2243*వ రోజు ....           03-Oct-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు!

 

ఆదివారపు ఆటవిడుపులో కూడ 34 మంది స్వచ్ఛ కృషి - @2243*.

 

ఇది నా ఊరు, నాతో బాటు జీవిస్తున్న ఈ గ్రామస్తులు నావాళ్లు, ఈ ఊరి మెరుగుదల, సోదర గ్రామస్తుల స్వస్త జీవనం నా బాధ్యత...అనుకొని, సుదీర్ఘ కాలంగా శ్రమిస్తున్న 17 మంది కార్యకర్తలు ఈ వేకువ 4.25 సమయానికే పాగోలు మార్గపు దక్షిణాన అపార్ట్మెంట్ల గేటులో వేచి ఉండడాన్ని, అంతేమంది కాస్త వెనుకా - ముందుగా వచ్చి కలవడాన్ని గమనించారా?

 

ఇక అక్కడ నుండి రెండు గంటల పాటు సుమారు ½ కిలోమీటరు రహదారిలో సాగిన స్వచ్చంద శ్రమదానమూ, బండ్రేవు కోడు మురుగు వంతెన దాక నెలకొన్న 30 మంది స్వచ్ఛ కృషి కారుల విన్యాసాలూ వీక్షించడం నా బోటి వాళ్ల అదృష్టమైతే ఈ కొద్ది మంది తప్ప ఇతర గ్రామస్తులు గాని కనీసం సమీప నివాసితులు గాని తొంగి చూడకపోవడం కాలమహిమ!

 

            ఈ విశ్లేషణల్ని ప్రస్తుతం ప్రక్కన పెట్టి, గత పదినాళ్ళ స్వచ్ఛ సైనికుల శ్రమార్పిత పాగోలు రహదారిని ముఖ్యంగా NTR పాఠశాల మలుపు దాక దాని పచ్చదనం పరవశాన్నీ, వసంత కాలం తొందరపడి వచ్చినట్లున్న వందలాది రంగురంగుల పూల మొక్కల సోయగాన్నీ, బారులు తీరిన చెట్ల దర్పాన్నీ, చూపు త్రిప్పుకోనీయని పారిశుధ్యాన్నీ... చూడకుండా, ఆనందించకుండా, వర్ణించకుండా ఎలా ఉండగలను?

 

 

            గ్రామస్తులో, గ్రామేతర ప్రయాణికులో మాలాగే అనుభూతి చెందితే ఈ స్వచ్ఛ పరిశుభ్ర రాదారి సౌందర్యం వెనుక ఈ హరిత సౌమనస్యాల వెనుక ఇంతటి పరిమళ భరిత ఆహ్లాదాల మాటున ఎందరి శ్రమజీవన సంకల్పం, ఏ సదుద్దేశం దాగి ఉన్నవో అసలివి సమాజానికి అనుసరణీయాలు ఔనో, కావో గుర్తించాలని మనవి! పాతకాలపు సినిమా కోసం సి. నారాయణ రెడ్డి అద్భుతంగా వ్రాసిన ఘంటశాల అత్యద్భుతంగా పాడిన ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో ఈ బండల మాటున ఏ గుండెలు  మ్రోగెనో ఓఓఓ...అనే అమరశిల్పి జక్కన్న పాటను మనం గుర్తు తెచ్చుకోవాలి!)

 

            ఈ నాటి స్వచ్ఛ సుందరోద్యమ కధ కూడ వేలాది రోజులుగా జరుగుతున్నదే గాని అందులోని ముఖ్యాంశాలు ప్రస్తావిస్తాను :

 

- పాఠశాల ఎదుట ఏడుగురు కార్యకర్తలు శుభ్రపరిచిన  రోడ్డునే స్వచ్చీకరించిన దారినే ఏ చిన్నలోపమూ లేకుండ మెరుగులు దిద్దడం.

 

- ఎప్పుడైనా సుందరీకరణ బృందం దృష్టే వేరు ఆలోచనలే ప్రత్యేకం!

            అసలే అందంగా ఉన్నా సరే వీళ్ళు ఎన్ని పూల మొక్కలకు మరింత సుందరాకృతి ఎలా తెచ్చారో చూసి తీరాల్సిందే!

 

- ప్రతి చెట్టునూ పరిశీలించి, ఏ కొమ్మను ఉంచాలో దేన్ని త్రుంచాలో ఏ మొక్కను ఎటుగా వంచాలో తమ బుద్ధినుపయోగించి, కత్తులు ప్రయోగించి, ప్రయాణికుల ఆహ్లాదాన్ని పెంచేందుకు ఏడెనిమిది మంది ప్రయత్నాలు!

 

- రోడ్డు మార్జిన్ల గడ్డి చెక్కి, ముళ్ళ మొక్కలుంటే తొలగించి, ఊడ్చి, శుభ్రతకే శుభ్రత నేర్పుతున్న మరికొందరి తాదాత్మ్యం!

 

- నివాస గృహాల గేటుల్లోపలికి చొచ్చుకు పోయి, దిక్కు మాలిన పిచ్చి ముళ్ళ చెట్ల చిట్టడివిని, తీగల్ని తొలగించిన వైనం....

 

            6.25 సమయంలో డాక్టరు DRK గారు నిన్నటి నేటి కార్యకర్తల శ్రమను, త్యాగాన్ని కీర్తించే ముందు నివాస గృహాల వారింకా నిద్రిస్తున్న వేళ స్వచ్ఛ శుభ్ర సౌందర్య సంకల్ప గేయంలాగా ముమ్మారు జాగృత నినాదాలు పలికిన ఘంటశాల విజయరమ గారికి ధన్యవాదాలు!

 

రేపు సోమవారం నాటి మన శ్రమజీవన సాఫల్యత కూడ పాగోలు మార్గంలోని మురుగు కాల్వ వంతెన దగ్గరే!

 

            ఈ మహాత్ములకే ప్రణామం – 18

 

అదే స్పష్టత అదే గాఢత అవే విస్తృత ప్రయత్నమ్ములు

తొలి దినమ్ముల గ్రామ సేవల దొడ్డ గుణముల పరంపరలూ

ఇన్ని వేల దినాల మీదట ఈ నిబద్ధత అప్రమత్తత

నెలకొనిన స్వచ్ఛంద సేవకు నిండు మనసులతో ప్రణామం!   

                         

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

03.10.2021.