2242* వ రోజు ....           02-Oct-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు!

 

ఎన్నికైన ప్రజాప్రతినిధుల అభినందనలో అభ్యర్ధనలో స్వచ్ఛ సైనికులు- @2242*.

 

శనివారం వేకువ 17 మంది స్వచ్చీ కృషివలురు కలుసుకొన్న సమయం 4.27 ఐతే అప్పుడు 18 మందీ, కొన్ని క్షణాల్లో 10 మందీ గంటన్నర పాటు బాధ్యతలు భుజానికెత్తుకొని శ్రమించినది పాగోలు మార్గంలోని NTR పాఠశాల తొలిగేటు దగ్గర, అక్కడి రోడ్డు తూర్పు పడమరలుగా, ముఖ్యంగా అపార్ట్మెంట్ల ప్రక్కన.

 

స్వచ్చోద్యమానికి ముందు ఇదొక పరమ జుగుప్సాకర నరకసదృశ - మహిళా బహిర్భూమి! ఇప్పుడది ఏ గ్రామమైనా అసూయపడదగిన పుష్ప భరిత హరిత శుభ్ర సుందర ఆదర్శ మార్గం! ఏడేళ్ళ క్రిందట స్వచ్ఛ సేవకులతో చేతులు కలిపిన స్థానికులలెందుకో ఇప్పుడు ముభావులైపోయారు. పాగోలు గ్రామం నుండి మాత్రం ఇద్దరు బాధ్యులు అండగా నిలుస్తున్నారు.

 

ఈ రోజు కూడ కార్యకర్తలు రెండు ముఠాలుగా విడిపోయి, పాగోలు వైపు కొందరు నిన్నటి తరువాయిగా స్వచ్ఛ శుభ్రతల ప్రయత్నం చేశారు. రోడ్డు మార్జిన్ల గడ్డి గోకుడు, పూల మొక్కల పరామర్శ, వ్యర్ధాల ఏరుడు వంటి వన్నమాట!

 

            మిగిలిన ఎక్కువ మంది మాత్రం బండ్రేవు కోడు వంతెనకూ అపార్ట్మెంట్లకూ నడుమనే కష్టించారు. (ఈ కష్టించారుఅనేది నా మాట – ‘శ్రమలో ఆనందం వెదుకుకొన్నారుఅనేదే నిజం!) పని వేళలో చలోక్తులు, శ్రమకు గుర్తుగా చల్లని వేళలో గూడ చెమటలు ఈ కార్యకర్తలెంతగా తమ బాధ్యతా నిర్వహణలో మునిగి సంతోషం పొందుతున్నారో అనేందుకు గుర్తులు!

 

            6.00 సమయంలో స్వగ్రామ స్వచ్చోద్యమాశయాలైన స్వచ్ఛ పరిశుభ్ర సౌందర్య సంకల్ప నినాదాలను గర్జించిన వారు అడపా గురవయ్య మహాశయుడు. అతడే సందర్భోచితంగా జాతిపిత జన్మదినాన్ని పురస్కరించుకొని, గాంధీజీ ప్రవచననాన్ని గుర్తు చేశాడు.

 

            ‘మనకోసం మనంసంస్థ ఖర్చుల నిమిత్తం పాగోలు వాస్తవ్యుడైన 70 ఏళ్ల విశ్రాంత చిరుద్యోగి కంఠంనేని రామబ్రహ్మం గారు 50,000/- చెక్కును అందించారు. (ఇది తొలి మారేమీ కాదు చల్లపల్లికీ, పాగోలుకీ అతడిచ్చిన భూరి విరాళం మొదటిడీ కాదు చివరిదీ కాదు సుమా!)

 

            అప్పుడిక కార్యకర్తలంతా పాగోలు మీదుగా మేకావారిపాలెం, కోమలా నగర్, మొదటి, రెండవ, ఎనిమిదవ వార్డుల్లోనికి ప్రదర్శనగా వెళ్లి ఇటీవల ఎన్నికైన ZPTC, MPP, MPTC ప్రతినిధుల్ని కలిసి, అభినందించి, ప్లాస్టిక్ ఫ్లెక్సీలను గాక గుడ్డ బ్యానర్లను మాత్రమే వాడి, ప్రోత్సహించి, పర్యావరణ భద్రత కల్పించాలని లిఖిత పూర్వకంగా అభ్యర్ధించి, వాళ్ళ సానుకూల హర్షామోద స్పందనలకు సంతోషించి, 7.20 కి ఇళ్ళు చేరుకొన్నారు. స్వచ్ఛ యార్లగడ్డ రెండేళ్ల శ్రమదానాన్ని పురస్కరించుకొని ఈనాడు ఆ గ్రామంలో మధ్యాహ్నం 3 గం. లకు జరిగే స్వచ్చంద శ్రమదాతల వేడుకకు ఏకరూప దుస్తులతో మన కార్యకర్తలందరికీ సుస్వాగతం. 

 

            రేపటి వేకువ మనం కలిసి శ్రమించవలసిన చోటు పాగోలు మార్గంలోని అపార్ట్మెంట్ల సమీపమే!

 

       ఈ మహాత్ములకే  ప్రణామం – 17

 

ఎవ్వరిని దోచేయ బూనని ఎవరి నవమానింప జాలని

సొంత లాభం మానుకొని తమ ఊరి మేలుకు ప్రయత్నించిన

వివాద రహిత మహోద్యమంలో వీర విక్రమ ఘనత జూపిన

చల్లపల్లి స్వచ్ఛ సుందర సైనికుల కిదె నా ప్రణామం! 

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

02.10.2021.