణాన్ని నష్టపరిచే చర్యలు మరొక ప్రక్కా ఉంటే – అదెంత విడ్డూరం.

 

        సరే – వీటన్నిటికతీతంగా నేడు స్వచ్ఛ కార్యకర్తలు సుమారు 50 పని గంటల పాటు NTR పాఠశాలకు కుడి ఎడమల తమ విధులు తాము నిర్వర్తించారు. అపార్ట్మెంట్ల దగ్గరి గేటులో గడ్డి చెక్కడం, రోడ్డు మార్జిన్ల పిచ్చి మొక్కల్ని తొలగించి, విశాల పరచడం, విద్యుత్ ప్రసారాల కంతరాయం కల్గిస్తాయనుకొన్న ఎత్తైన – తామే శ్రద్ధగా పెంచిన కొన్ని కొమ్మల్ని తొలగించడం, తమ పిల్లల్లాగే సాకిన పూల మొక్కల పాదులు సవరించి, కలుపు తీసి, వాటితో తమ అనుబంధాన్ని పెంచుకోవడం వంటివన్నీ షరా మామూలే!

 

        భారీ వర్షాలకు కోసుకుపోయిన చోట గడ్డి – ఆకులు – కొమ్మల్ని పేర్చి, మట్టి కప్పి రహదారి భద్రతకు పూచీ పడడం మాత్రం వీళ్ళకికొత్తా?

 

 

        ఇడుగో – ఈ 60 ఏళ్ల కార్యకర్త ఒక మాజీ రైతూ, ప్రస్తుత భూస్వామీ. బాట ప్రక్క ఆకులు, ముళ్ళ కొమ్మలూ, చెత్త నిండిన మురుగు కాల్వలో దిగి, వందల కొద్దీ తాటి గింజల్నీ, ప్లాస్టిక్ తుక్కునూ చేతుల్తో దేవి, ఒడ్డుకు చేర్చే వంతు ఈయనిది. (ఇలాంటి కార్యకర్తల తెగింపుపనుల్నుండి స్ఫూర్తి పొందడం, పొందకపోవడం గ్రామ ప్రజల వంతు!)

 

        ఈ బాటను చీపుళ్లతో ఊడ్చి – ఊడ్చి స్వచ్ఛతరం చేసిన మహిళా కార్యకర్తలకు సదరు రహదారి ప్రయాణికుల తరపున ధన్యవాదాలు!

 

        ఏ ఒక్క నెలా మర్చిపోకుండా స్వచ్చోద్యమ బాసటగా ఇస్తున్నట్లే ఈ నెల కూడా మనకోసం మనం ట్రస్టుకు 5,000/- విరాళాన్ని సమర్పించిన మన వితరణ శీలి (ప్రాతూరి శాస్త్రి) గారికి కూడా ధన్యవాదాలు.

 

        6.25 కాలపు సరదా సమావేశంలో స్వచ్ఛ యార్లగడ్డ సమేత స్వచ్చోద్యమ చల్లపల్లి శుభ్ర – సుందర సంకల్ప నినాదాలను ముమ్మారు చాటి, రేపటి తన యార్లగడ్డ గ్రామ ద్వితీయ స్వచ్చోద్యమ వార్షికోత్సవానికి కార్యకర్తల్ని ఆహ్వానించినవారు తూము వేంకటేశ్వరరావు కాక మరెవరు? మన స్వచ్ఛ – సుందరోద్యమ సారధి గారి సముచిత సూచన ప్రకారం – రేపు మనమంతా ఏకరూప దుస్తుల్తో – ద్విచక్ర మోటారు వాహనాలతో –

 

        రేపటి వేకువ కలుసుకోదగిన ప్రాంతం పాగోలు రహదారిలోనే!

 

            ఈ మహాత్ములకే  ప్రణామం 16

 

మానవీయులు – మాననీయులు – మహాదర్ములు – మహాపురుషులు

మచ్చుకైనా కానుపించని చచ్చు బడిన సమాజ మందున

ఒక సమష్టి ప్రయోజనమునకు ఉదాహరణగ ప్రయాణించిన

చల్లపల్లి స్వచ్ఛ – సుందర సాహసికులకు నా ప్రణామం!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

01.10.2021.